Exclusive - Encounter | ఒడిశా ఎన్ కౌంటర్ మృతుల్లో చలపతి లేరా.!?

మావోయిస్టు అగ్రనేత చలపతి మరణించారా? తప్పించుకున్నారా? ఇదీ ఆయన కుటుంబీకులు వ్యక్తం చేస్తున్న సందేహాలు..;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-22 14:57 GMT

ఛత్తీస్ ఘడ్ - ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి గారి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి మరణించారా? మళ్లీ తప్పించుకున్నారా? ఆయన ఎక్కడున్నారు? భద్రతా బలగాలు వెల్లడించిన సమాచారం మేరకు మృతుల్లో చలపతి ఉన్నారా? ఆ మృతదేహం ఆయనదేనా? అనే సందేహాలు తెరమీదకి వచ్చాయి.

"ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి కుటుంబీకుల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు అవి"
ఒడిస్సా సరిహద్దులో సోమవారం నుంచి రెండు రోజుల పాటు సాగిన ఎన్కౌంటర్లో సుమారు 20 మందికి పైగా మావోయిస్టులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. వారిలో కొన్ని ఫొటోలు, వీడియాలు ప్రసారమాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అందులో..
చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మత్యం పైపల్లె గ్రామానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కార్యదర్శి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది.
చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతం అంటే.. మదనపల్లి డివిజన్లో పీపుల్స్ వార్ కార్యకలాపాలు 1984 నుంచి 2006 వరకు ఉధృతంగా సాగేవి.
2003లో అలిపిరి వద్ద సీఎం ఎన్ చంద్రబాబుపై మైన్స్ పేల్చిన తర్వాత, అరెస్టులు ఎన్కౌంటర్లతో చిత్తూరు జిల్లాలో మావోయిస్టు కళాభాలు తగ్గుముఖం పట్టి అని చెప్పవచ్చు.
అనూహ్యంగా చత్తీస్గడ్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిస్సా రాష్ట్ర కార్యదర్శి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి కూడా మృతుల్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ ఘటనలో చలపతి ఎప్పుడు మరణించారు అనే విషయంలో స్పష్టత లేదు. ప్రతాపరెడ్డి (చలపతి) స్వగ్రామం తవణంపల్లి సమీపంలోని మత్యం పైపల్లె గ్రామంలో పరిస్థితి తెలుసుకునేందుకు తిరుపతి నుంచి 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధులు వెళ్లారు.
మేము వెళ్లే సరికే ఇంకొందరు మీడియా ప్రతినిధులు కూడా మాతో జతకలిశారు. దీంతో పైపల్లెలో సందడి ఏర్పడింది. చాలా మంది ఇళ్ల నుంచి బయటికి రాకుండానే తొంగి చూస్తూ ఉండడం కనిపించింది.
చలపతి పెద్ద అన్న శ్రీరాములు రెడ్డి భార్య కుమారి ఇంటి వద్ద కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఛత్తీస్ ఘడ్ అడవుల్లో మావోయిస్టుల రక్తంతో ఎరుపెక్కాయి. ఇక్కడ చలపతి ఇంటి వద్ద ఆయన వదిన కుమారి ఎర్రచీరలో కనిపించారు. మరో వివాహిత మౌనిక కూడా ఎరుపురంగు దుస్తుల్లో కనిపించారు. మౌనిక చలపతికి మనవరాలు. అంటే అన్న కూతురు. వారితో..
మాకు మేము వారితో పరిచయం చేసుకున్న తరువాత వెంటనే మౌనిక పొలం వద్ద తన తండ్రి ఉదయకుమార్ రెడ్డిని తీసుకుని రావడానికి వెళ్లింది. ఈయన చలపతి పెద్ద అన్న శ్రీరాములురెడ్డి కొడుకు. అంటే చలపతిరెడ్డి ఈయనకు బాబాయ్ అవుతారు.
ఉదయకుమార్ రెడ్డి వచ్చే లోపు మావోయిస్టు చలపతిరెడ్డి వదిన కుమారిని పలకరించే ప్రయత్నం చేసింది..

