పంట కోయలేక.. చేలో వదల్లేక! మిర్చి రైతుల గుండెకోత!

మిర్చి రైతుల కంట కన్నీరు కమ్ముతూనే ఉంది. ఆదుకుంటామన్న కేంద్రం హామీ కాగితాలకే పరిమితమైంది. గిట్టుబాటు కాదని రైతులు పంటను చేలల్లోనే వదిలేస్తున్నారు.;

Update: 2025-04-04 02:01 GMT
గుంటూరు మిర్చి యార్డులో నిల్వ చేసిన మిరపకాయల బస్తాలు (సోర్స్. సిఎస్ శారదా ప్రసాద్)
మిర్చి రైతు కంట కన్నీరొలుకుతోంది. వచ్చు కాలం కంటే గత కాలమే మేలన్న సామెతను రుజువు చేస్తోంది. ధరలు లేక దిగాలు పడి దిక్కులు చూస్తున్న మిర్చి రైతాంగం తాను పండించిన పంటను తానే దున్నేసుకుంటున్నారు. ఒకప్పుడు పంట వేయకపోయామే అని క్షోభ పడిన రైతు ఇప్పుడు ఆ పంటను ఎందుకు వేశామా అని బాధ పడుతున్నాడు. పంట చేతికి వచ్చిందన్న ఆనందం లేకుండా, ధరలు కనీసం పెట్టుబడికైనా రావడం లేదన్న నిస్సహాయతతో సతమతం అవుతున్నాడు. ఇప్పటి దాకా టమోటానే పొలాల్లోనే వదిలేసిన రైతులు ఇప్పుడు మిర్చి పంటనూ వదిలేస్తున్నారు.

రైతులు ఆందోళనకు దిగినపుడు కేంద్రం జోక్యం చేసుకుని ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా రైతుకు దక్కడం లేదంటే పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు చుట్టూ రైతులు మిర్చిని లాట్లు కట్టి గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తుంటే వ్యాపారులు, దళారులు మాత్రం గట్టున నిలబడి 'అబ్బే, ఇంటర్నేషనల్ మార్కెట్ లో గిరాకీ పడిపోయిందండీ, క్వింటా 6,7వేలకు మించి ఇవ్వలేమండీ' అంటూ పెదవి విరుస్తున్నారు.
ఇప్పటి పరిస్థితి ఇలా ఉంది!
2025 ఏప్రిల్ 3న గుంటూరు యార్డులో మిర్చిలో నెంబర్ వన్ అనుకునే తేజ ఎస్ 17 రకం రూ.10 వేలకు మించలేదు. డీలక్స్ క్వాలిటీ అంటే కూడా రూ.13 వేలు రాలేదు. 334 రకం సన్నాలు, 5531, 668 రకాలు రూ.9 వేలు, 341 రకం, ఆర్మూర్ రకాలు రూ.8, 9 వేల మధ్య పలికాయి. అదే మధ్యస్థ రకమైతే రూ.4 నుంచి రూ.6వేల మధ్య పలికాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ధరలు పెరగకపోవడానికి మేము కారణం కాదు!
ధరలు పెరగకపోవడానికి తాము కారణం కాదని చిల్లీ అసోసియేషన్ ప్రకటించింది. పంట దిగుబడి పెరగడం, గత ఏడాది పంట ఇంకా కోల్డ్ స్టోరేజీలలో నిల్వ ఉండడం, అంతర్జాతీయంగా గిరాకీ లేక ఎగుమతులు తగ్గడం ధరల పతనానికి కారణంగా చెబుతోంది. కోల్డ్ స్టోరేజీలలో ఇప్పటికీ 20 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వ ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. రైతుకు ఓ రూపాయి ఎక్కువ రావడానికి వ్యాపారులు ప్రయత్నిస్తారు తప్ప నష్టపరచాలని చూడరని మిర్చి వ్యాపారి సురేంద్ర చెప్పారు.

