మద్యం దుకాణాల ఏర్పాటుపై మహిళలు కన్నెర చేశారు. విద్యాసంస్థలు, గ్రామం సమీపంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా సారా వ్యతిరేక ఉద్యమంతో దేశం దృష్టిని ఆకర్షించిన నెల్లూరులో సీపీఎం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. తిరుపతిలో కూడా అదే పరిస్థితి కనిపించింది. కాకినాడ జిల్లా తుని వద్ద మహిళలు తిరగబడ్డారు. మద్యం షాపు ఏర్పాటు చేయడానికి వీలుగా నిర్మించ తలపెట్టిన నిర్మాణ పునాదులకు వేసిన రాళ్ళను పేకలించి వేశారు.
"గ్రామానికి దగ్గర మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదు" అని ఆ గ్రామ మహిళలు ఆగ్రహ వ్యక్తం చేశారు. విద్యాసంస్థలకు సమీపంలో మద్యం దుకాణాలు ఏంటి ? అని నెల్లూరు జిల్లాలో మహిళా సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత నూతన మద్యం విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ycp ప్రభుత్వ కాలంలో మద్యం దుకాణాల నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించారు. గుడులు, విద్యాసంస్థలకు దూరంగా కొన్ని రోజుల కిందటి వరకు అంటే ఐదేళ్లపాటు మద్యం దుకాణాలు నిర్వహించారు. ఈ ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించిన మద్యంపై అనేక ఆరోపణలు వెలువెత్తిన విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు మాటలతో "వైసీపీ అమలులోకి తెచ్చిన మద్యం బ్రాండ్లపై ర్యాగింగ్" చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే బ్రాండ్ మద్యం అందుబాటులోకి తీసుకువస్తాంఅని చెప్పిన మేరకు సీఎం చంద్రబాబు అమలు చేశారు.
దీనికంటే ముందే, రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి అమలులో ఉన్న తమిళనాడు తరహా "టాస్మాక్ మద్యం దుకాణాలు" నూతన మద్యం విధానాలతో రద్దు చేశారు. తిరిగి పాత పద్ధతిలోనే ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాల నిర్వహణ అప్పగించడానికి లాటరీ సిస్టం అమలు చేశారు. దీనివల్ల 3396 మద్యం దుకాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తుల రూపంలోనే 1797. 64 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఆదాయం లభించింది.
2017 : మార్చి నెలలో అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వంలో చివరిసారి ప్రైవేట్ మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. అప్పట్లో 4, 380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు 76 వేల దరఖాస్తులు అందాయి. కాగా,
2019: ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఆ విధానం రద్దుచేసి, బార్లకు మాత్రమే లైసెన్స్ ఇచ్చింది. ప్రైవేటు స్థానంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది. ఏడేళ్ల తర్వాత అంటే..
2024 అక్టోబర్ 16వ తేదీ మళ్లీ లాటరీ విధానం అమలు చేశారు. దీని ద్వారా, ఆదాయం పెంచుకునే మార్గాన్ని టీడీపీ కూటమి ఎంచుకున్నట్లు స్పష్టం అవుతుంది. "ఎన్నికల ప్రచార సమయంలో కూడా నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకు వస్తాం" అని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం ప్రస్తావనార్హం. అదే సమయంలో, "99 రూపాయలకే చీప్ లిక్కర్ వాటర్ బాటిల్ కూడా అందుబాటులో ఉంచుతతాం"అని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేశారు. ప్రైవేటు మద్యం దుకాణాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత,"నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చాం. తక్కువగా తాగండి" అని కూడా సీఎం చంద్రబాబు హితవు పలకారు. ఇంతవరకు సక్రమంగా ఉన్నప్పటికీ, పట్టణాలు గ్రామాల్లో మద్యం దుకాణాల ఏర్పాటు వ్యవహారం వివాదంగా మారుతోంది. నిరసనలకు ఆజ్యం పోస్తోంది. ఎలాగంటే..
నెల్లూరులో నిరసనలు
సారా వ్యతిరేకోద్యమానికి బీజం పడింది నెల్లూరు జిల్లాలోనే. దీని వెనక వేరే మూలాలు ఉన్నప్పటికీ, ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన దూబగుంట రోశమ్మ తోపాటు ఆ జిల్లా పేరు జాతీయస్థాయిలో మారు మోగింది. ఇదంతా గతం! ఆ పోరాటం స్ఫూర్తి ఇంకా నెల్లూరు జిల్లాలో కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రైవేటు దుకాణాల ఏర్పాటుపై ఆ జిల్లా సీపీఎం, ఐద్వా, విద్యార్థి యువజన సంఘాలు ఆందోళనకు దిగాయి.
