ఈ ఇద్దరు నేతలు ఇలా ఎందుకు మారారు?
ప్రజలను కలుసుకునేందుకు వారు ఎందుకు అంత ఉబలాటపడుతున్నారు?;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వ శైలి పరిపాలనా విధానాలు ఎల్లప్పుడూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా శైలి ఒకదానికొకటి విభిన్నమైనవి. ఇటీవల చంద్రబాబు నాయుడు తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఆయన వ్యక్తిత్వం కొత్త కోణం బయటపడింది. ఆయన ప్రజలతో కలిసి టీ తాగుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబునాయుడు శైలిలో ప్రధానమైనవి మెరుపు తనిఖీలు, రివ్యూమిటింగులు. ఆయన ప్రజలతో మమేకం కావడం చాలా తక్కువ.ఇపుడు ఈ ధోరణి మారుతున్నట్లు కనిపిస్తుంది. ప్రజావేదిక కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవడం, ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణం, వ్యవసాయ భూములు ఇప్పించడం, ప్రజలతో కలిసి టీ తాగుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం వంటి ఈ అంశాలు ఆయన నాయకత్వంలో ఒక కొత్త శైలిని సూచిస్తున్నాయి. ప్రజలతో కలసి ఒక అనుబంధం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తుంది.
దీనికి విరుద్ధంగా, ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ మోహన్ రెడ్డి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిపై ఎక్కువ దృష్టి సారించారు. ప్రజలతో నేరుగా కలవడం తక్కువగా ఉండేది. సీఎం కాకముందు ప్రజల మధ్యనే ఉన్నా సీఎం అయిన తరువాత ఆయన ప్రజలకు దూరంగా ఉండటం కొంత చర్చకు దారితీసింది. వీరిద్దరిలో వచ్చిన తేడాలు ఇప్పుడు చర్చనియాంశంగా మారాయి. ఇపుడు కష్టాల్లో ఉన్న పార్టీ నేతలను కలుసుకునేందుకు జగన్ ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు. పార్టీనేతలు జైలులో ఉంటే ఆయన జైలు కూడ వెళ్లుతున్నారు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్ మోహన్ రెడ్డిలు ప్రజలను ఒక ఎమోషన్ బాండ్ అంటే వ్యక్తిగత అనుబంధం ఏర్పాటుచేసుకోవాలను కోవడం కనిపిస్తుంది. వారు కొత్త శైలిని ఎందుకు అవలంబిస్తున్నారు? ఆ అవసరం ఎలా గుర్తించారు?
మారిన చంద్రబాబు వ్యక్తిగత శైలి
చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి విజయం తర్వాత నాల్గవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈసారి పరిపాలనలో ఒక విశిష్టమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. ప్రజలను నేరుగా కలిసి మాట్లాడటం, వారి ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకోవడం, వారి చిన్న చిన్న కోరికలను కూడా నెరవేర్చడం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఇందుకు ఉదాహరణ. 2025 జూన్1న చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం నుంచి కాన్వాయ్ లో వస్తున్న సీఎం ధర్మవరంలో ఓ దుకాణం వద్ద ఆగారు. అక్కడ ఉన్న వారితో మాట్లాడారు. అక్కడే ఉన్న చర్మకారుడు పోసిబాబు తన గురించి చెప్పుకున్నారు. ఆ మాటలు విన్న తరువాత తన కారులో ఎక్కించుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆయన చెప్పిన మాటలు, తన కష్ట సుఖాల గురించి చెప్పుకున్న మాటలు ఓపిగ్గా విన్నారు. 15 నిమిషాల పాటు కారులో చంద్రబాబుతో పాటు పోసిబాబు ప్రయాణించారు. పోసిబాబు ఇంటికి నేరుగా వెళ్లిన సీఎం పోసిబాబు తయారు చేసే డప్పులు, వెదురు బుట్టలు పరిశీలించారు. చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నట్లు చెప్పారు. 2017లో మంజూరు అయిన ఇంటికి గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో శ్లాబ్ దశలో ఆగిపోయింది. ఇప్పటికీ అలాగే ఉందని చెప్పారు. తన కుమారుడు ఐటీఐ పూర్తి చేసి ఖాళీగా వుంటున్నట్లు చెప్పారు. ఇంటి ముందు మెట్లపై కూర్చొన్న సీయం ఆయన చెప్పిన వన్నీ విని ఇంటి నిర్మాణం పూర్తి కావడానికి అవసరమైన రూ. 3లక్షలు మంజూరు చేశారు. మూడు నెలల్లో ఇల్లు పూర్తి కావాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఆయన జీవనోపాధికి ఒక దుకాణం గ్రామంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఈ సంఘటన చూసిన గ్రామస్తులు నాటి ముఖ్యమంత్రి కాదు, మారిన ముఖ్యమంత్రి అంటూ ప్రశంసలు కురిపించారు.
