Konda|మంత్రి సురేఖకు నాంపల్లి కోర్టు షాక్
కోర్టు బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద సురేఖ మీద కేసు నమోదుచేయలని గురువారం పోలీసులను ఆదేశించింది.
నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖకు పెద్ద షాకిచ్చింది. మంత్రిపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇంతకీ విషయం ఏమిటంటే సినీనటుడు నాగార్జున(Nagarjuna), నాగచైతన్య(NagaChaitanya), సమంత(Samantha)పై ఆమధ్య మంత్రి నోటికొచ్చినట్లుగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్య-సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే(BRS Working President KTR) కారణమని సురేఖ(Konda Surekha) మీడియాతో చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. నాగార్జున కుటుంబానికి చెందిన ఎన్ కన్వన్షెన్ సెంటర్ ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని నాగార్జునను కేటీఆర్ అడిగినట్లు మంత్రి ఆరోపించారు. తండ్రితో పాటు నాగచైతన్య కూడా కేటీఆర్ దగ్గరకు వెళ్ళాలని సమంతను బలవంతం చేసినట్లు చెప్పారు. ఈ నేపధ్యంలోనే అక్కినేని ఫ్యామిలీకి సమంతకు గొడవలై చివరకు ఇంటినుండి బయటకు వచ్చేసిన సమంత తర్వాత విడాకులు తీసుకన్నట్లు మంత్రి ఆరోపించారు.
తన ఆరోపణలకు మంత్రి దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో తెలీదుకాని నాగార్జున ఫ్యామిలీ మాత్రం తీవ్రంగా స్పందించింది. స్పందించటమే కాకుండా కొండాపై పరువునష్టందావా కూడా వేసింది. ఆ కేసునే నాంపల్లి కోర్టు(Nampalli Court) విచారిస్తోంది. రెండువైపుల వాదనలను ఇదివరకే విన్న కోర్టు బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద సురేఖ మీద కేసు నమోదుచేయలని గురువారం పోలీసులను ఆదేశించింది. అలాగే కేసు విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదావేసింది. డిసెంబర్ 12 విచారణకు మంత్రి వ్యక్తిగతంగా హాజరుకావాలని కూడా కోర్టు ఆదేశించింది. తమ కుటుంబంపై మంత్రి నిరాధార ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించారన్న నాగార్జున వాదనతో కోర్టు ఏకీభవించింది. సురేఖ చేసిన ఆరోపణలతో తమ కుటుంబం అంతా తీవ్ర మనోవేధనకు గురైనట్లు నాగార్జున కోర్టులో చెప్పారు. మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరటంతో కోర్టు స్పందించి వెంటనే కేసు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది. ఇదే పద్దతిలో కేటీఆర్ కూడా మంత్రిపై రు. 100 కోట్లకు పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసు కూడ విచారణలోనే ఉంది. ఈ రెండు కేసుల నుండి మంత్రి ఏ విధంగా బయటపడతారనే ఆసక్తి పెరిగిపోతోంది.