Nirmal|నిర్మల్ ఆర్డీవో కారుకు నిప్పు..స్పృహతప్పిన ఎసై

మండిపోయిన గ్రామస్తులు ఆర్డీవో కారుకు నిప్పుపెట్టారు. గ్రామస్తులు కారుకు నిప్పుపెడుతుంటే వారించిన ఎసైపై దాడిచేసి కొట్టారు.

Update: 2024-11-27 07:27 GMT

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం హింసాత్మకమవుతోంది. తమ నిర్బంధంలో నుండి బుధవారం తెల్లవారుజామున ఆర్డీవో రత్న కల్యాణిని ఎస్పీ జానకి షర్మిల బలవంతంగా తీసుకెళ్ళటంతో గ్రామస్తులు, రైతులు మండిపోతున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిర్మల్ ఆర్డీవోను భారీ బందోబస్తుతో నిర్మల్ ఎస్పీ రక్షించి ఘటనా స్ధలం నుండి తీసుకెళ్ళారు. దాంతో మండిపోయిన గ్రామస్తులు ఆర్డీవో కారుకు నిప్పుపెట్టారు. గ్రామస్తులు కారుకు నిప్పుపెడుతుంటే వారించిన ఎసైపై దాడిచేసి కొట్టారు. దాంతో ఎసై అక్కడే కొద్దిసేపు స్పృహ తప్పిపడిపోయారు.

ఇంతకీ విషయం ఏమిటంటే దిలావర్ పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) ఏర్పాటుచేస్తున్నారు. 40 ఎకరాల్లో కాంపౌడ్ వాల్ తో పాటు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా అయిపోవచ్చింది. ఈ ఫ్యాక్టరీకి అనుమతిచ్చింది బీఆర్ఎస్(BRS) ప్రభుత్వమే. అప్పటినుండే గ్రామస్తులు ఫ్యాక్టరీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళ వ్యతిరేకతను పట్టించుకోలేదు. ఇపుడు నిర్మాణం పూర్తిచేసుకుని కొద్దిరోజుల్లో ఫ్యాక్టరీలో ఇథనాల్ ఉత్పత్తికి యాజమాన్యం రెడీఅవుతోంది. దాంతో దిలావర్ పూర్,గుండంపల్లి, సముందర్ పల్లి, కాండ్లీ, టెంబరేణి, లోలం గ్రామస్తులు, రైతులు కూడా మద్దతుగా నిలబడటంతో వివాదం చాలా పెద్దదయిపోయింది. ఈ నేపధ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం ఐదుగ్రామాల ప్రజ ముఖ్యంగా వందలాదిమంది మహిళలు దిలావర్ పూర్ నేషనల్ హైవేపై రాస్తారోకో మొదలుపెట్టారు. దాంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంబించిపోయింది.


విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని చర్చలు మొదలుపెట్టారు. ఇది ఎంతకీ తెగకపోయేసరికి రాత్రి 6 గంటలప్రాంతంలో ఆర్డీవో రత్న కల్యాణి వచ్చారు. గ్రామస్తులతో చర్చలు జరపటంలో ఆర్డీవో(Nirmal RDO Ratna Kalyani) కూడా ఫెయిలయ్యారు. దాంతో రెండువైపులా మాట మాట పెరిగింది. వెంటనే గ్రామస్తులంతా ఆర్డీవోను కమ్ముకుని ఎత్తి కారులోకి నెట్టేసి తలుపులేసేశారు. కారులో నుండి దిగటానికి ఆర్డీవో ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఆర్డీవోను కారులో నుండి బయటకు తీసుకురావటానికి అక్కడే ఉన్న పోలీసులు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. చివరకు ఆర్ధరాత్రి పైన ఎస్సీ జానకి షర్మిల (Nirmal SP Janaki Sharmila) అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి ఆర్డీవోను విడిపించాలని ప్రయత్నించారు. కలెక్టర్ తమ దగ్గరకు వచ్చి చర్చలు జరిపితేకాని ఆర్డీవోను వదిలేదిలేదని గ్రామస్తులు తెగేసిచెప్పారు. పరిస్ధితి ఉద్రిక్తంగా ఉంటంతో రావటానికి కలెక్టర్ అంగీకరించలేదు. దాంతో పోలీసులు లాఠీచార్జీ చేసి గ్రామస్తులు, రైతులను చెదరగొట్టారు. వెంటనే కారు తలుపులు ఓపెన్ చేసి ఆర్డీవోను ఎస్పీ బయటకు తీసుకొచ్చారు. ఎస్పీచేసిన పని నచ్చని గ్రామస్తులు తిరగబడటంతో అక్కడ పెద్ద గందరగోళం జరిగింది. మళ్ళీ గ్రామస్తులు, రైతులు ఎక్కడ దాడిచేస్తారో అన్న ఆలోచనతో ఎస్పీ భారీ బందోబస్తుతో ఆర్డీవోను అక్కడినుండి తీసుకెళ్ళిపోయారు.

ఎస్పీ పనితో మండిపోయిన గ్రామస్తులు, రైతులు ఆర్డీవో కారుమీద దాడిచేసి ధ్వంసంచేసేశారు. అయినా కోపం చల్లారకపోయేసరికి కొందరు నిప్పుపెట్టారు. గ్రామస్తుల వైఖరిని గమనించిన అక్కడే ఉన్న లక్ష్మణ చాంద పోలీసుస్టేషన్ ఎసై సుమలత అడ్డుకునే ప్రయత్నంచేశారు. దాంతో ఆర్డీవో, ఎస్పీ మీద కోపాన్ని జనాలు ఎసై మీద చూపించారు. తాము కారుకు నిప్పుపెట్టాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎసైపై గ్రామస్తులు దాడిచేసి కొట్టారు. దాంతో ఎసై ఘటనాస్ధలంలోనే స్పృహతప్పి పడిపోయారు. తమ ఎసై స్పృహ తప్పిపడిపోవటాన్ని గమనించిన కొందరు మహిళా కానిస్టేబుళ్ళు వెంటనే ఎసైని అక్కడినుండి దూరంగా తీసుకెళ్ళి పడుకోబెట్టారు. కొద్దిసేపటికి ఎసైకి స్పృహ రావటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. దిలావర్ పూర్ ప్రాంతంలో పరిస్ధితి నిముషనిముషానికి ఉద్రిక్తంగా మారుతోంది. మరి దీన్ని ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News