కొనసాగుతున్న ఏపీ పీఏసీ ఓటింగ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియ నేటి ఉదయం 9.00 గంటలకు శాసనసభ కమిటీ హాల్లో ప్రారంభమైంది
By : Admin
Update: 2024-11-22 06:18 GMT
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియ నేటి ఉదయం 9.00 గంటలకు శాసనసభ కమిటీ హాల్లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర రిటర్నింగ్ అధికారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను రాష్ట్రం లోని 175 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఎన్నుకుంటారు. శాసనసభ ఫైనాన్షియల్ కమిటీల్లో భాగంగా శాసనసభ ప్రజాపద్ధుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ), శాసనసభ అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్ కమిటీ) మరియు ప్రభుత్వ సంస్థల కమిటీ (పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ) లు ఉన్నాయి.
ఈ మూడు కమిటీల్లో ప్రతి కమిటీకి 12 మంది సభ్యులు ఉంటారు. వీరిలో తొమ్మిది మంది శాసనసభ నుండి, మిగిలిన ముగ్గులు శాసన పరిషత్ నుండి ఎన్నిక కాబడతారు. అయితే తొమ్మిది మంది శాసనసభ్యులకు బదులు పది మంది సభ్యులు నామినేట్ చేయడం వల్ల శాసనసభ నుండి సభ్యుల ఎన్నికల ప్రక్రియను అనివార్యంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా శాసనమండలి సభ్యులు ముగ్గురికి బదులు ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినందు వల్ల శాసనమండలి నుండి సభ్యులను ఎన్నుకునే ప్రక్రియను నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది.
ప్రజా పద్దుల కమిటీకి సభ్యులుగా ఎన్నిక అయ్యేందుకు శాసనసభ్యులు ఆనంద బాబు నక్కా, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, బి జయ నాగేశ్వర్ రెడ్డి, కొల్లా లలిత కుమారి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజగోపాల్ శ్రీరామ్, రామాంజనేయులు పులపర్తి (అంజి బాబు), పి విష్ణు కుమార్ రాజు పోటీ పడుతున్నారు. అంచనాల కమిటీలో సభ్యులుగా ఎన్నికయ్యేందుకు శాసనసభ్యులు అఖిల్ ప్రియా భూమా, బండారు సత్యానంద రావు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జయకృష్ణ నిమ్మక, జోగేశ్వరరావు వి, కందుల నారాయణరెడ్డి, మద్దిపాటి వెంకట రాజు, పార్థసారథి వాల్మీకి, పసిం సునీల్ కుమార్, ఏలూరి సాంబశివరావు పోటీ పడుతున్నారు
అదేవిధంగా ప్రభుత్వ సంస్థల కమిటీలో సభ్యులుగా ఎన్నిక అయ్యేందుకు శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు, చంద్రశేఖర్ తాటిపర్తి, ఈశ్వర్ రావు నడికుడిటి(ఎన్‌ఈఆర్), గిడ్డి సత్యనారాయణ, గౌతు శిరీష, కూనా రవికుమార్, కుమార్ రాజా వర్ల, ఆర్ వి ఎస్‌కేకే రంగారావు, బేబీ నాయనా, తెనాలి శ్రావణ్ కుమార్, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పోటీ పడుతున్నారు. ఉదయం11.00 గంటల వరకు మొత్తం 115 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎస్ సవిత, ఎండి ఫరూక్, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, అనగాని సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు.