ఈ అసెంబ్లీ సెషన్ లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు తేవాలి
కృపాకర్ మాదిగ, పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగల సంయుక్త ప్రకటన;
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం చెయ్యడానికి జాప్యం చేస్తున్నందున మాదిగ,రెల్లి అనుబంధ కులాల ప్రజలు వర్గీకరణ ప్రకారం అడ్మిషన్లు పొందే అవకాశాలు లేకుండా,మరో విద్యా సంవత్సరం (2025 - 2026) కూడా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.
రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తన నివేదికను తేదీ 11/3/2025న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ననుసరించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల చట్టం చెయ్యకుండా మాదిగలకు అన్యాయం చేస్తున్నది.ఇది సరైంది కాదు.
సాంకేతిక కారణాలను,సమాచార లేమిని వంటి అంశాలను కారణాలను చూపి, ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేయరాదని గత ఆగస్టు ఒకటో తేదీన సుప్రీమ్ కోర్టు రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తన తీర్పులో వెల్లడించిన అంశాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి,ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నాము.
రాజీవ్ రంజన్ మిశ్రా కమీషన్ నివేదిక సమర్పించాక,మరలా కమీషన్ కాల పరిమితిని నెల రోజులు పొడిగించడం,ఈ నివేదిక పై ఐదుగురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించడం కానీ గమనిస్తే, వర్గీకరణ చట్టాన్ని చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చెయ్యడానికేనని స్పష్టమవుతున్నదని మేము భావిస్తున్నాము.
నివేదికలోని అంశాల మంచీ చెడుల పరిశీలనార్థం రాజీవ్ రంజన్ మిశ్రా కమీషన్ నివేదికను సంబంధిత ఎస్సీ కులాల ప్రజలు,సంఘాలూ, నాయకులు,విద్యావంతులు, ప్రతినిధులకు బహిరంగపరచాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
2018 లో గజెట్లో ప్రచురింపబడి, ఇప్పటికి తాజావైన 2011 నాటి భారత జనాభా గణాంకాలననుసరించి,ఎస్సీ జనాభాను రాజీవ్ రంజన్ మిశ్రా కమీషన్ పరిగణన లోకి తీసుకోవాలి.తెలంగాణ రాష్ట్ర కమీషన్ కూడా ఇదే పద్దతి అనుసరించిందని కూడా మిశ్రా కమీషన్ కు,రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము.
మరీ ముఖ్యంగా, ఎస్సీ జనాభాను జిల్లా యూనిట్ గా తీసుకోరాదు, ఎస్సీ జనాభాను రాష్ట్రాన్ని మాత్రమే యూనిట్ ప్రాతిపదికగా తీసుకోవాలి.ఇలా పరిగణిస్తేనే, ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన మాదిగ,రెల్లి అనుబంధ కులాల వారికి,ఇతర ఎస్సీ చిన్న కులాల వారికి ఉద్యోగ నియామకాల్లో న్యాయం జరుగుతుందని, మిశ్రా కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు జాప్యం చేస్తున్న కూటమి రాష్ట్ర ప్రభుత్వంతో, వర్గీకరణ వ్యతిరేకుల ప్రయోజనాలతో రాజీపడి,మౌనం వహిస్తున్న మంద కృష్ణ వైఖరిని ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాము.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణ చట్టం చెయ్యడానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకొని మాదిగ,రెల్లి అనుబంధ కులాల వారికి రానున్న 2025-26 విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లలో న్యాయం జరిగేలా, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సత్వర న్యాయం జరపాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము.
(కృపాకర్ మాదిగ,వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి,MRPS; పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ,రాష్ట్ర అధ్యక్షుడు,AP MRPS)