మంత్రులకు తెలియకుండా పేషీల్లో అవినీతి జరుగుతుందా?

రాష్టంలోని కొందరు మంత్రుల పేషీల్లో అవినీతి పెచ్చు మీరిందనే విమర్శల నేపథ్యంలో కొందరు ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.;

Update: 2025-01-04 12:52 GMT

మొన్నటికి మొన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో అవినీతి, నిన్నటికి నిన్న హోం మంత్రి పేషీలో అవినీతి. ఈ వార్తలకు ప్రయారిటీ ఇచ్చి ప్రచురించింది ఈనాడు దిన పత్రిక. ఆంధ్రప్రదేశ్ లోని మంత్రుల పేషీల్లో అవినీతి జరిగితే వారికి తెలియకుండా ఉంటుందా? ఏ ఆదేశం ఇచ్చినా సంతకాలు పెట్టాల్సింది మంత్రులే కదా? అలాంటప్పుడు వారికి తెలియకుండా అవినీతి జరగటం, దానిపై స్థానిక తెలుగుదేశం పార్టీ వారు హై కమాండ్ కు ఫిర్యాదులు చేయడం, ఆ తరువాత వారిపై చర్యలు తీసుకోవడం ఏమిటనే చర్చ మొదలైంది. ఇద్దరు మంత్రుల పేషీల్లో విషయం బయటకొచ్చింది. ముఖ్యమంత్రి హెచ్చరించిన మంత్రుల్లో మరో ఇద్దరు కూడా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హోం మంత్రి వంగలపూడి అనిత దగ్గర ప్రైవేట్ పీఏగా పదేళ్ల నుంచి పనిచేస్తున్న సందు జగదీష్ ను తప్పుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. గతంలోనూ చాలా చోట్ల అవినీతికి పాల్పడ్డాడని, తమను లెక్క చేసే వాడు కాదని, నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోపో అంటూ హేళనగా మాట్లాడుతున్నాడని, అందువల్ల ఆమె పీఏగా జగదీష్ పనికి రాడని స్థానిక టీడీపీ నేతలు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఫిర్యాదు చేశారు. దీంతో చేసేది లేక జగదీష్ ను విధులకు రావొద్దంటూ మంత్రి ఆదేశించారు. మంత్రికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఆ మేరకు ఆమె తొలగించాల్సి వచ్చింది. నిజానికి జగదీష్ పై ఫిర్యాదు కాదు. ఏకంగా మంత్రిపైనే ఫిర్యాదు. నియోజకవర్గంలో ఏ నాయకుడికి దెబ్బ తగిలిందో తెలియదు. లేదా ఆయన చెప్పిన వారికి ఏ పని చేసి పెట్టలేదో తెలియదు. అంతే తప్ప ఇన్నేళ్ల నుంచి అవినీతి ఆరోపణలు రాని జగదీష్ పై ఇప్పటికిప్పుడు ఆరోపణలు రావడంపై చర్చ మొదలైంది.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేషీలో కీలక అధికారిగా ఉన్న ఒక వ్యక్తి అవినీతి తారాస్థాయికి చేరిందని పార్టీ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదులు అందాయి. కార్యాలయానికి ఎవరు ఏ పనిపై వచ్చినా 'సాయంత్రం 5.30 తర్వాత సార్ ఇంటి వద్దకు రండి' అని చెబుతాడనేది ఫిర్యాదులో ప్రధానాంశం. అక్కడికొచ్చాక పని పూర్తి కావాలంటే ఎంత ఖర్చవుతుందో ఓ సంఖ్య చెబుతారు. పోస్టింగ్ కావాలన్నా, బదిలీ చేయాలన్నా, పదోన్నతి కల్పించాలన్నా ప్రతి పైరవీకి ఓ లెక్క ఉంటుందననేది ఆరోపణలు చేసిన వారు చెబుతున్న మాట.