"ఏమ్మా మీ ఇంటిలో ఎరుపురంగు అంటే చాలా ఇష్టంగా ఉంది" అంటే, బతుకులే కాలిపోయాక ఏముంది నాయానా.. అని చలపతి వదిన కుమారి కన్నీటిపర్యంతం అయ్యారు. కాసేపటికి చలపతిరెడ్డి కూడా ఇంటికి చేరుకున్నారు.
వారిద్దరూ ఏమన్నారంటే...
ప్రతాప్ (రామచంద్రారెడ్డి గారి ప్రతాపరెడ్డి)ని మావోయిస్టు ఉద్యమం నుంచి బయటికి తీసుకురావడానికి మూడుసార్లు ప్రయత్నించాం. కుదరలేదు అని చెప్పారు. ప్రతాప్ ను తలచుకుని వారు కుమిలిపోయారు. 35 ఏళ్లుగా రాకపోకలు లేవు. మా బాబాయ్ ప్రతాప్ ఎక్కడ ఉన్నాడనేది కూడా తెలియలేదు. అని ఉదయకుమార్ రెడ్డి చెప్పారు. టీవీల్లో చూసి, చనిపోయినట్లు తెలిసిందని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. నిన్నటి నుంచి చాలా మంది ఇదే చెబుతున్నారు. కానీ...
"ప్రతాప్ చనిపోయాడంటే మాకు నమ్మ బుద్ధి కావడం లేదు" అని మావోయిస్టు చలపతి వదిన కుమారి, ఈమె కుమారుడు ఉదయకుమార్ రెడ్డి చెబుతున్నారు. కారణాలు ఏమిటని ప్రశ్నిస్తే,


"మృతదేహం మొహం ఏమాత్రం ప్రతాప్ పోలికలతో లేదు" అనేది వారి సమాధానం. ఇంకోమాట కూడా చెప్పారు.
మా ప్రతాప్ అంతపెద్ద నాయకుడు అయ్యారని కదా చెబుతున్నారు!
బందోబస్తు లేకుండా అంత ఈజీగా ఉంటారా? అనేది కుమారి, ఉదయకుమార్ రెడ్డి సంధించిన ప్రశ్నలు.
ఇప్పుడే కాదు. సార్...
"పోయిన సంవత్సరం కూడా ఒడిశా సరిహద్దులో జరిగిన కాల్పుల్లో మా ప్రతాప్ (చలపతి) చనిపోయాడని చెప్పారు. అదే పేర్లు వెల్లడించారు. అప్పుడు కాల్పుల నుంచి తప్పించుకున్నట్లు తరువాత ప్రకటించారు.
ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తోంది. పత్రికల్లో వచ్చిన టోపీ పెట్టుకున్న ప్రతాప్ కు మృతదేహం ఉన్న స్థితికి ఏమాత్రం సరిపోవడం లేదు" అని ఉదయకుమార్ రెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. అంటే ప్రతాపరెడ్డి చనిపోలేదు. జీవించే ఉన్నాడని ఏదో మూల మిణుకుమిణుకు మంటున్న ఆశ వారి మాటల్లో ప్రతిధ్వనించింది.
ప్రతాప్ రెడ్డితో కలిసి తీయించుకున్న ఫొటోలు కూడా ఏమీ లేవని ఆయన వదని కుమారి స్పష్టం చేశారు. చిన్ననాటి నుంచి నేను చూసిన ప్రతాప్ లా లేరు అని ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి చూపించిన మృతదేహం ఫొటో చూసిన కుమారి ఆ విధంగా వ్యాఖ్యానించారు. ఆమె కొడుకు ఉదయకుమార్ రెడ్డి కూడా అదే మాట చెప్పారు.
ఒడిశా అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో బంధువులు మాత్రమే వారి మృతదేహాలు గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంది. దీనికి ప్రతాపరెడ్డి స్వగ్రామంలో ఉన్న ఆయన వదిన కుమారి, అన్న కొడుకు ఉదయకుమార్ రెడ్డి ఎంతమాత్రం సరిహద్దుకు వెళ్లడానికి సుముఖంగా లేరు.
"ప్రతాప్.. మమ్మలిని కాదని వెళ్లిపోయాడు. మాకు దూరం అయ్యాడు. ఇక అక్కడికి వెళ్లి చేసేదేమీ లేదు" అని వారిద్దరూ జీరబోయిన కంఠంతో వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే..
ఛత్తీస్ ఘడ్ ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన వారి వివరాలు అధికారికంగా వెల్లడించే వరకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది.
Tags:    

Similar News