అమరావతికి మోదీ మళ్లీ రాక, ల్యాండ్ పూలింగ్ కి కొత్త ఎత్తా?

చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారా? రెండోసారి ల్యాండ్ పూలింగ్ కి రైతులు సిద్ధంగా లేరా? రైతులపై ఒత్తిడి పెంచేందుకే ప్రధాని మోదీతో మళ్లీ శంకుస్థాపన చేయిస్తున్నారా?;

Update: 2025-04-25 13:05 GMT
రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చేసినా అట్టహాసంగా, హైటెక్ స్థాయిలోనే ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖుల్ని పిలిపించి 2015 అక్టోబర్ 22న ఘనంగా తొలిసారి శంకుస్థాపన చేయించారు. ఇప్పటికి పదేళ్లు కావొస్తోంది. ఇప్పుడు తిరిగి మే 2న మళ్లీ అమరావతి పనుల పునఃప్రారంభం పేరుతో భారీ పనులకు శంకుస్థాపనలు జరగబోతున్నాయి.
విభజిత ఆంధ్రప్రదేశ్ కి తొలిసారి 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన 5 ఏళ్ల పదవి కాలంలో చేపట్టిన రాజధాని ప్రాంత పనులన్నీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిపివేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తన పాత పనులకు ప్రధాని సమక్షంలో తిరిగి ప్రాణం పోయనున్నారు.
మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు...
మరోపక్క, మోదీని ఆహ్వానించేందుకు చంద్రబాబు ఏప్రిల్ 25న మళ్లీ ఢిల్లీ వెళ్లారు. ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందిస్తారు. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సుమారు 250 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరుగుతుంది. 5 లక్షల మందిని ఈ సభకు తరలించాలన్నది ప్రభుత్వ ప్లాన్. సభా వేదిక వద్దకు వచ్చేందుకు 8 రోడ్లు, 11 పార్కింగ్‌ ప్రాంతాల్ని గుర్తించారు. మోదీ పర్యటనను రాజకీయ బల ప్రదర్శనగా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిన్న మంత్రి నారాయణ

 రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలను ఈ కార్యక్రమానికి తీసుకురావడానికై 2400లకు పైగా RTC బస్సులు, మరికొన్ని వందల ప్రైవేట్ వాహనాలు, ప్రత్యేక ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నారు. పండగ శోభ ఉట్టిపడేలా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రధాన నగరాలు ముస్తాబు అవుతున్నాయి. భారీ కటౌట్లు, సభా ప్రాంగణానికి దారి తీసే అన్ని రోడ్లకు ఇరువైపులా హోర్డింగులు ఏర్పాటవుతున్నాయి. 30 వేల మందితో విజయవాడ నుంచి వెలగపూడి సచివాలయం వరకు మోదీ రోడ్ షో ని సక్సెస్ చేసేందుకు అధికారులు రెండు వారాలుగా కసరత్తు చేస్తున్నారు.

