NARA LOKESH|మా అమ్మను అవమానించిన వాళ్లను వదిలేది లేదన్న లోకేశ్!
శాసనసభలో రేగాల్సిన మంటలు శాసనమండలిలో ఎగిసిపడుతున్నాయి. సంఖ్యాబలం తక్కువగా ఉన్న వైసీపీ శాసనసభాపక్షం అసెంబ్లీని బహిష్కరించడంతో ఇప్పుడందరి దృష్టి మండలిపై పడింది.
By : The Federal
Update: 2024-11-14 09:42 GMT
శాసనసభలో రేగాల్సిన మంటలు శాసనమండలిలో ఎగిసిపడుతున్నాయి. సంఖ్యాబలం తక్కువగా ఉన్న వైసీపీ శాసనసభాపక్షం అసెంబ్లీని బహిష్కరించడంతో ఇప్పుడు అందరి దృష్టి శాసనమండలిపై పడింది. మండలి సమావేశం ప్రారంభంలోనే వైసీపీ సోషల్ మీడియా పుట్టించిన మంటలు మధ్యాహ్నానికి నారా లోకేశ్ రూపంలో ఎగిసిపడ్డాయి. వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి పారిపోయారంటూ టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలను వైసీపీ శాసనమండలి సభ్యులు తిప్పికొడుతూ ఆవేళ చంద్రబాబు సభను బాయ్ కాట్ చేశారా లేదా అంటూ ప్రత్యర్థులు విరుచుకుపడ్డారు. ఈ దశలో జోక్యం చేసుకున్న చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేశ్ (NARA LOKESH) చాలా ఘాటుగా స్పందించారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిండు సభలో తన తండ్రిని, తల్లిని అవమానించారని అన్నప్పుడు సభ
ఒక్కసారిగా అవాక్కైంది. సభ్యులు తేరుకునే లోగా లోకేశ్ అసలు విషయాన్ని వివరిస్తూ 2021 నవంబర్ 19న అసెంబ్లీలో జరిగిన ఘటనను వివరించారు.
"గత శాసనసభ సాక్షిగా తన తల్లిని వైసీపీ (YCP) ఎమ్మెల్యేలు అవమానించారు" అని మంత్రి లోకేశ్ అన్నారు. బడ్జెట్ సమావేశాల మూడో రోజైన నవంబర్ 14న ఆయన శాసనమండలిలో మాట్లాడారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఆరోజు ఏమిజరిగిందంటే...
అసెంబ్లీలో 2021 నవంబర్ 19న వైసీపీకి చెందిన కొందరు శాసనసభ్యులు నారా చంద్రబాబు (Nara Chandrababu Naidu) భార్య భువనేశ్వరిని అవమానించేలా ద్వంద్వ అర్థాలు వచ్చేలా మాట్లాడారు. దాంతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే శాసనసభలో అడుగుపెడతానంటూ ప్రతిజ్ఞ చేసి సభ నుంచి బయటకువెళ్లిపోతారు. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు బోరున విలపిస్తారు. వెక్కెక్కి ఏడుస్తారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఆవాళ తన భార్యను కించపరిచేలా దూషించారని కంటతడి పెట్టారు. తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ డలేదని అన్నారు. నేడు జరిగిన ఘటనపై ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తనకు పదవులు అవసరం లేదని అన్నారు. తన పాలన కాలంలో ఎన్నో రికార్డులు సృష్టించానని.. తన రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో తెల్చకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు.
‘బూతులు తిట్టినా, ఎన్ని అవమానాలను గురిచేసినా భరించాం. అధికారంలో ఉన్నప్పుడూ నేనెవరినీ కించపరచలేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా శాసన సభలో నా తల్లిని అవమానించారు. ఆనాడు వైఎస్ తప్పు ఒప్పుకుని నాకు క్షమాపణ చెప్పారు. అవతలి వ్యక్తులు బూతులు తిడుతున్నా.. సంయవనం పాటిస్తున్నాను. రేండున్నరేళ్లుగా అవమానిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు. అధికారంలోకి వచ్చాక మా పార్టీ నేతలను అరెస్ట్ చేయడమే పనిగా పెట్టున్నారు. నా భార్య ఆమె వ్యక్తిగత జీవితం కోసం, నా కోసం మాత్రమే పని చేసింది. ముఖ్యమంత్రి భార్యగా ఉన్న సమయంలో ఆమె ఏ రోజు కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు’ అంటారు చంద్రబాబు.
మండలిలో మళ్లీ ఎందుకొచ్చిందీ ప్రస్తావన?
ఇప్పుడా సంగతి మళ్లీ శాసనమండలిలో ప్రస్తావనకు రావడం, వైసీపీ సభ్యులు ఆవేళ చంద్రబాబు సభను బాయ్ కాట్ చేసిన విషయాన్నీ ప్రస్తావిస్తూ తమ నాయకుడు జగన్ కూడా సభను బహిష్కరించారని చెప్పినపుడు సభలో గొడవ జరిగింది. సభలోనే ఉన్న లోకేశ్ జోక్యం చేసుకుని ఆవేళ తన తండ్రిని అవమానించిన తీరును, సభను బహిష్కరించిన విధానాన్ని వివరించారు.
‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకు వచ్చారు. సింహంలా సింగిల్‌గా నిలబడ్డారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించిన తర్వాతే.. ఆవేదనతో ఆయన ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. టీడీపీ నేతలపై మళ్లీ ఇవాళ అసభ్యకర పోస్టులు చేస్తున్నారు. మాట్లాడాలను కుంటే మేమూ మాట్లాడగలం. ఏనాడూ జగన్ కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు నా తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రాలేదా? అప్పుడు అన్ని మాట్లాడిన జగన్ ఇప్పుడు సభకు ఎందుకు రావడం లేదు. నా తల్లిని అవమానించిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారు’’ అని లోకేశ్ నిలదీశారు.
శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ తో పాటు మరో మంత్రి డోలా కూడా వైసీపీ పై ధ్వజమెత్తారు. జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడన్నారు. డొలా వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం చెప్పినపుడు ఈ వివాదం నడిచింది. వైసీపీ వ్యాఖ్యలపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు రెండేళ్లు సభలో పోరాడారన్నారు. నా తల్లిని అవమానపరడంతోనే సభ నుంచి చాలెంజ్ చేసి వెళ్లిపోయరు తప్ప జగన్ లా పారిపోలేదన్నారు. చంద్రబాబు సభకు రాకపోయినా టీడీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారని వివరించారు.