రాష్టంలో పండించే వాణిజ్య పంటలలో మిరప చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మిర్చి పంట సాగు విస్తీర్ణం 2.5 లక్షల హెక్టార్లుకి పైగా ఉంది.
గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలు కలిపి 96% సాగు విస్తీర్ణం ఉంది. 98% దిగుబడి ఈ ప్రాంతం నుంచే వస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 78,౦౦౦ హెక్టార్లు, ఉమ్మడి ప్రకాశంలో 51,౦౦౦, కర్నూలు జిల్లాలో 21,౦౦౦, కృష్ణా జిల్లాలో 12,౦౦౦, అనంతపురంలో 6,౦౦౦, తూర్పు గోదావరిలో 3,౦౦౦ హెక్టార్లలో మిర్చి సాగవుతోంది. ఉత్తరాంధ్రలోనూ అక్కడక్కడ మిర్చి సాగవుతోంది.
తగ్గుతున్న ధరలు
ఇప్పుడు గుంటూరు మార్కెట్లో ధరలు బాగా తగ్గాయి. 2024తో పోల్చితే మిర్చితో పాటు ఇతర పంటల ధరలు క్షీణించాయి.
పంట               2024 ధర (క్వింటా)              2025 ధర (క్వింటా)
మిర్చి                 ₹26,000                             రూ.11,000
కంది                     ₹10,500                             ₹6,500
ఎర్ర సెనగలు          ₹7,000                              ₹5,500
తెల్ల సెనగలు         ₹11,౦౦౦                              ₹6,000
పొగాకు                     ₹36,000                              ₹26,000
రాష్ట్రంలో మిర్చి ధరల తగ్గుదలపై రాజకీయ పోరాటం కొనసాగిందే తప్ప రైతుల్ని ఆదుకునే దిశగా చర్యలు చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీవీ ప్రసాద్ చెప్పారు. అధికార, ప్రతిపక్ష నాయకుల హడావిడితో కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటామని ప్రకటించినా అటువంటిదేమీ కనిపించడం లేదని అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రం కనీస మద్దతు ధర (MSP) ప్రకటించిందని చెబుతూనే, ఆ ధరలు మార్కెట్లలో అమలవడం లేదని విమర్శించారు.
MSP తర్వాత కూడా వాస్తవ ధరలు అంతకు తక్కువగా ఉండడం రైతులను మరింత నిరాశకు గురిచేస్తోంది. గుంటూరు మిర్చి యార్డులో గతేడాది క్వింటాల్ రూ.25 వేలు పలికిన మిర్చి ధర, ఈ ఏడాది కనీసం రూ.11 వేలు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు.
మిర్చి రైతుల ఆందోళన, రాష్ట్ర ప్రభుత్వ వినతులతో కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద క్వింటాల్‌కు 11,781 రూపాయలిస్తామని తెలిపింది.
నిజానికి ఈ ధర ఏ మాత్రం సరిపోదని మేడికొండూరు చెందిన రైతు వెంకటరెడ్డి చెప్పారు. క్వింటాల్ మిర్చికి కనీసం రూ.20 వేలు వస్తే గానీ నష్టాల నుంచి గట్టెక్కగలమని చెప్పారు. పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయని, ఎకరాకి కనీసం రూ.2 లక్షలకు మించి పెట్టుబడి పెట్టాల్సివస్తోందన్నారు. కూలీలకు కూలిచ్చే పరిస్థితి లేక పంటను పొలాల్లోనే వదిలేస్తున్న ఘటనలను వివరించారు.
మిర్చి కోతకు కూలీలు కూడా లభించడం లేదు.
రైతు వద్ద డబ్బు లేకపోవడం, ధరలు లేకపోవడంతో పంటను కోయకుండానే పొలాల్లో వదిలేస్తున్నారు.
గతంలో ఇది టమోటా పంటకే పరిమితంగా కనిపించిన దృశ్యం, ఇప్పుడు మిర్చికూ వర్తిస్తోంది.
ధరలు ఎందుకు తగ్గాయి?
ఒకప్పుడు అంతరాష్ట్ర మార్కెట్లలో ఆకర్షణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మిర్చి ధరలు గణనీయంగా పడిపోవడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది వాతావరణ అనుకూలంగా ఉండటంతో మిర్చి దిగుబడి బాగా వచ్చింది. అయితే అంతర్జాతీయ , దేశీయ మార్కెట్లలో డిమాండ్ స్థిరంగా లేకపోవడంతో ధరలు పడిపోయాయి.