ఈ కొత్త శైలి ఎందుకు?
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత, చంద్రబాబు నాయుడు ప్రజలతో నేరుగా సంబంధం లేకపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని గుర్తించారు. ఈసారి ప్రజావేదిక కార్యక్రమాల ద్వారా, పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి వారితో సంభాషించడం, చిన్న కోరికలను నెరవేర్చడం ద్వారా ప్రజలతో భావోద్వేగ సంబంధాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆయన గత పాలనలో కనిపించని ఒక కొత్త కోణం.
రాజకీయ వ్యూహం
2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 అసెంబ్లీ సీట్లు, 21 లోక్‌సభ సీట్లతో ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక, జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ పాలనపై అసంతృప్తి, ముఖ్యంగా పింఛన్ల పంపిణీలో ఆలస్యం, వాలంటీర్ల వ్యవస్థపై వివాదాలు కీలక పాత్ర పోషించాయి. చంద్రబాబు నాయుడు ఈ అసంతృప్తిని గుర్తించి, ప్రజలతో నేరుగా కలిసే విధానాన్ని ఎంచుకున్నారు. ఇది రాజకీయంగా ఆయనకు మంచి ఇమేజ్‌ను, ప్రజలలో విశ్వాసాన్ని తిరిగి నిర్మించడానికి దోహదపడుతుంది.
గత అనుభవాల నుంచి నేర్చుకోవడం
2019లో వైఎస్ఆర్‌సీపీ చేతిలో ఓటమి, 2023లో నైపుణ్యాభివృద్ధి కేసులో అరెస్టు, చంద్రబాబు నాయుడును ప్రజలతో మరింత సన్నిహితంగా ఉండేలా ప్రేరేపించాయి. ఆయన కుమారుడు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర, ప్రజలతో సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ అనుభవాల నుంచి నేర్చుకుని, చంద్రబాబు ప్రజా వేదికలు, ఇంటి సందర్శనలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలతో నేరుగా కలవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి DBT విధానం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బటన్ ప్రెస్సింగ్ చీఫ్ మినిష్టర్ గా బ్రాండ్ పడింది. బటన్ నొక్కడం మీద సోషల్ మీడియాలో చాలా జోక్స్ కూడా వచ్చాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయడంపై ఎక్కువ దృష్టి సారించారు. ఆయన ప్యాలెస్ కే పరిమితం అయ్యారని, అక్కడికి ఒకరిద్దరు తప్ప నేతలెవరూ, చివరకు మంత్రులు కూడా వెళ్లలేరని విమర్శలు వచ్చాయి. ఆయన ప్రధాన కార్యక్రమం ఆయన “నవరత్నాలు” జపం. ఈ తొమ్మిది సంక్షేమ పథకాల ద్వారా రూ. 2.70 లక్షల కోట్లను DBT ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేశారు. రూ. 1.78 లక్షల కోట్లను నాన్-డీబీటీ పద్ధతుల ద్వారా పంపిణీ చేశారు. ఈ విధానం ద్వారా అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలు లక్షలాది మంది మహిళలు, రైతులు, విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాయి. ప్రజలకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాక ఓటేయారా? మళ్లీ నేను వ్యక్తిగతంగా వెళ్తి కలుసుకుని తలనిమిరి ఓటేయి అనాలా అనే ధోరణి ప్రదర్శించారు. ఈ ధోరణివల్లే ఆయన పార్టీ ఓటమి పాలయ్యిందని రాజకీయపండితులు చెప్పారు.
