అమరవీరులారా వందనం.. మీ వారసులకు మాది భరోసా..
దేశ భద్రత త్యాగాల పునాదులపైనే ఉందన్న మంత్రి మండిపల్లి. పోలీసు అమరుల స్మారక స్థూపాల వద్ద నివాళులర్పించిన అధికారులు.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-21 09:17 GMT
రాయలసీమలోని అన్ని జిల్లా కేంద్రాల వద్ద పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్మారకస్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. తుపాకులు కిందికి దించి, గౌరవ వందనం సమర్పించారు.
సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ లో పోలీసుల త్యాగాలు నిరుమానమని అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల వారసులకు ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కూడా ఇచ్చారు.
త్యాగాలు మరువకూడదు..
దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తుంచుకోవాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. చిత్తూరు వన్ టౌన్ సమీపంలోని పోలీసు మైదానంలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జిల్లా జడ్జి అరుణ సారిక, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పి తుషార్ డూడి, నగర మేయర్ ఆముద, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చుడా (చిత్తూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ కటారి హేమలత, ప్రముఖులు పాల్గొన్నారు.
చిత్తూరులో పోెలీస్ అమరవీరుడి కుటుంబాన్ని సత్కరిస్తున్న జిల్లా జడ్జి అరుణ సారిక, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పి తుషార్ డూడి
చిత్తూరు జిల్లా ఎస్పి తుషార్ డూడీ మాట్లాడుతూ, ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడి, ఎన్నికల నిర్వహణ, మాదక ద్రవ్యాల కట్టడి, దొంగతనాలు అరికట్టడంలో పోలీస్ సిబ్బంది నిరంతరం కృషి చేశారన్నారు. అనంతరంవిధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీస్ కుటుంబాల సభ్యులకు ప్రశంసా పత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్సార్ రాజశేఖర్ రాజు, సంబద్ధత డీఎస్పీలు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా
పోలీసు అధికారులతో కలిసి రాయచోటిలో స్మారకస్థూపం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి
పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో రాయచోటి పోలీసు పరేడ్ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం భావోద్వేగాల మధ్య నిర్వహించారు. పోలీస్ అమరుల త్యాగాల పునాదులపైనే సమాజంలో శాంతి, భద్రతలు పదిలంగా ఉన్నాయని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభివర్ణించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. ప్రమాదాలు లెక్క చేయకుండా ప్రజల రక్షణ కోసం 'భయం ఉన్నా చర్య తీసుకోవడం' పోలీసులకే సాధ్యం అని మంత్రి మండిపల్లి వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ, ఈ సంవత్సరం అన్నమయ్య జిల్లాలో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
"వారు గౌరవంతో సేవ చేశారు. వారు గౌరవంతో మరణించారు. వారు మన జ్ఞాపకాలలో ఎల్లప్పటికీ జీవిస్తారు" అని ఎస్పీ ధీరజ్ అన్నారు. అనంతరం అమరవీరులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అమరులైన పోలీస్ కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. అనంతరం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబీకులతో జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమస్యలు ఉంటే స్వయంగా తెలియజేయాలని కోరారు.
తిరుపతిలో..
తిరుపతిలో ఏఆర్ (Armed Police AR) పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ ముఖ్య అతిథి హాజరయ్యారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అధ్యక్షతన జరిగిన సభలో వారిద్దరు మాట్లాడారు. అంతకుముందు పోలీస్ అమరవీరుల స్మారకస్థూపం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
"దేశ భద్రత, ప్రజాశాంతి కోసం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరవీరుల జాబితాను చదివి వినిపించారు. వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల మౌనం పాటించి వారికి గౌరవ నివాళులు అర్పించారు"
ఆ తరువాత జరిగిన సభలో తిరుపతి ల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడారు. పోలీస్ సిబ్బంది సమాజ భద్రతకు రక్షణ కవచం లాంటి వారు. వారు కుటుంబం, వ్యక్తిగత జీవితం పక్కనపెట్టి ప్రజల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.
"దేశ సేవలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం. వారి సేవలు, నిబద్ధత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఇలాంటి అమరుల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా నిలవాలి” అని కలెక్టర్ వెంకటేశ్వ సూచించారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ..
"తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు విధి నిర్వహణలో అశువులు బాసిన 25 మంది పోలీస్ సిబ్బంది త్యాగం చిరస్మరణీయం. పోలీస్ శాఖ సిబ్బంది సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు పరుస్తున్నాం. ప్రతి సిబ్బంది కుటుంబం సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం" అని ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు వెల్లడించారు. ఆ తరువాత అమరులకుటుంబీలకు కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సన్మానించారు.
"పోలీస్ సిబ్బంది త్యాగం వ్యర్థం కాదని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది" అని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు (పరిపాలన) రవి మనోహరాచారి (శాంతిభద్రతలు) నాగభూషణరావు (నేర విభాగం), ఇంటిలిజెన్స్ అదనపు ఎస్పీలు జిల్లా పోలీస్ అధికారులు, సివిల్ అధికారులు, పోలీస్ సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
31వరకు స్మారక దినోత్సవాలు
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు (ఆర్ఎస్ఎఎస్టీఎఫ్) కార్యాలయంలో పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ మాట్లాడారు. 2023లో టాస్క్ ఫోర్సు కానిస్టేబుల్ బి. గణేష్ మరణించడాన్ని ఆయన గుర్తు చేశారు. ఈనెల 31వరకు అమర వీరులను సంస్మరిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎస్పీ ఎండీ షరీఫ్, ఆర్ఐ సాయి గిరిధర్, ఆర్ఎస్ఐ విష్ణు వర్ధన్, ఎసీఎఫ్ శ్రీనివాస్, సీఐలు సురేష్ కుమార్, ఖాదర్ బాషా, ఆర్ఐ కృపానంద, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.