భారతదేశంలో ప్రధమ ప్రధానిగా 17 సంవత్సరాలు కొనసాగి, భారీ పరిశ్రమలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి శాస్త్రీయ దృక్పదంతో, లౌకిక భావాలతో భారత దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన స్ఫూర్తి ప్రధాత జవహర్ లాల్ నెహ్రూ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీడియా కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. నేడు గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారత నిర్మాణ సారథి నెహ్రూజీ అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, 9 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అనుభవించారని, రాజ్యాంగ పరిషత్‌లో మూడు కమిటీలకు నాయకత్వం వహించి భారత రాజ్యాంగ రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. భారత ప్రధానిగా ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసి వయో జనులందరికి ఓటు హక్కు కల్పించారని వివరించారు. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు అమెరికా స్వాతంత్య్రం పొందిన 150 సంవత్సరాల తర్వాత లభించిందని, ఇంగ్లాండ్ లో 700 సంవత్సరాల తర్వాత లభించిందని, అలాంటిది భారతదేశంలో స్త్రీ, పురుషులకు ఒకేసారి ఓటు హక్కు అందించడం జవహర్ లాల్ నెహ్రూ సమ దృష్టికి నిదర్శనమన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో కలిసి 585 సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమగ్రతను, ఐక్యతను కాపాడారన్నారు. ఐఐటి, ఐఐఎం, ఐఐయస్, ఇస్రో లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను స్థాపించి సైన్స్ అండ్ టెక్నాలజీకి పునాదులు వేశారన్నారు.
సీనియర్ పాత్రికేయులు ఆలపాటి సురేష్ ప్రసంగిస్తూ నమ్మిన దానిని ఆచరించే వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అని పేర్కొన్నారు. దేశంలో నేడు నెహ్రూపై, గాంధీపై సోషల్ మీడియాలో జరుగుతున్న బూటకపు ప్రచారాన్ని ఖండించారు. అవాస్తవ ప్రచారాలతో గాంధీ, నెహ్రూ ల స్థాయిని, వారు చేసిన కృషిని ఎవరూ తగ్గించలేరన్నారు. ఆహార కొరతను పరిష్కరించే క్రమంలో వ్యవసాయ రంగంలో స్వావలంబన కోసం ప్రయత్నించి, భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి, ఆహార సమస్యను తీర్చిన మహనీయుడని కొనియాడారు.
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ భారతదేశాన్ని కాపాడు కోవాలనుకునే వారందరూ నెహ్రూ, గాంధీజీల భావజాలాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో నెహ్రూజీ చేసిన సేవలను గుర్తించి మహాత్మా గాంధీ పలుమార్లు నెహ్రూజీ తన వారసుడని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడపగల శక్తి నెహ్రూకి ఉందని పేర్కొనడం వారి ప్రతిభను తెలియజేస్తుందన్నారు.
చర్చా గోష్టికి అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ ఆధునిక భారత నిర్మాతగా జవహర్ లాల్ నెహ్రూ భారత ప్రజలను లౌకిక, శాస్త్రీయ, సామ్యవాద భావాల వైపు నడిపిన మహనీయుడన్నారు. అలీన ఉద్యమానికి నాయకత్వం వహించి భారత గౌరవాన్ని ప్రపంచ ప్రజలకు చాటి చెప్పినారన్నారు. 1929 లో లాహోర్ కాంగ్రెస్‌లో జాతీయ అధ్యక్షునిగా నెహ్రూజీ సంపూర్ణ స్వరాజ్య సాధనే ధ్యేయమని ప్రకటించారన్నారు. పంచవర్ష ప్రణాళికలను రూపొందించి, ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేసి, అవస్థాపన సౌకర్యాలను మెరుగుపరిచారన్నారు.
ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఎఆర్ సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున లౌకిక శక్తులను, ప్రజాస్వామ్య వాదులను కలుపుకుని, గాంధీ నెహ్రూల భావాజాలాన్ని ప్రచారం చేయవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ చర్చా గోష్టిలో నేస్తం సహ వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డి, మానవత కార్యదర్శి కె సతీష్, ప్రముఖ వ్యాఖ్యాత ఎవికె సుజాత, ప్రోగ్రెసివ్ ఫోరం అధ్యక్షులు పి మల్లికార్జునరావు, అఖిల భారత పంచాయితీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రసంగించారు.