మాజీ ఐపీఎస్‌ రఘువీర్‌రెడ్డిపై విచారణకు ఆదేశాలు.. ఎందుకంటే

2024 ఎన్నికల సమయంలో రఘువీర్‌రెడ్డి నంద్యాల ఎస్పీగా విధులు నిర్వహించారు.;

Update: 2025-08-07 13:41 GMT

పదవీ విరమణ చేసిన మాజీ ఐపీఎస్‌ అధికారి రఘువీర్‌రెడ్డి మీద అనేక అభియోగాలు ఉన్నాయని, ఎన్నికల సమయంలో నిబంధనలను పక్కన పెట్టి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉనాయని, అందువల్ల ఆయనను విచారించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటెలిజెన్స్‌ ఐజీ రామకృష్ణను విచారణ అధికారిగాను, అనంతపురం డీఐజీ షీమునిని ప్రజెంటింగ్‌ ఆఫీసర్‌గాను ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. విచారణ చేపట్టిన అనంతరం పూర్తి స్థాయిలో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో రఘువీర్‌రెడ్డి నంద్యాల ఎస్పీగా పని చేశారు. ఆ సయమంలో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ ఆరోపణలు చేసింది. ఎన్నికల సమయంలో నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని ప్రముఖ పాన్‌ ఇండియా సినిమా యాక్టర్‌ అల్లు అర్జున్‌ కలవడం, నంద్యాలలో అల్లు అర్జున్‌ పర్యటించడం, భారీ ర్యాలీ నిర్వహించారని, వీటికి నాటి ఎస్పీ రఘువీర్‌రెడ్డి అనుమతించారనే ఆరోపణలు ఉన్నాయి. అల్లు అర్జున్‌కు అనుమతించిన ఎస్సీ రఘువీర్‌రెడ్డి అదే రోజు నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పర్యటన ఉన్నా కూడా దానికి అనుమతులు ఇవ్వకుండా పక్కన పెట్టి అల్లు అర్జున్, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని, ఆ ర్యాలీకి అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు సృష్టించే విధంగా టీడీపీ శ్రేణులు వ్యవహరించారంటూ నాడు ఎన్నికల అధికారులు కేసులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా మాజీ ఐపీఎస్‌ అధికారి రఘువీర్‌రెడ్డిపై వచ్చిన అన్ని అభియోగాలపై విచారణ జరిపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Tags:    

Similar News