చంద్రాబాబును కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు
బుధవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన నాగబాబు, సోము వీర్రాజు.;
By : Admin
Update: 2025-04-02 12:50 GMT
ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగేంద్రబాబు(నాగబాబు), బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ మోషేన్ రాజు వీరిద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్సీ నాగబాబు సతీసమేతంగా కలిశారు.
మరో వైపు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ నేతలు ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి, ఇతర నాయకులు సోము వీర్రాజును సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు రెండో సారి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి మంచి రోజులు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అభివృద్ధికి సోము వీర్రాజు కృషి చేశారని, వీర్రాజు పార్టీకి చేసిన సేవలను ఆ పార్టీ పెద్దలు గుర్తించారని, ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ సీటును కూటమి భాగస్వామి పార్టీ అయిన బీజేపీకి కేటాయించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ వాణిని బలంగా వినిపించడంతో పాటుగా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలో సోము వీర్రాజు తన గళం విప్పుతారనే నమ్మకంతోనే బీజేపీ పెద్దలు ఆయనకు రెండో సారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. బూత్ లెవల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీ ఏపీలో ఒక బలమైన పార్టీగా తయారు అవుతుందని అన్నారు.
ఎమ్మెల్సీగా మండలిలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నాగబాబు తన భార్య పద్మజతో కలిసి సీఎ చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును శాలువాతో సత్కరించి, బొకేను అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్సీ నాగబాబును శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపట్టాన్ని బహూకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం ముగిసిన వారిలో టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు, పీ అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఐదు స్థానాలలో మూడు టీడీపీకి, జనసేనకు, బీజేపీకి ఒక స్థానం చొప్పున కేటాయించారు. టీడీపీ నుంచి బీదా రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు బీటీ నాయుడికి మరో సారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. జనసేన నుంచి కొణిదెల నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజులకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం వచ్చింది.