హాఫ్ మైండ్‌తో పని చేయొద్దు.. అధికారులపై ఆనం ఆగ్రహం
క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రాజెక్టులను పరిశీలించి డీపీఆర్‌లను రూపొందించాలని ఆదేశించారు.;
అమృతధార పథకం కోసం డీపీఆర్‌లను రూపొందించడంలో అధికారులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారని, ఈ ప్రాజెక్టు మీద ఎలాంటి అవగాహన లేకుండా అస్పష్టతతో కూడిన రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చారని, ఇలాంటి ధోరణిని వెంటనే మార్చుకోవాలని, హాఫ్ మైండ్‌తో ఎప్పుడూ పని చేయొద్దని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను మందలించారు. నెల్లూరు జిల్లా శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో ఇరిగేషన్ అధికారుల తీరుపై ఆనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అమృతధార పథకం కింద 2058 నాటికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 46 మండలాల్లో పూర్తి స్థాయిలో తాగు నీటి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, అందులో భాగంగా ఈ పథకం కోసం రూ. 8400 కోట్లు విడుదల చేసిందని, అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌లు రూపొందించలేక పోయారని, సరైన పద్ధతిలో డీపీఆర్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఈ రిపోర్టును శనివారం జరిగే కేబినెట్‌లో తాను వివరించాల్సి ఉందని, రిపోర్టులో సమగ్రత లేక పోతే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను నిలదీశారు. క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టులను పరిశీలించాలని, తర్వాతనే డీపీఆర్‌లను రూపొందించాలని ఆదేశించారు.