ముంచుకొస్తోన్న ‘మొంథా’..జేసీబీలు,క్రేన్‌లు,పవర్ సాలు సిద్ధం
‘మొంథా’ తుఫాన్ ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని, విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం రానివ్వొద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం చెప్పారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర జిల్లాలలో మోహరించామని వెల్లడించిన ముఖ్యమంత్రి... తుఫాన్‌పై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైమ్ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు.