ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌పై కొత్త పాలసీ
ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్‌పై కొత్త విధానం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. మంత్రి టిజి భరత్ ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-07-03 06:05 GMT
ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఆంధ్రప్రదేశ్ అనుకూలమైనది. రకరకాల ఫుడ్ ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్‌లో పండుతున్నాయి. ఈ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఎక్కువ రోజులు నిల్వ ఉంచడంతో పాటు మంచి ధర కూడా అందుకునే అవకాశం ఉంది. కూరగాయలు, పండ్లు, మాంసం, సముద్ర ఉత్పత్తులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉన్నాయి. మిల్లెట్స్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా లభిస్తున్నాయి. ఈ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉపయోగ పడుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలపై మంత్రి టీజీ భతర్‌కు మంచి అవగాహన ఉంది.
కేంద్ర సాయంతో పదివేల పైన పరిశ్రమలు
కేంద్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తోంది. కోటి రూపాయల వరకు పెట్టుబడులు పెట్టుకునే వారికి అవకాశం కల్పించింది. 2020 నుంచి 2025 వరకు ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కువ పరిశ్రలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసుకునే వారికి అవకాశం కల్పిస్తోంది. బ్యాంకు రుణం ఇప్పించడంతో పాటు సొంతగా డబ్బులు పెట్టుకునే వారికి సబ్సిడీ కూడా ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇప్పటి వరకు నాలుగేళ్లలో కేంద్రం ప్రైమినిస్టర్ ఫార్మలేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ పథకం ద్వారా రూ. 460 కోట్ల పెట్టుబడితో 10,035 చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఎక్కువ సంఖ్యలో చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉన్నాయి. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు గిట్టబాటు ధర, వ్యాపారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందటం, మార్కెట్లో వారికి మంచి ధర రావడం జరుగుతోంది.
రాష్ట్రంలో ఆరు వేల యూనిట్స్
ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వేల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇందులో 74,289 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. మెగా ఫుడ్ పార్క్‌లు ఉన్నాయి. ప్రధానంగా ప్రైవేట్ వారు ఎక్కువగా ఫుడ్ పార్క్‌లు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు వద్ద 57.81 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గోదావరి మెగా ఆక్వాఫుడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ బాగా పనిచేస్తోంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి వద్ద 140 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం శ్రీని ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవరం వద్ద వంద ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో కోర్ ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పిస్తూ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. అలాగే నెల్లూరు, కడప, విజయనగరం జిల్లాల్లోనూ పెద్ద యూనిట్లు ఉన్నాయి.
ఆక్వాఫుడ్స్‌కు మంచి డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా సాగు ద్వారా వస్తున్న ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. రొయ్యలు, చేపల ఉత్పత్తులు ప్రతి రోజూ వేల టన్నుల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. కూరగాయలు, పండ్లు కూడా ఎక్కువగా ప్రాసెసింగ్ చేసి ఎగుమతులు చేస్తున్నారు. సముద్రం నుంచి వస్తున్న రొయ్యలు, చేపలను కూడా ప్రాసెస్ చేయడం ద్వారా ఎక్కువ డబ్బును సృష్టించ గలుగుతున్నారు.
నూతన పాలసీ ఏమిటి..
ప్రభుత్వం నూతన పాలసీని త్వరలోనే అమలులోకి తీసుకు రానుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాలసీని రద్దు చేసి కొత్త పాలసీని అమలులోకి తీసుకు రానున్నారు. పాత పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమను నిర్మించి ప్రైవేట్ వారికి అప్పగిండం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్‌కు అవకాశం కల్పించింది. ఈ విధానం సక్సెస్ కాలేదు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేనందున సక్సెస్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల 2019కి ముందు ఉన్న విధానం ప్రకారం ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించేందుకు ముందుకు వస్తారో వారికి ఇన్‌సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించాలని, ఇందుకు సంబంధించి నూతన పాలసీని రూపొందించాలని అధికారును మంత్రి టిజి భరత్ ఆదేశించారు.