హైదరాబాద్ లో ఒలంపిక్సా ?

ఒలంపిక్స్ నిర్వహణంటే నాలుగురోజుల కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించినట్లని రేవంత్ అనుకున్నట్లున్నారు.

Update: 2024-08-20 06:00 GMT

రేవంత్ రెడ్డికి ఏమో అయినట్లుంది. ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు గతంలో హైదరాబాద్ లో గతంలో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ నిర్వహించిన పద్దతిలోనే హైదరాబాద్ లో ఒలంపిక్స్ కూడా నిర్వహించాలని రేవంత్ చెప్పారు. భవిష్యత్తులో ఒలంపిక్స్ నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధంగా ఉండాలన్నారు. రేవంత్ ప్రకటనతో ఉన్నతాధికారులందరు ఆశ్చర్యపోయుంటారు. ఎందుకంటే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహణ వేరు ఒలంపిక్స్ నిర్వహణ వేరన్న విషయం రేవంత్ కు తెలీదేమో.

ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అంటే ఏవో గుప్పెడు దేశాలు పాల్గొనటంతో సరిపోతుంది. కానీ ఒలంపిక్స్ నిర్వహణంటే నాలుగురోజుల కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించినట్లని రేవంత్ అనుకున్నట్లున్నారు. ఒలంపిక్స్ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండదు. దేశ ప్రభుత్వాలు మాత్రమే బిడ్డింగులో పాల్గొనాలి. అదికూడా ఎనిమిది సంవత్సరాలకు ముందే బిడ్డింగు పూర్తయిపోతుంది. 2028 ఒలంపిక్స్ ను లాస్ ఏంజిలిస్ లో నిర్వహించాలన్న విషయం 2020లోనే నిర్ణయమైపోయిన విషయం రేవంత్ కు తెలుసో తెలీదో. ఒలంపిక్స్ అంటే క్రీడాకారులు, వారి వ్యక్తిగత స్టాఫ్, నిర్వాహకులు అందరు కలిసి తక్కువలో తక్కువ 15-20 వేలమంది పాల్గొంటారు. 20 రోజుల పాటు జరిగే విశ్వక్రీడలకు సుమారు 3 లేదా 4 లక్షల కోట్లు ఖర్చవుతుంది.

ఒలంపిక్స్ నిర్వహించిన ఏ దేశం కూడా ఆర్ధికంగా లాభపడలేదు. విశ్వక్రీడలు ఏషియన్ గేమ్స్, ఒలంపిక్స్ లాంటివి నిర్వహిస్తే విదేశీ కరెన్సీ వస్తుందన్నది నిజమే అయినా చేసిన ఖర్చుతో పోల్చుకుంటే వచ్చే విదేశీకరెన్సీ చాలా చాలా తక్కువ. ఒలంపిక్స్ నిర్వహించిన తర్వాత బ్రెజిల్, జపాన్ లాంటి దేశాలు ఆర్ధికంగా దెబ్బతిన్నాయి. పైగా ఒలంపిక్స్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఒలంపిక్ విలేజెస్ కొన్ని దేశాల్లో నిరుపయోగంగా మిగిలిపోయాయి. ఒలంపిక్స్ లో పాల్గొనా,లి బంగారు పతకాలు సాధించాలన్న రేవంత్ ఆలోచన, లక్ష్యం మంచిదే. ఇందుకు ఒక రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తే సరిపోతుందనటంలో సందేహంలేదు.

ఈమధ్యనే ముగిసిన ఒలంపిక్స్ లో మన హాకీ జట్టు మంచి ప్రతిభను చూపించి కాంస్య పతకాన్ని అందుకుంది. జట్టు కాంస్యపతకం అందుకోవటాన్ని చూసి యావత్ దేశం సంతోషించింది. అయితే అందుకు కారణం మాత్రం ఒడిస్సా ప్రభుత్వమే అని ఎంతమందికి తెలుసు. దాదాపు నాలుగేళ్ళ పాటు మొత్తం హాకీ జట్టు నిర్వహణకు అయిన వందల కోట్ల రూపాయల ఖర్చును ఒడిస్సా ప్రభుత్వమే భరించింది. హాకీ మ్యాచుల నిర్వహణకు అవసరమైన అంతర్జాతీయ స్టేడియంలను నిర్వహించటం, విదేశాల్లో మ్యాచులు ఆడటానికి ప్రయాణ ఖర్చులు, బస ఏర్పాట్లు, జట్టుకు ప్రోత్సహకాలు, అవసరమైన అంతర్జాతీయ కోచ్ లను ఏర్పాటు చేయటం లాంటి అనేక అంశాలను ఒడిస్సా ప్రభుత్వం దగ్గరుండి చూసుకోవటంతో మన జట్టు కాంస్య పతకాన్ని అందుకుంది.

రేవంత్ కూడా తొందరలో ఏర్పాటుచేయబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీని దక్షిణకొరియాలోని కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటితో అనుసంధానం చేయాలని అనుకోవటం, అంతర్జాతీయ కోచ్ ల్ ను ఏర్పాటు చేయించాలని అనుకోవటం ఓకే. లాస్ ఏంజిలిస్ ఒలంపిక్స్ లో హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే స్పోర్ట్స్ యూనివర్సిటి విద్యార్ధులు బంగారు పతకాలు సాధించి ఇండియాకు గర్వకారణంగా నిలవాలని అనుకోవటం సంతోషించాల్సిన విషయమే. ఇప్పటికే మంచి క్రీడాకారులుగా పేరున్న వారిని స్పోర్ట్స్ యూనివర్సిటిలో చేర్చుకుని వారికి అంతర్జాతీయ కోచ్ లతో అత్యుత్తమ శిక్షణ ఇప్పిస్తే బంగారు పతకాలు తేగలరేమో చెప్పలేం. ఇంతవరకు రేవంత్ చేతిలోని పనే కాని ఏకంగా ఒలంపిక్స్ నిర్వహణ అనటమే విచిత్రంగా ఉంది.

తెలంగాణా బడ్జెట్టే రు. 2.29 లక్షల కోట్లయినపుడు ఏకంగా 4 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో ఒలంపిక్స్ నిర్వహణ సాధ్యమేనా ? రాజకీయనేతలకు నోటికొచ్చినట్లు మాట్లాడేయటం అలవాటైంది. ఆ నిముషానికి ఏదో ఒకటి మాట్లాడేసి తర్వాత మరచిపోతారు. సాధ్యాసాధ్యాలగురించి ఆలోచన లేకుండా మాట్లాడేయటంతోనే జనాల్లో అబాసుపాలవుతున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు కూడా అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించి నవ్వులపాలైన విషయం గుర్తుండే ఉంటుంది. ఇపుడు హైదరాబాద్ లో ఒలంపిక్స్ నిర్వహించాలన్న రేవంత్ ప్రకటనను కూడా అలాగే ఉంది.

Tags:    

Similar News