చట్టాలను చేతిలోకి తీసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి

ఆయన టీడీపీ ఎమ్మెల్యే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. అధికారులు చేయాల్సిన పనిని తానే దగ్గరుండి చేయించారు. చట్టాలను అగౌరవ పరిచారు.

Update: 2024-07-03 10:45 GMT

ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు. నేను ఏమి చేసినా చెల్లుతుందనుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ఎ కొండూరు మండలం కంభంపాడులోవైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త చెన్నారావు నిర్మిస్తున్న భవనాన్ని ఏకంగా ప్రొక్లైన్ తో కూలగొట్టించారు. ఇదీ నేటి పాలకులకు ఉన్న పరిణతి. పైగా ఆయన ఉన్నత విద్యావంతుడు. ఎందరో విద్యార్థులకు కోచింగ్ ఇచ్చిన వారు. అటువంటి వ్యక్తి ఇటువంటి పనులు చేయడం ఏమిటనేది ఇప్పుడు చర్చనియాంశమైంది.

తిరువూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ నిర్వహించిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నందుకు నజరానాగా చంద్రబాబు నాయుడు తిరువూరు టీడీపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. ఎమ్మెల్యే కాగానే కొమ్ములు మొలిచినట్లు భావించారు కొలికపూడి శ్రీనివాసరావు. ఏకంగా చట్టాన్నే చేతుల్లోకి తీసుకున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా చట్టాలపై గౌరవం లేదని నిరూపించారు. తాను ఏమి చేసినా సరిపోతుందనుకున్నారు. పోలీసులు, ఇతర అధికారులు నాకింద బంట్రోతులు అనుకున్నాడేమో ఎమ్మెల్యే. వారు చెబుతున్నా వినిపించుకోలేదు. ఏకంగా మంగళవారం తన ఇష్టానుసారం ప్రవర్తించారు. కంభంపాడులోని హైవేపై కారు ఆపి ఆ కారుపై ఎక్కి కిక్కెక్కిన కోతిలా వ్యవహరించారని స్థానికులు చెప్పారు. భవనం అక్రమంగా నిర్మిస్తున్నారు. వెంటనే పడగొట్టాలంటూ ప్రత్యేకించి ప్రొక్లైన్ తెప్పించి దాదాపు ముందు భాగమంతా కూలగొట్టించారు. భవనంపై రెండో అంతస్తులో వైఎస్సార్సీపీ వారు కూర్చుని నిరసన తెలపడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. పైగా అది జాతీయ రహదారి కావడం వల్ల భారీగా వాహనాలు నిలబడి ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. శ్రీనివాసరావు ఇచ్చిన ఆదేశాలతో ప్రొక్లైన్ వారు భవనాన్ని కూలగొట్టారు.

పోలీసులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్రమ కట్టడం పేరుతో భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. దీనిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామంటూ అధికారులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పి పంపించారు.

తమ స్థలాలను ఆక్రమించి, అందులో అక్రమంగా భవంతి కడుతున్నారని కంభంపాడుకు చెందిన ముస్లిం మహిళతో పాటు విస్సన్నపేటకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆదివారం కంభంపాడు వచ్చిన ఎమ్మెల్యే ఆ భవనాన్ని పరిశీలించారు. అది అక్రమ నిర్మాణమని భావించారు. వాటిని తొలగించి బాధితులకు స్థలం అప్పగించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు తొలగించకపోతే తానే కూల్చివేస్తానంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. రోడ్డుపై అడ్డంగా కారు ఆపి ఆ కారుపై నిలబడి హల్చల్ చేశారు. భద్రాచలం జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచాయి. ఆక్రమణ తొలగించే వరకు అక్కడి నుంచి కదలనని ఎమ్మెల్యే తన వాహనం పైకి ఎక్కి కూర్చున్నారు.

పోలీసులనూ లెక్క చేయలేదు...

కూల్చివేత చర్యలను మైలవరం ఏసీపీ మురళీమోహన్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కట్టడం కూల్చవద్దని, సర్వే చేసి ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని అధికారులు చెప్పినా వినకుండా ఎమ్మెల్యే మొండిగా ముందుకెళ్లారు. బాధితులకు తక్షణమే న్యాయం జరగాలంటూ మూర్ఖంగా ప్రవర్తించారు. ప్రొక్లైన్ తో డాబా దిగువన భవనం కూల్చివేయించారు. ఆ స్థలంలోకి ఎవరూ రావద్దని అధికారులు స్పష్టం చేయడంతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్‌ఎస్‌ నంబరు 197/14లో నిర్మిస్తున్న ఆ భవనానికి అనుమతుల్లేవని, అది అక్రమ నిర్మాణమని ఎమ్మెల్యే వాదించారు. తాము ఎవరి స్థలమూ ఆక్రమించలేదని, అక్రమంగా భవనం నిర్మించడం లేదంటూ ఎంపీపీ నాగలక్ష్మి తేల్చిచెప్పారు. వైఎస్సార్సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి స్వామిదాసు ఎంపీపీకి మద్దతుగా వచ్చారు. తమ భవనం కూల్చివేతపై న్యాయపోరాటం చేస్తామని ఎంపీపీ నాగలక్ష్మి చెప్పారు. ఎమ్మెల్యే హడావుడి, అత్యుత్సాహం దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్తతలకు దారితీసింది.

Tags:    

Similar News