ముగిసిన మిథున్‌రెడ్డి విచారణ..300 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు

ఐదు గంటలకుపైగా సిట్‌ అధికారులు ఎంపీ మిథున్‌రెడ్డిని విచారించారు.;

Update: 2025-07-19 15:14 GMT

లిక్కర్‌ స్కామ్‌ కేసులో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఐదు గంటలకుపై సిట్‌ అధికారులు విచారించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మిథున్‌రెడ్డిని విచారించారు. మద్యం కుంభకోణంకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యం కంపెనీల నుంచి ముడుపులు అంతిమంగా ఎవరికి చేరాయనే వ్యవహారంపై ఎక్కువుగా ప్రశ్నలు సంధించారు. మిథున్‌రెడ్డి విచారణే ఈ లిక్కర్‌ కేసులో పోలీసులు కీలకంగా భావిస్తున్నారు. విచారణలో ఎంపీ మిథున్‌రెడ్డి వెల్లడించిన కీలక అంశాల ఆధారంగా మద్యం కుంభకోణం కేసుకు సంబందించి ఛార్జిషీట్లను కూడా పోలీసులు తయారు చేసినట్టు తెలిసింది.

లిక్కర్‌ స్కామ్‌లో దండుకున్న ముడుపులను వివిధ బ్యాంకులు, ఆసుపత్రులు, గోల్డ్‌ షాపులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల వివరాలు, వాటికి సంబంధించిన స్టేట్‌మెంట్లను స్వాధీనం చేసుకున్న సీట్‌ అధికారులు వీటిని కూడా ఛార్జ్‌షీట్‌లో జత చేశారు. మద్యం వ్యవహారాల్లో అందిన ముడుపులు వివిధ షెల్‌ సంస్థల ద్వారా రావడం, ఈ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు తమ వద్ద ఉన్న బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చిన అంశాలను కూడా ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచినట్లు సమాచారం.

లిక్కర్‌ స్కామ్‌ కేసు మీద 300 పేజీలతో కూడిన ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ను సిట్‌ అధికారులు శనివారం సాయంత్రం కోర్టుకు సమర్పించారు. దాదాపు 100కుపైగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టులు, వివిధ ఎలక్ట్రానిక్‌ పరికరాలను కూడా కోర్టుకు సమర్పించిన రిపోర్టులో జతపరిచారు. ఈ మద్యం కుంభం కోణం మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు రూ. 62 కోట్లను సీజ్‌ చేసినట్లు ఆ రిపోర్టులో పేర్కొన్న సిట్‌ అధికారులు.. దాదాపు 268 మంది సాక్షులను విచారించడంతో పాటుగా 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్‌ రిపోర్టులు కూడా జత చేసినట్లు తెలిసింది. అయితే ఈ లిక్కర్‌ స్కామ్‌ ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని, దీనిపై తాము కొనసాగిస్తున్న విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల మరో 20 రోజుల్లో మరో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని సిట్‌ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
Tags:    

Similar News