మధ్యాహ్నం 2గంటల్లోపు స్టేషన్‌కు రావాలని పేర్ని నానికి నోటీసులు
వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైఎస్‌ఆర్‌సీపీ నేతలను వెంటాడుతోంది. కీలక నేతలను కేసులు, నోటీసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నారు. తాజాగా పేర్ని నాని వంతు వచ్చింది. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు పేర్ని నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు, మచిలీపట్నం అసెంబ్లీ నియోజక వర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్చి పేర్ని కిట్టూకు కూడా నోటీసులు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలలోపు వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ మేరకు జారీ చేసిన నోటీసులకు పేర్ని నాని ఇంటి గోడలు, గేట్ డోర్‌లకు అంటించారు. శనివారం రాత్రి ఈ నోటీసులు అంటించారు. నోటీసులు పేర్ని నాని ఇంటికెళ్లిన పోలీసులు వారు లేక పోవడంతో గోడలకు వాటిని అంటించారు. పేర్ని నానికి సంబంధించిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమయ్యాయని ఆయన సతీమణి జయసుధపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో పేర్ని నానికి, కానీ ఆయన కుమారుడు కిట్టూకి కానీ సంబంధం లేదని, కావాలనే కూటమి ప్రభుత్వం వేధిస్తోందని, అందులో భాగంగానే వారిద్దరికీ పోలీసులు ద్వారా నోటీసులు పంపారనే విమర్శలు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. అయితే ఈ కేసు ప్రస్తుతం న్యాయ విచారణలో ఉంది. ఈ సమయంలో పోలీసులు పేర్ని నానికి, ఆయన కుమారుడు కిట్టూకి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.