నివాసాలు విద్యాసంస్థల సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం సమంజసం కాదు అని ఐద్వా నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మస్తానీబీ అభ్యంతరం చెప్పారు. "ఆ ప్రాంతాల్లో స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి అభ్యంతరం చెబుతుంటే తమ సంఘం పక్షాన వెళ్లి అండగా నిలిచాం" అని ఆమె తెలిపారు.
"నెల్లూరు నగరంలో ఐదో డివిజన్ శ్రీనివాసనగర్ మలుపు వద్ద షాప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ దుకాణం దగ్గర నుంచే పాఠశాలలకు వెళ్లాలి. మహిళల సంచారం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రోడ్డు డివైడర్ పై కూర్చుని మద్యం సేవిస్తున్నారు"అని మస్తానీబీ వివరించారు.
వెంకటేశ్వరపురం సమీపంలోని విజయ మిల్క్ డైరీ వద్ద కూడా ఇదే పరిస్థితి. ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని ఓ ప్రార్థన మందిరం దగ్గర మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారు. జగదీష్ నగర్ సమీపంలో పిల్లల పార్కు వెళ్లే మార్గం వద్ద ఆసుపత్రులు, విద్యాసంస్థలు ఉన్నాయి. అని ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తానీబీ వివరించారు. ఈ ప్రాంతాల్లో స్థానికులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్యం షాపులు ఏర్పాటు చేయడానికి అభ్యంతరం చెబుతున్నారు. వారికి తమ సంఘం పక్షాన అండగా నిలిచాము అని ఆమె తెలిపారు. ఈ పరిస్థితిని జిల్లా అధికారులు సమీక్షించి జనావాసాలు, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలకు దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమవుతుందని కూడా ఆమె హెచ్చరించారు.
నెల్లూరు నగరం మైపాడు రోడ్ లోని శ్రీనివాస్ నగర్ లో బ్రాందీ షాపు వద్ద యజమాని సంబంధికులు పోలీసులు మోహరించారు. స్థానికులు ఇక్కడ మద్యం షాపు వద్దని అభ్యంతరం చెప్పారు. ఆందోళనకు అడ్డుకట్ట పడుతుందని తెలిసిన మహిళలు అక్కడ స్వచ్ఛందంగా ధర్నా నిర్వహించారు.
గ్రామంలో అనుమతించం
మా గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దు. అని కాకినాడ జిల్లా తుని సమీపంలోని డి. పోలవరంలో మహిళలు అడ్డుపడ్డారు. గ్రామం సమీపంలో దుకాణం ఏర్పాటు చేయడానికి షాపు దక్కించుకున్న వ్యక్తి తాత్కాలిక భవన నిర్మాణానికి పునాదులు వేశారు. ఆ గాడిలో వేసిన రాళ్ళను అక్కడి మహిళలు బయట పడేశారు. గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని మహిళలు తెగేసి చెప్పారు. గ్రామానికి వెలుపల ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్వాహకులను హెచ్చరించారు.
మున్సిపల్ శాఖ మంత్రి స్పందించాలి
తిరుపతి నగరం ముత్యాలరెడ్డి పల్లి (M.R. Palli) సర్కిల్లో ఉన్న మద్యం షాపు తొలగించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం దుకాణం వద్ధ ధర్నా చేశారు. ఈ మద్యం దుకాణానికి దరిదాపు లోనే దాదాపు 20 కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. "మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ విద్యాసంస్థలు కూడా అక్కడే ఉన్నాయి" అని ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా అధ్యక్షుడు అక్బర్, ప్రధాన కార్యదర్శి రవి గుర్తు చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 20వేల మంది విద్యార్థులు చదువుకుంటున్న విషయం కూడా అధికారులు మర్చిపోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
" రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కాలేజీలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ సమస్యపై మంత్రి స్పందించాలి" అని ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్, రవి డిమాండ్ చేశారు. ఎం ఆర్ పల్లి నుంచి మద్యం షాపు తరలించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు ఎక్సైజ్ సీఐ రామచంద్రకు వినతి పత్రం అందజేశారు.