'అమ్మా, నీ ప్రవర్తన సరిలేదు, అందుకే చంపేస్తున్నాం'
తల్లిని చంపి తగులబెట్టిన కుమార్తెలు.. ఎలా చిక్కారంటే..;
By : The Federal
Update: 2025-08-27 13:32 GMT
'అమ్మా, నీ ప్రవర్తన సరిలేదు, అందుకే చంపేస్తున్నాం' అంటూ ఇద్దరు కుమార్తెలు కన్నతల్లిని చంపి గుట్టుచప్పుడు కాకుండా తగులబెట్టి కటకటాల పాలయ్యారు. సంచలనం సృష్టించిన ఈ కేసు మిస్టరీని అనకాపల్లి పోలీసులు ఛేదించారు. నిందితుల్ని అరెస్ట్ చేశారు.
ఇదీ ఈ కేసు నేపథ్యం...
ఆమె పేరు బంకిళ సంతు. వయసు 38 ఏళ్లు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. ఒంటరి మహిళ. సొంత రాష్ట్రం ఒడిశా.. భర్తతో గొడవ పడి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అనకాపల్లి చేరింది. కూర్మన్నపాలెం కూర్మన్నపాలెం వడ్లపూడి రాజీవ్‌నగర్‌లో ఉంటోంది. పెద్ద కుమార్తె అనూష. చిన్న కుమార్తె మైనరు. 15 ఏళ్లు.
భర్త విడిపోయిన క్రమంలో బంకిళ సంతు చెడు అలవాట్లకు దగ్గరైంది. ఆన్‌లైన్ బెట్టింగ్, వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. ఆమె తీరు పిల్లలకు నచ్చలేదు.
తల్లి ప్రవర్తనతో విసుగెత్తిన కుమార్తెలు తరచూ తల్లితో గొడవ పడేవారు. కుటుంబ పరువు బజారుపడుతోందని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్నే తమకు సమీపంలో ఉంటున్న చిన్నాన్న మురళీకి చెప్పారు. గతంలో ఆమె తన మరిది మురళీపై కూడా తన చిన్న కుమార్తెను అపహరించారంటూ కిడ్నాప్ కేసు పెట్టింది. ఈ పరిస్థితుల్లో ఆమెను (బంకిళ సంతు) చంపేయడమే ఉత్తమమని ప్లాన్ చేశారు. ఈనెల 13న చిన్న కుమార్తె వసతిగృహం నుంచి ఇంటికి వచ్చింది. తల్లి ఫోన్లోని అభ్యంతరకర ఫొటోలు, అసభ్య పదజాలంతో రికార్డు వాయిస్‌లను చూసి ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఇది తెలిసి పెద్ద కుమార్తె ఇంటికి వచ్చి తల్లిని నిలదీసింది. వాగ్వాదానికి దిగింది.
అనంతరం ఈ విషయాన్ని ఇదే ప్రాంతంలో ఉంటున్న చిన్నాన్న మురళీధర్ దృష్టికి తీసుకెళ్లారు. అన్నయ్య భార్య కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతోందనే కోపంతో.. ముగ్గురూ కలిసి సంతును అడ్డు తొలగించుకోవడమే సరైనదని భావించారు.
ఎలా చంపారంటే...
13వ తేదీ అర్ధరాత్రి దాటాక ఇంట్లోని హాలులో నిద్రించి ఉన్న బంకిళ్ల సంతు మెడకు మురళీధర్ తువ్వాలు చుట్టారు. ఊపిరి ఆడకుండా చేశారు. ఆమె ఇద్దరు కుమార్తెలూ సహకరించారు. శవం ఆనవాళ్లు లేకుండా చేయడానికి కారులో సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వరకు తీసుకొచ్చారు. నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోలు పోసి తగలబెట్టారు. ఏమీ ఎరగనట్టు వెళ్లిపోయారు.
14వ తేదీన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చేపట్టారు. కుమార్తెలు, మరిది నిందితులుగా గుర్తించి మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు.
కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురూ జైల్లో ఉన్నారు. కలకలం రేపిన ఈ కేసు మిస్టరీన పోలీసులు 15 రోజుల్లో ఛేదించడం విశేషం.