డ్రగ్స్‌ వద్దు బ్రో.. మంత్రి లోకేష్‌

పాఠశాల గేటు బయటే పాలిటిక్స్‌ అని మంత్రి నారా లోకేష్‌ అన్నారు.;

Update: 2025-07-10 08:35 GMT

డ్రగ్స్‌ వద్దు బ్రో.. అంటూ మంత్రి నారా లోకేష్‌ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌ జోలికి వెళ్ళొద్దని, అవి జీవితాలను సర్వనాశనం చేస్తాయని, క్యాన్సర్‌ వస్తుందని.. అందువల్ల వాటి జోలికి వెళ్ళొద్దని లోకేష్‌ పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్‌ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ అంటే కేవలం రెండు అక్షరాలే కాదని, మనకు నడక నేరించేది, సత్ప్రవర్తన, బాధ్యత, విలువలు, నైతికత నేర్పించేది అమ్మని, అలాంటి అమ్మను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. అమ్మకు అంత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే, తల్లి పట్ల గౌరవం పెంచడానికే తమ ప్రభుత్వం తల్లికి వందనం తీసుకొచ్చామని చెప్పారు.

రాజకీయాలు ప్రభుత్వ బడుల్లో ఉండవని, పాఠశాల గేటు బయటే రాజకీయాలను వదిలేసి లెర్నింగ్‌ అవుట్‌ కమ్స్‌ మాత్రమే స్కూల్స్‌లో ఉండే విధంగా ప్రభుత్వ బడులను నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగా కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతో పాటు ఆటలు, పాటలు, యోగా కూడా నేర్పిస్తున్నట్లు తెలిపారు. తాను చదువుకునే సమయంలో పేరెంట్స్‌ సమావేశాలకు తన తండ్రి సీఎం చంద్రబాబు ఏనాడు రాలేదని, ఇప్పుడు తన కొడుకు దేవాంష్‌ పేరెంట్స్‌ సమావేశాలకు కూడా తాను వెళ్లడం లేదని, తన భార్య బ్రాహ్మణి వెళ్తున్నట్లు చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో గురువులకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. కేవలం క్లాస్‌ రూమ్‌లో పాఠాలు చెప్పి వదిలేయడమే కాకుండా జీవితంలో ఎదగాలని కోరుకుంటారని అన్నారు. తన విద్యార్థులు లైఫ్‌లో పెద్ద స్థానానికి చేరుకుంటే గురువులు ఎంతో సంతోషిస్తారని అన్నారు.
పదో తరగతిలో కానీ, ఇంటర్‌లో కానీ పేద విద్యార్థులు చాలా బాగా రాణిస్తున్నారని, ఇలాంటి వారికి షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. అమ్మ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే బాధ్యతను తీసుకోవాలని విద్యార్తులకు లోకేష్‌ సూచించారు. పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా చాలా బాధ్యతగా ఉండాలన్నారు. లీప్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, పత్రి పేరెంట్‌ దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఇందులో ఉండే విద్యార్థుల వివరాలు, వారి ప్రోగ్రెస్‌ను తెలుసుకోవచ్చన్నారు. అంతేకాకుండా ఇదే యాప్‌ ద్వారా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు కూడా చేయొచ్చని లోకేష్‌ సూచించారు. ఆపరేషన్‌ సింధూర్‌లో ఇదే శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్‌ వీరమరణం చెందారని లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని, వాటిని ఉపయోగించుకొని బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని విద్యార్థులకు లోకేష్‌ సూచించారు.
Tags:    

Similar News