రైతులు తక్షణమే పంటను అమ్మకానికి తీసుకురావలసిన అవసరం ఏర్పడింది. సరైన నిల్వ వసతులేమి (కోల్డ్ స్టోరేజ్) వల్ల పంట నిలుపుకోవడం కష్టం అయింది. దీనివల్ల మధ్యవర్తులకు వీలైన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు గతంలో కోల్డ్ స్టోరేజీలలో నిల్వ ఉంచిన పంట ఇప్పటికీ అలాగే ఉంది. మంచి ధర వస్తే అమ్ముకోవాలని రైతులు చూస్తున్నారు.
మిర్చికి ప్రధాన ఎగుమతి దేశాలు అయిన శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయ్, థాయ్ లాండ్, చైనా వంటి దేశాల్లోని కొనుగోలు మాంద్యం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది. చైనా మిర్చి నిల్వల పెరుగుదల కూడా మన మార్కెట్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది.
కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించినప్పటికీ, నిజంగా మార్కెట్లలో అమలవడం లేదు. రాష్ట్ర స్థాయిలో నేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంకూడా రైతులు తక్కువ ధరకే మిర్చిని అమ్ముకోవాల్సి వస్తోంది.
రాష్ట్రంలోని మిర్చి ప్రాసెసింగ్ పరిశ్రమలు లేవు. దీంతో వ్యాపారులు చెప్పిందే వేదంగా సాగుతోంది. మిర్చిలో రారాజుగా పిలిచే తేజ వంటి రకాన్ని కూడా రైతులు అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ చర్యలు ఎక్కడ?
ధరల పతనంతో రైతులు బోరున విలపిస్తున్నా, ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన కనిపించలేదు. కనీస మద్దతు ధరపై సమీక్ష, మార్కెట్ విస్తరణ చర్యలు, రైతులకు నేరుగా చెల్లింపులు వంటి చర్యలు తీసుకోకపోతే రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని రైతు నాయకుడు సీహెచ్ జమలయ్య చెప్పారు. రైతు కడుపు తరుక్కుపోతున్న ఈ స్థితిలో వ్యవసాయ రంగాన్ని ఆదుకునే విధంగా పాలకులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
పెరిగిన పెట్టుబడి.. పడిపోయిన ధర
ఈ సంవత్సరం మిర్చి పంటకు మార్కెట్ ధర క్వింటాల్‌కు ₹11,000కి పడిపోయింది. ఇది గత సంవత్సరం ₹26,000తో పోల్చితే సగానికి పైగా తగ్గుదల. ఈ స్థాయిలో ధర తగ్గడం వలన పెట్టుబడి ఖర్చు కూడా రావడం లేదు. ఎరువులు, పురుగుమందులు, నీటి వ్యవస్థలు, కూలీల ఖర్చులతో కలిసి పంట సాగు నష్టాల ఊబిలోకి రైతులను నెట్టేస్తోంది.
ధరలు లేకపోవడంతో రైతులు పంటను చేలల్లోనే వదిలేస్తున్నారు. కోత కూలి కూడా రాదేమోనన్న అనుమానంతో రైతులు ఇంతటి తీవ్ర నిర్ణయానికి వస్తున్నారు. పండిన మిర్చిని పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఇప్పటి వరకు టమోటా రైతులే పొలాల్లో పంటను వదిలేస్తున్నారనుకుంటే ఇప్పుడు మిర్చి పంటకీ ఈ దుస్థితి వచ్చింది.
Tags:    

Similar News