వలంటీర్ల బ్రిడ్జికట్టలేకపోయారు
తాను ప్రజలను కలుసుకోవడం లేదు కాబట్టి, ఆయన వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వాళ్ల ద్వారా ఇంటింటికి తన బొమ్మని, పేరుని, పథకాలని పంపించడం మొదలుపెట్టారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లు, సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవస్థ ద్వారా 2.6 లక్షల వాలంటీర్లు పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి నగదును అందజేశారు. ఈ విధానం పారదర్శకతను, సమర్థతను పెంచింది గానీ, నాయకుడికి, ప్రజలకు మధ్య అనుబంధం పెంచలేకపోయింది. దానితోడు 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ఆరోపణలతో ఈ వ్యవస్థ కూడా వివాదంలో చిక్కుకుంది.
ప్రజలను తక్కువగా కలవడం...
జగన్ ప్రజలతో నేరుగా కలవడం కంటే, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే చాలునని ఆయన భావించారు. అందుకే జగన్ కాలంలో ప్రజలతో సమావేశాలు, ర్యాలీలు తక్కువగా నిర్వహించారు. ఎక్కువగా I-PAC సర్వేలపై, సాంకేతిక వేదికలపై, బటన్ నొక్కే పండగల పై ఆధారపడ్డారు. ఈ విధానం కొంతమంది లబ్ధిదారులకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, భావోద్వేగ అనుబంధం నిర్మాణంలో వెనుకబడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
వలంటీర్ల వ్యవస్థ చుట్టూ వివాదాలు
వాలంటీర్లు మరీ వోవరాక్షన్ చేసి ఆ వ్యవస్థను వివాదాస్పదం చేశారు. వీళ్లొచ్చి సర్పంచులను పంచాయతీ ఆఫీసుల నుంచి తరిమేశారు. కార్యాలయమంతా ఆక్రమంచి సర్పంచుకు వూర్లో విలువ లేకుండా చేశారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన తమని బయటకీడ్చేశారని సర్పంచులు పగబట్టారు. వలంటీర్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారనే ఆరోపణలు వచ్చాయి. వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాలంటీర్లను పింఛన్ పంపిణీ నుంచి తొలగించమని ఆదేశించింది. దీని వల్ల పింఛన్ దారులు సచివాలయాల వద్ద బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్లు తీసుకోవాల్సి వచ్చింది. ఇది వృద్ధులకు, దివ్యాంగులకు ఇబ్బందిగా మారింది. చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని, వైఎస్ఆర్‌సీపీ పై విమర్శలు చేశారు. 33 మంది పింఛన్‌దారుల మరణాలకు వైఎస్ఆర్‌సీపీ నిర్వహణ వైఫల్యమే కారణమని ఆరోపించారు.
ఇద్దరి శైలి మధ్య తేడా ఎందుకు?
చంద్రబాబు నాయుడు: 2019 ఓటమి తర్వాత చంద్రబాబు ప్రజలతో దూరం కావడం వల్ల టీడీపీకి నష్టం జరిగిందని గుర్తించారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజలను నేరుగా కలవడం ద్వారా విశ్వాసాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా వేదికలు, ఇంటి సందర్శనలు ఈ వ్యూహంలో భాగం. ఇది ఆయనను ప్రజలకు దగ్గర చేయడమే కాక, వైఎస్ఆర్‌సీపీ “దూరం” ఇమేజ్‌కు వ్యతిరేకంగా ఒక రాజకీయ అస్త్రంగా కూడా పనిచేస్తుంది. అంతేకాదు, ఆయన కుమారుడు , ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఎక్కువ కాలం పేదలతో, లబ్దిదారులతో గడుపుతున్నారు. ప్రజలను పరామర్శిస్తున్నారు. ప్రశంసిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి: ఆయన ఇపుడు ఎక్కువగా I-PAC సర్వేల మీద ఆధారపడటం తగ్గించినట్లున్నారు. సమస్యల మీద పాదయాత్ర వంటి జనాకర్షక కార్యక్రమాలవైపు ఇంకా వెళ్లకపోయినా, తనకు అనుకూలమయిన మార్గం ఎంచుకున్నారు. ఇదే పరామర్శ మార్గం. కష్టాల్లో ఉన్న పార్టీ నేతలకుటంబాలను, చనిపోయిన వారి కుటుంబాలను, జైలు కెళ్లిన వారిని, ప్రమాదంలో, యుద్ధంలో, తీవ్రవాద దాడుల్లో మరణించిన వారిని కలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆంక్షలు వున్నా ఆయన లెక్కచేయకుండా కలవాలనుకుంటున్నారు. ఇది కొట్టొచ్చినట్లు కనిపించే మార్పు.