అది నిబంధనలకు అనుగుణంగా ఉన్నా, అతీతంగా ఉన్నా, ఆ లెక్కకు సరిపోతే చాలు.. మరి దాని వంక చూసే పనిలేదు. సస్పెండైన వారైనా, కేసుల్లో ఉన్న వారైనా అడిగినంత సమర్పించుకుంటే ఫైల్ కదులుతుంది. లేదంటే మంత్రి సంతకం చేసిన ఫైలు కూడా వారాలు, నెలలు తరబడి ఆగిపోతుందని అటువంటి వ్యక్తి ఆ పోస్టులో పనికి రాడని ఫిర్యాదు దారులు లోకేష్ కు చెప్పినట్లు సమాచారం. వచ్చింది ఎవరు? పని ఏమిటనేది కాదు, సాయంత్రానికి కలెక్షన్ ఎంత వచ్చిందనేదే ముఖ్యం అంటూ తెలుగుదేశం పార్టీలోని వారే ప్రచారం మొదలు పెట్టారు.

రాష్ట్రంలో మంత్రి పేరు మాత్రమే మారిందని, పేషీలో ఉన్న వారంతా మాజీ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి వద్ద పనిచేసిన వారనే ఆరోపణలు తెలుగుదేశం వారి నుంచి వచ్చాయి. మాజీ మంత్రి జోగి రమేశ్ వద్ద ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తే పేషీలో చక్రం తిప్పుతున్నాడని ఈనాడు దినపత్రిక రాసింది. వ్యవసాయ మంత్రి పేషీ అంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులతోనే నిండిపోయిందని ఈనాడులో వార్త ప్రచురితం కావడంతో మరింత చర్చకు దారితీసింది.

ఏకంగా ఒక్కో మంత్రి అవినీతి ఒక్కోరోజు బయట పడుతోందనే చర్చ ప్రజల్లో మొదలైంది. మంత్రులకు తెలియకుండా పేషీలో అధికారులు ఎలా అవినీతి చేస్తారనే చర్చ కూడా సాగుతోంది. కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రులకు నేటికీ కొంత మందికి పీఏలు కూడా లేరు. మంత్రి లోకేష్ నుంచి ఏ పేరు వస్తే ఆ వ్యక్తినే పీఏగా తీసుకోవాలనే చర్చ కూడా జరుగుతోంది. ఆరు నెలల నుంచి ఇంతవరకు అధికారిక పీఏలు లేని మంత్రులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది నిజం.

ఇటీవల మంత్రుల పేషీల్లో పీఆర్వోలను తీసుకోవటానికి ఒక ప్రకటన వెలువడిది. ఆ ప్రకటన ప్రకారం ఐఅండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ వారు ఇంటర్వూలు చేసి తీసుకుని మంత్రి వద్దకు పంపిస్తారు. ఎవరికి వారు తమకు నచ్చిన వారిని పీఏలుగా, పీఎస్ లుగా, ఓఎస్డీలుగా తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇవన్నీ పరిశీలిస్తే మరికొందరు మంత్రుల పేషీల్లో కూడా ఉద్యోగుల మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. రావాణా మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేషీలోనూ అవినీతి ఎక్కువైందని లోకేష్ కు తెలుగుదేశం పార్టీ వారే ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

వరుసగా మంత్రుల పేషీలపై వస్తున్న ఆరోపణలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెడ్డపేరు తెస్తున్నాయని తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులు అంటున్నారు. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే పలువురు మంత్రులకు చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారని, పార్టీ పనిని పక్కన బెట్టిన వారికి కూడా వార్నింగ్ లు ఇవ్వడం జరిగిందనేది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ. మంత్రి వర్గ సమావేశాలు ముగిసిన ప్రతి సారీ మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అటువంటి వారికి వార్నింగ్ లు ఇచ్చి సరిపెడుతున్నారు. ఈనెల 8న మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది. మంత్రివర్గంలోకి ఇప్పటికే తీసుకున్న జనసేన నేత నాగబాబు చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది. ఆ సందర్భంగా మార్పులు జరిగే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న మంత్రులపై ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. మరో ఇద్దరు కొత్త మంత్రులపైనా ఆరోపణలు వచ్చాయి. పేషీల్లో మంత్రులకు తెలియకుండా అవినీతి జరుగుతుందనటంలో అర్థం లేదనే చర్చ కూడా రాష్ట్రంలో జోరందుకుంది. ఇప్పటికీ మంత్రుల పేషీలకు పీఏలే లేకుండా విధులు నిర్వహిస్తున్న వారు కూడా ఉన్నారు.

Tags:    

Similar News