టీడీఆర్ బాండ్ల అక్రమాలకు అడ్డుకట్ట.. సర్కార్ ప్లాన్ ఇదే..
టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని, వాటికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఇప్పటికే దీనిపై దృష్టి పెట్టింది.
టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని, వాటికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఇప్పటికే దీనిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే టౌన్ ప్లానింగ్ విభాగాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసేలా నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ వ్యవహారినికి సంబంధించే టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ శాఖ మంత్రి సమావేశం నిర్వహించారు. టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు తావు లేకుండా అవసరమైన చర్యలను రిజిస్ట్రేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని నారాయణ సూచించారు. రెండు శాఖలను అనుసంధానం చేసేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించాలని కూడా అధికారులకు సూచించారు. సర్వే నెంబర్లు, ఈసీలు, ఓనర్‌షిప్ దస్త్రాల జారీ అంతా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పాలి. ఇప్పటివరకు టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేయించే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని చెప్పారు.
టీడీఆర్ అంటే ఏమిటి?
ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) మునిసిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వానికి అవసరమైన భూమిని తీసుకోవాల్సి వచ్చినప్పుడు భూ సేకరణ చట్టం కింద, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల చట్టం కింద భూమిని స్వాధీనం చేసుకుని, యజమానికి పరిహారం చెల్లిస్తుంది. ప్రాజెక్టుల కింద స్వాధీనం చేసుకుని భూమి కోల్పోయిన వారికి ఈ చట్టం కింద పునరావాసంతో పాటు పరిహారం కూడా అందిస్తుంది ప్రభుత్వం. టీడీఆర్ బాండ్స్ అంటే ప్రభుత్వానికి అవసరమైన భూమిని తీసుకున్నప్పుడు భూమి కోల్పోయిన వ్యక్తికి భూసేకరణ చట్టం కింద పరిహారం కాకుండా టీడీఆర్ బాండ్స్‌ను రిలీజ్ చేస్తుంది. ఉదాహరణకు ఒక నగరంలో రోడ్డు విస్తరణ చేయాల్సినప్పుడు రోడ్డుకు ఇరువైపుల స్థలాలు కోల్పోయేవారు ఉంటారు. వారికి పరిహారానికి బదులు టీడీఆర్ బాండ్స్ రిలీజ్ చేస్తారు. ఈ బాండ్స్ అమ్ముకునేందుకు, వేరే వారికి రిజిస్టర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక వేళ బాండ్ తీసుకున్న వ్యక్తికి వేరేచోట స్థలం ఉంటే అందులో భవనాలు కట్టుకునేందుకు అనుమతులకు కట్టాల్సిన మొత్తానికి సమానమైన టీడీఆర్ బాండ్లను ఇస్తే అనుమతులను పొందవచ్చు.
ఏపీలో కుంభకోణం ఎలా జరిగింది?
విశాఖపట్నం, తణుకు, గుంటూరు, తిరుపతిలో టీడీఆర్ బాండ్లు జారీ చేసిన మునిసిపల్ టౌన్ ప్లానింగ్ వారు భారీగా అవినీతికి పాల్పడినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. తణుకులో జరిగిన అక్రమాలపై వేసిన అధికారుల కమిటీ ప్రాథమిక నివేదిక అందిందని, దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు. తణుకులో 29 బాండ్లు జారీ చేస్తే అన్నీ అక్రమమే అని తేలిందన్నారు. బాండ్ల జారీలో ఎకరాల ప్రకారం విలువ కట్టాల్సి ఉన్నప్పటికీ చదరపు గజాల ప్రకారం భూమి విలువ కట్టి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఒక చదరపు గజానికి రు. 4,500 విలువ ఉండగా రూ. 22,000 లుగా లెక్క కట్టినట్లు చెప్పారు. అంటే తక్కువ విలువైన స్థలానికి ఎక్కువ విలువ కట్టి బాండ్స్ ఇచ్చారు. స్థలం కోల్పోతున్న వారి భూమి ధర కంటే దానికి 1.4 కిమీ దూరంలో ఉన్న భూమి విలువను పరిగణనలోకి తీసుకుని బాండ్లను జారీ చేయడం అనేది ఒక పెద్ద స్కాం అని మంత్రి చెప్పారు. తణుకులో బాండ్ల జారీలో అక్రమాలకు పాల్పడ్డ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఎక్కడైతే బాండ్ల జారీలో అక్రమాలు జరిగాయో అలాంటి చోట్ల ఇచ్చిన బాండ్లను నిలిపివేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో పాలకుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగినట్లు మంత్రి చెప్పారు. ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ స్కాం జరిగిందని ఆయన వెల్లడించారు.