‘ఓరి నీ పాసుగాల! నిన్ను చూడ్డానికి పాసులు లేందయ్యా జగన్’!!
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా;
By : Amaraiah Akula
Update: 2025-09-02 13:16 GMT
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. సొంత పార్టీ కార్యకర్తలు కలవడానికి పాసులేమిటంటూ ఎద్దేవా చేశారు.
తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో వైసీపీ కార్యకర్తలకు మాజీ సీఎం వైఎస్ జగన్ వీఐపీ పాసులు జారీ చేయడంపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..!’ అంటూ జగన్ తీరును ఎండగట్టారు.
తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను కలవడానికి వీఐపీ పాసులు జారీ చేయించారని వార్తలు వచ్చాయి. ఈ పరిణామంపై నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొందరు కార్యకర్తలను మాత్రమే మాజీ ముఖ్యమంత్రి కలుసుకున్నారు. పాసులున్న వ్యక్తులనే భద్రతా సిబ్బంది అనుమతించడం, గతంలో ఎన్నడూలేని విధంగా కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కంగుతిన్నారు. భద్రతా సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు.
దీనిపై లోకేశ్ స్పందించారు. అయితే దీన్ని వైసీపీ నేతలు ఖండించారు. పాసులు అనేది అధికార పక్షం సృష్టేనంటూ వ్యాఖ్యానించారు.