ఓబుళాపురం మైనింగ్ కేసు– శ్రీలక్ష్మికి ఊరట
శ్రీలక్ష్మి ‘అవినీతి’ ఆరోపణ మీద విచారణ చేయాలన్న హైకోర్టు తీర్పు మీద విచారణ;
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో తనపై సీబీఐ నమోదు చేసిన కేసులపై ఆమె స్పందించింది. తనపై సీబీఐ నమోదు చేసిన కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జి పిటీషన్‌ను జూలై 25న కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీలక్ష్మి మీద కేసులు నమోదు చేసి, ప్రతివాదిగా ఉన్న సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఇదే కేసులో హైకోర్టు 2022 నవంబరులోనే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. దీనిపైన సీబీఐ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. అలా పరిగణలోకి తీసుకోకుండా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు నుంచి తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి చేసిందని సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అయితే దీనిని సుప్రీం కోర్టు తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపింది. దీనిపైన ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది.
ఈ మేరకు సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు మళ్లీ ఈ కేసును విచారించి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటీషన్‌ను కొట్టేసింది. ఆ మేరకు జూలై 25న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో పాటుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా కొన్ని ప్రత్యేక ఆరోపణలు ఉన్నాయని, వీటి విషయంలో ఏదైనా చెప్పుకునేది ఉంటే ట్రయల్ కోర్టు ముందుకే శ్రీలక్ష్మి వెళ్లాలని పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వులను శ్రీలక్ష్మి సవాల్ చేశారు. ఈ నెల 12న సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపైన శుక్రవారం విచారణ చేపట్టింది. సీనియర్ నాయ్యవాది సిద్దార్థ దవే శ్రీలక్ష్మి తరపున వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నింటిని ఆయన ధర్మాసం ముందు వినిపించారు. వాదనలు విన్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా సీబీఐ మీద కూడా వ్యాఖ్యలు చేసింది. ఇలా చేస్తే ఏ అప్పిలూ కొనసాగదని, దీనిపై హైకోర్టు ఇచ్చి ఆర్డర్ విచిత్రమైన ఆర్డర్ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఓబుళాపురం కేసుకు సంబందించి, శ్రీలక్ష్మి మీద భవిష్యత్‌లో సీబీఐ ఎలా వ్యవహరించబోతోందనేది ఆసక్తికరంగా మారింది.