ఇలా ఇదంతా గత అనుభవాల నుంచి ఇద్దరు నేతలు నేర్చుకున్న పాఠాల ఫలితమని చెప్పవచ్చు.
చంద్రబాబు ఈ శైలి కేవలం “మంచి మార్కులు” కోసమేనా అనే విమర్శలు కూడా ఉన్నాయి. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చే దీర్ఘకాలిక లక్ష్యానికి ప్రజల మద్దతును సమీకరించడానికి కూడా ఇదో వ్యూహం అని చాలా మంది భావిస్తున్నారు. గత ఓటముల నుంచి నేర్చుకున్న పాఠాలను అమలు చేయడానికి ఒక వ్యూహంగా కనిపిస్తుంది.
అయితే, ఇద్దరి మీద విమర్శలు కూడా ఉన్నాయి. ఇది వారిద్దరిలో వచ్చిన మానసిక పరివర్తన కాదని, ఇది కూడా వచ్చే ఎన్నికల వ్యూహమని విమర్శకూడా వినపడుతూ ఉంది. ‘ఇద్దరికి 2029 ఎన్నికలు చాలా ముఖ్యం. గెలిస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అందుకే జనం దగ్గిరకు వెళ్తున్నారు. ఇది కేవలం ఎన్నికల వ్యూహం మాత్రమే. గతంలో ఇద్దరు నేతలు పథకాలతో డబ్బులందిస్తే ప్రజలు ఓటేస్తారని భావించి దెబ్బతిన్నారు. అందుకే ఎన్నికలకు నాలుగేళ్ల ముందే వ్యూహం మార్చుకున్నారు. ఇది వాళ్లలో వచ్చిన మానసిక పరివర్తన కాదు,” అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. ప్రజల సొమ్మును పన్నుల రూపంలో పరోక్షంగా దోచుకుంటున్నారు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఇలా కనిపిస్తూ దాన కర్ణుని మాదిరి బిల్డప్ లు ఇస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కవ. ప్రతి పేదవాడూ ఒక వాహనాన్ని వాడితే వాడిపై కనీసం లీటరుకు రూ. 30 లు భారం పడుతోంది. వాళ్లకు తెలియకుండానే వారి నుంచి పాలకులు దోపిడీ చేస్తున్నారన్నారు.
మద్యం ధరను తీసుకుందాం... ఒరిజినల్ ధరను అక్కడ డిస్ప్లే చేయాలి. తయారీ ధర, ట్యాక్స్ లు, అమ్మకం ధర వివరాలు షాపుల ముందు డిస్ ప్లే చేయాలని చెప్పండి. అప్పుడు వీరి బండారం బయట పడుతుందని అన్నారు. వేషం, భాష, నడవడిక అన్నీ రాబోయే ఓట్లకోసమేనన్నారు.
పేదలు ఇప్పుడు గుర్తుకు వచ్చారు. ఇన్నేళ్లు పాలకులు చొక్కాలపై దుమ్ము పడకుండా చూసుకున్నారు. రాబోయే రోజుల్లో ఓట్లు రావాలంటే వేషం, పనితీరు మారాల్సిందే. అందులో భాగమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో వచ్చిన మార్పు అని సీనియర్ జర్నలిస్ట్ ఎస్ కే బాబు అన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ప్రతినిధి’తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేరుగా పేదవాని కుటుంబంతో కలిసి కూర్చుని మాట్లాడిన సందర్భం లేదు. అధికారమే పరమావధిగా అడుగులు వేయడమే ఇందుకు కారణమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రజల మధ్య ఉన్నారు. అధికారం వచ్చిన తరువాత అద్దాల మేడను దాట లేదు. ఇందుకు కారణం ఉచితంగా డబ్బులు ఇస్తే సరిపోతుందనుకోవమేనన్నారు. ఓడిపోయిన తరువాత డబ్బు ఇవ్వడం ఒక్కటే చాలదు, వారితో అప్పుడప్పుడూ కలిసి కాస్త టీతాగి మాట్లాడాల్సిందేనని తెలుసుకుంటున్నారు. ఆయన వ్యవహారం ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో చూడాలని అన్నారు.