కాకాణికి నో బెయిల్‌

అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని కాకాణి గోవర్థన్‌రెడ్డి మీద నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.;

Update: 2025-04-09 13:46 GMT

మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక సీనియర్‌ నాయకుడు కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో చుక్క ఎదురైంది. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ తవ్వకాలకు పాల్పడినట్టు తనపై అక్రమ కేసులు పెట్టారని, అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని, ఈ అరెస్టుల నుంచి తనను రక్షించాలని కోరుతూ కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. తొందరపడి తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని, పోలీసులు తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపైన సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కాకాణి గోవర్థన్‌రెడ్డికి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. తన మీద పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ కాకాణి దాఖలు చేసుకున్న క్వాష్‌ పిటీషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. బెయిల్‌ మంజూరు చేసేందుకు హైకోర్టు తిరస్కరించింది.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాకాణి గోవర్థన్‌రెడ్డి మీద అనేక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా నెల్లూరు జిల్లాలో క్వార్ట్‌›్జ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాకు పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మీద నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్థన్‌రెడ్డిని ఏ4గా చేర్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు కాకాణి గోవర్థన్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే కాకాణి గోవర్థన్‌రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఈ పరిణామాల్లో తనను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో కాకాణి గోవర్థన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరో టాక్‌ కూడా వినిపిస్తోంది. పోలీసుల నుంచి తనకు హైకోర్టు రక్షణ కల్పిస్తుందని, అరెస్టు చేయకుండా అడ్డుకుంటుందని, కేసును కొట్టేస్తుందని, బెయిల్‌ మంజూరు చేస్తుందని ఆశలు పెట్టుకోవడం వల్ల కాకాణి గోవర్థన్‌రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాలేదా? అనే టాక్‌ వినిపిస్తోంది. అయితే హైకోర్టు కాకాణి గోవర్థన్‌రెడ్డికు వ్యతిరేకంగా ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో ఆయన పోలీసుల విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News