సమీపిస్తున్న మొంథా..నెల్లూరులో అధిక వర్షం
కాకినాడకు దక్షిణంగా ఇవాళ రాత్రికి తీరాన్ని దాటే అవకాశం.
మొంథా తుపాను కోస్తాంధ్ర తీరాన్ని సమీపిస్తోంది. కాకినాడకు దక్షిణంగా ఇవాళ రాత్రికి తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీవ్ర తుపాను కారణంగా కోస్తాంధ్రలోని విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రభావం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాలోని 403 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఉండనుంది. అత్యవసర పరిస్థితి ఎదుర్కోనేలా మండలాల వారీగా 488 కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు చేశారు. మొత్తం 1204 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు 75,802 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపులు చేపట్టారు. 219కి పైగా మెడికల్ క్యాంపులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అత్యవసర సమాచార వ్యవస్థ కోసం 81 వైర్ లెస్ టవర్లను ఏర్పాటు చేశారు. 21 పైగా భారీ సైజు ఆస్కా ల్యాంపులను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. విపత్తును ఎదుర్కొనేందుకు జేసీబీలు, ప్రోక్లెయినర్లు, క్రేన్లు 1447ను, 321 డ్రోన్లను సిద్ధంగా ఉంచారు.
మొంథా తుపాను ప్రభావం వల్ల ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూలిన చెట్లు తొలగించేందుకు 1040 యాంత్రిక రంపాలను అందుబాటులో ప్రభుత్వం ఉంచింది. తుపాను ప్రభావంపై ఇప్పటి వరకూ 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా సంక్షిప్త సమాచారం ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. వర్ష ప్రభావం రీత్యా 865 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం సిద్ధం చేసింది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 38 వేల హెక్టార్ల పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేశారు. 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా ప్రభావితం అయినట్టు అంచనా వేస్తున్నారు.