కర్నూలులో డ్రోన్‌ నుంచి క్షిపణి ప్రయోగం సక్సెస్‌

సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు.;

Update: 2025-07-25 12:15 GMT

కర్నూలు జిల్లా నేషనల్‌ ఓపెన్‌ ఏరియా రేంజి(ఎన్‌ఓఏఆర్‌)లో డ్రోన్‌ నుంచి క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. ఆ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ఈ క్షిపణిని అభివృద్ధి చేయడంలోను పరీక్షించడంలోను భాగస్వాములైన డీఆర్‌డీఓ, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లను ఆయన అభినందించారు. కష్టతమైన, సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతో పాటు దానిని తయారీ చేయగల సామర్థ్యాన్ని కూడా భారత దేశం కలిగి ఉందని చెప్పడానికి ఈ డ్రోన్‌ క్షిపణి ప్రయోగం నిరూపించిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. దేశీయంగా డెవలప్‌ చేసిన ఈ క్షిపణిని యూఏవీ లాంచ్‌డ్‌ ప్రషన్‌ గైడెడ్‌ మిస్సైల్‌(యూఎల్‌పీజీఎం)–వీ3గా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఈ క్షిపణిని పరీక్షించేందుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలోని డీఆర్‌డీవో పరిధిలోని ఎన్‌ఓఏఆర్‌ పరీక్షా కేంద్రాన్ని ఎంచుకున్నారు.

ఈ క్షిపణి ప్రయోగానికి సంబంధించి ఫొటోను రాజ్‌నాథ్‌సింగ్‌ ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేశారు.
సీఎం చంద్రబాబు కూడా ఈ డ్రోన్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్‌ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మన దేశ రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఆంధ్రప్రదేశ్‌ దోహద పడటం గర్వంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నేషనల్‌ ఓపెన్‌ ఏరియా రేంజ్‌లో యూఏవీ–లాంచ్డ్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం చేసిన సైంటిస్టులు, ఆవిష్కర్తలకు, రూపకర్తలకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. భారత దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేకునేందుకు ఇది ఒక ప్రాముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. యూఎల్‌పీజీఎం–వీ3 సక్సెస్‌ అనేది ఆత్మనిర్బర్‌ భారత్‌ నిజమైన స్పూర్తిని ప్రతిబింస్తుందని, దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన ట్వీట్‌ను జత చేస్తూ.. దీనిపై ప్రతిస్పందించారు.

Tags:    

Similar News