లక్ష కోట్ల పనులకు శంకుస్థాపనలు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మే 2న రూ.1 లక్ష కోట్ల విలువైన అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం వంటి పలు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఇవి అమరావతిని తిరిగి రాజధానిగా నిలబెట్టాలన్న తెలుగుదేశం పార్టీ లక్ష్యానికి ఒక కీలక మైలురాయిగా పేర్కొనవచ్చు. అయితే వీటి కోసం మళ్లీ భూమిని సమీకరించాలన్న ప్రతిపాదనపైన్నే వివాదం నడుస్తోంది.
రూ.1లక్ష కోట్ల అప్పు ఎలా వస్తుందీ?
రాజధాని కోసం ఇప్పటికి రూ. 31 వేల కోట్లు అప్పుచేశారు. ఇంకా 69 వేల కోట్లు అవసరమంటున్నారు. అంటే సుమారు రూ.1 లక్ష కోట్లు. రాజధాని కోసం 29 గ్రామాల నుంచి 58 వేల ఎకరాల భూమిని సేకరిస్తే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి? సెక్రటేరియట్ , హైకోర్టు , అసెంబ్లీ , పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమే! తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్ , హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు అదనంగా మరో 44వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు.
ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా? ఇప్పుడున్న భూమి కాకుండా మరో 44 వేల ఎకరాలు ఎందుకు, శంకుస్థాపన చేసిన పనుల్ని మళ్లీ శంకుస్ధాపనలు ఏమిటీ? ప్రజలకు కావాల్సింది 30,40 అంతస్తులుండే ఎత్తైన భవనాలా లేక సుపరిపాలనా? ప్రజలకు ఉపయోగపడే అవుటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నల్ రోడ్లు వంటి వాటిని వదిలేసి మెట్రో రైలు అంటారేంటీ? ఇలా సవాలక్ష ప్రశ్నలు ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి.
మళ్లీ 44వేల ఎకరాల భూమిని ఏం చేస్తారు?
కొత్తగా సమీకరించే భూమిలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు, 4500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వంటివి అనేకం ఉన్నాయి. వీటిని నిర్మించేందుకు ముందుకు వచ్చే సంస్థలకు రైతుల నుంచి సమీకరించే భూమిని కేటాయించి వారి ద్వారా వీటిని నిర్మించాలన్నది ప్రభుత్వ యోచన.
ఇప్పుడున్న జనాభా 2 లక్షల లోపే..
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల జనాభా దాదాపు 2 లక్షలు. సీఆర్డీఏ తాజా సర్వే ప్రకారం ఈ గ్రామాల్లో 34,918 కుటుంబాలు ఉంటున్నాయి. మంగళగిరి మండలం నవులూరులో అత్యధికంగా 10,810 మంది ఉన్నారు. ఇదే మండలంలోని ఎర్రబాలెం, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి జనాభా పది వేలు దాటింది. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో అతి తక్కువగా 677 జనాభా మాత్రమే ఉంది. 22,404 మంది రైతులు, 12 వేల మంది కౌలు రైతులున్నారు. ఈ ప్రాంతంలోని కొన్ని గ్రామాలకు బస్సులే లేవు.
అటువంటి చోట అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా , జపాన్ , జర్మనీ వంటి దేశాల్లో కూడా లేని హైపర్ లూప్ అనే రైలు కావాల్సిన అవసరం ఉందా అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. హైదరాబాద్ నగర జనాభా కోటి కి చేరడానికి సుమారు 400 ఏళ్లు పట్టింది. అలాంటిది అమరావతి వంటి మహానగరం నిర్మితం కావడానికి ఎన్నేళ్లు కావాలని అన్నారు వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఏ నగరమైనా ఒక్క రోజులో నిర్మితం కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద ధనవంతులకు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదు అన్నారు వడ్డే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కామన ప్రభాకర్ రావు అమరావతి రాజధానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న తాజా భూసేకరణ నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే 34,000 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించిన నేపథ్యంలో, మరో 44,000 ఎకరాలను సేకరించాలన్న నిర్ణయం సరైంది కాదు అన్నారు ఆయన.
“ఇప్పటికే తాత్కాలిక సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, పాలన భవన సముదాయాన్ని ప్రభుత్వమే నిర్మించింది. అప్పట్లో రైతులు రాజధాని అభివృద్ధి కోసం తమ భూములు ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అంతపెద్ద స్థాయిలో భూసేకరణ అవసరమేమిటి?” అన్నారు ఆయన.
రైతులపై వత్తిడి పెంచేందుకే ఈ షో ?
ఈ ప్రచార, బహిరంగ సభల వాడివేడి మధ్య, అమరావతి పరిసర గ్రామాల్లో రైతుల వ్యతిరేక స్వరాలు పెరుగుతున్నాయి. రెండవ దశ భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) కు కొన్ని గ్రామాల రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వానికి భూములు ఇచ్చి వాళ్లు ఇచ్చే ప్లాట్ ని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనే ఆలోచనను రైతులు తిరస్కరిస్తున్నట్టు రైతు సంఘం నాయకుడు జమలయ్య చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ పూర్తి పునరావాసం, నష్టపరిహారం రాలేదన్న ఆందోళన ఉంది.

2015 నాటి శంకుస్థాపన సందర్భంలో కేసీఆర్, బండారు దత్తాత్రేయతో చంద్రబాబు

దీనికి సమాధానంగానే చంద్రబాబు ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఇంతటి భారీ బలప్రదర్శనకు దిగారనే విమర్శలూ లేకపోలేదు. ప్రభుత్వ వర్గాల భావన ప్రకారం ప్రధాని పర్యటనతో రైతుల్లో ఆశావాదం, విశ్వాసం కలిగించవచ్చని, అదే సమయంలో తమ దృఢ సంకల్పాన్ని రైతులకు చాటవచ్చునని భావిస్తున్నారు. కానీ రాజకీయ విమర్శకులు దీన్ని రైతులపై ఒత్తిడి తేల్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కలసిన ప్రయత్నంగా పరిగణిస్తున్నారు.
వైసీపీ, వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. “ప్రధాని వస్తున్నారు కాబట్టి రైతుల భూములు తీసేసుకోవచ్చనుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. రైతుల భవిష్యత్తుపై చర్చ లేకుండా మద్దతు పేరుతో సభలు పెట్టడం మాయాజాలం,” అని CPI(M) నేత వి.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ వాదన ఏమిటంటే...
‘‘హైదరాబాద్‌లో ఒక ఎయిర్‌పోర్టు ఉంది. అయినా శంషాబాద్‌ నిర్మించాం. ఇప్పుడు రెండో ఎయిర్‌పోర్టు లేకుంటే హైదరాబాద్‌లో 10శాతం విమానాలు కూడా దిగేవి కాదు. రానున్న 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని సీఎం అమరావతి నిర్మాణం చేస్తున్నారు. స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉంటేనే స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ వస్తాయి. దీనికి అదనపు ల్యాండ్‌ పూలింగ్‌ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతున్నాం. ప్రజలు ల్యాండ్‌ పూలింగ్‌కు అంగీకరిస్తే చేస్తాం. లేదంటే భూసేకరణపై ఆలోచిస్తాం. పెరిగిన భూముల విలువ నిలవాలన్నా.. పెరగాలన్నా ప్రజలు ఉండాలి. ప్రజలు లేకపోతే భూముల విలువ పడిపోతుంది’’ అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అంటున్నారు.
భూముల కోసం రైతులపై ఒత్తిడి పెంచితే అది తాత్కాలిక విజయమే కావచ్చు. కానీ దీర్ఘకాలంలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది పాలకులు గుర్తుంచుకోవాల్సిన అత్యవసర విషయం.
Tags:    

Similar News