రికార్డు తిరగరాసి.. మాట నిలబెట్టుకున్న నారా లోకేష్

మంగళగిరిలో నారాలోకేష్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి లావణ్యను చిత్తు చేశారు. 72 ఏళ్ల మంగళగిరి నియోజకవర్గం చరిత్రను తిరగరాశారు.

Update: 2024-06-05 03:13 GMT

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం రికార్డులను తిరగరాస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘన విజయం సాధించారు. నియోజకవర్గం చరిత్రలో లేనంత మెజారిటీ సాధించి ఔరా అనిపించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5,337 ఓట్ల తేడాతో ఓటమిని రుచి చూశారు. కానీ ఈసారి అంటే 2024 ఎన్నికల్లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా కంబ్యాక్ ఇచ్చి ఎవరూ అంచనా కూడా వేయలేని రీతిలో విజయాన్ని నమోదు చేశారు.

మాట నిలబెట్టుకున్న లోకేష్

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈసారి 2024 ఎన్నికల్లో తప్పక గెలుస్తానని, అక్కడి నుంచి గెలిచి ధీటైన నాయకుడిని అనిపించుకుంటానని నారా లోకేష్ తన తండ్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గెలవడమే కాదు, సరికొత్త చరిత్రను సృష్టించి తనను ‘పప్పు’ అంటూ గేలి చేసిన వారి నోళ్లు మూయించారు. ఈ ఎన్నికల్లో నారాలోకేష్ తన ప్రత్యర్థి లావణ్యపై 91, 413 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. లోకేష్ మొత్తం 1,67,710 ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య 76,297 ఓట్లు సాధించారు.

ఇదే తొలిసారి

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో ఈ ఎన్నికల్లో నారా లోకేష్ సాధించినదే అత్యధిక మెజారిటీ. 1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఎవరూ ఇంతటి మెజారిటీని సాధించలేదు. స్వాతంత్ర్యం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో తొలిసారి 1952లో ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన డీ లక్ష్మయ్య 17,265 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 వరకు కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఒక నేత సాధించిన అత్యధిక మెజారిటీ కూడా అదే. ఆ తర్వాత ఏ నాయకుడు కూడా అక్కడ అంతకుమించిన మెజార్టీ సాధించలేకపోయారు. ఈ చరిత్రను 2024 ఎన్నికలతో లోకేష్ తిరగరాశారు. 72ఏళ్ల రికార్డును చిత్తు చేసి సరికొత్త చరిత్రను నెలకొల్పారు.

 

‘అహర్నిశలు శ్రమిస్తాం’

మంగళగిరి భారీ విజయం సాధించిన నారా లోకేష్.. ప్రజలు తమపై గురుతరమైన బాధ్య పెట్టారని సంతోషం వ్యక్తం చేశారు. ‘‘దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి అహర్నిశలు శ్రమిస్తాం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తాం. కూటమిలోని మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొస్తాం. ప్రజలు ఇచ్చిన విజయాన్ని గోడలపైన కాకుండా గుండెల్లో పెట్టుకుంటా. 1985 తర్వాత మంగళగిరిలో పసుపు జెండా ఎగరలేదు. కానీ ఈసారి బీజేపీ, జనసేన, టీడీపీ శ్రేణుల సహకారంతో మంగళగిరి గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది’’ అని ఆనందం వ్యక్తం చేశారు.

‘ఆ నిర్ణయం చంద్రబాబుదే’

మంగళగిరిని ఆదర్శనియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మాటిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ‘‘మాకు కక్ష సాధింపులు, వేధింపులు తెలియవు. తప్పు చేస్తే చర్యలు ఉంటాయి. ఎవరిపైనా దొంగ కేసులు పెట్టి జైలుకు పంపం. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నా పాత్ర ఏంటి అన్న విషయంపై తుది నిర్ణయం చంద్రబాబుదే. ఆ నిర్ణయం మేరకు నాకు ఏ బాధ్యతలు అప్పగించి వాటిని చిత్తశుద్దితో నెరవేరుస్తాను’’ అని చెప్పారు.

రాజధాని అదే

‘‘వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఎక్కడలోని గందరగోళం, అయోమయం నెలకొన్నాయి. ఆంధ్రకు ఒకే రాజధాని ఉంటుంది. అది అమరావతి. కూటమి పార్టీల నేతలు అంతా దీనికి కట్టుబడి ఉన్నాం. అన్ని జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎటువంటి వివక్ష ఉండదు. వైసీపీ చేసిన తప్పులు మేం చేయం’’ అని చెప్పుకొచ్చారు నారా లోకేష్.

Tags:    

Similar News