వీఆర్ హైస్కూలు పేరు ఎందుకు మార్చారు?: వేదికపైనే నిలదీసిన మంత్రి ఆనం

కార్పొరేట్ విద్యా ‘వ్యాపారం’లో నారాయణ ఫస్ట్ అని ప్రకటించిన మంత్రి ఆనం రామ్ నారాయణ్ రెడ్డి;

Update: 2025-07-08 05:12 GMT
Minister Ramanarayana Reddy

కార్పొరేట్ల చేతుల్లో విద్య వ్యవస్థ చిక్కుకు పోయిందని దేవదాయ శాఖ మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెద్ద కార్పొరేట్ విద్యాసంస్థలు మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ కు సంబంధించినవేనని అన్నారు. నెల్లూరు వీఆర్ హైస్కూలును కూడా కార్పొరేట్ సంస్థల్లో చేర్చే కార్యక్రమాన్ని నారాయణ తీసుకున్నారనే అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన తీరును తప్పుపట్టారు.

నెల్లూరులోని విఆర్ హైస్కూలు పున:ప్రారంభోత్సవ కార్యక్రమం ఆంధ్ర రాజకీయాల్లో కీలక చర్చకు దారితీసింది. కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు, మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణపై పరోక్షంగా విమర్శలు గుప్పించాయి. ఈ సంఘటన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో అంతర్గత విభేదాలను, విద్యా వ్యవస్థ కార్పోరేటీకరణపై ఉన్న వివాదాన్ని, నాయకుల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

విఆర్ హైస్కూలు నెల్లూరు జిల్లాలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన విద్యా సంస్థ. దాని పేరు మార్పు, అభివృద్ధి నిధుల సేకరణ విషయంలో వివాదంలో చిక్కుకుంది. సోమవారం జరిగిన పున:ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్కూలు పేరును "విఆర్ మునిసిపల్ హైస్కూలు"గా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మార్పు, మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో జరిగినట్లు ఆనం ఆరోపించారు. ఆనం కుటుంబం దశాబ్దాలుగా ఈ సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, ఈ విమర్శలు వ్యక్తిగత, రాజకీయ రంగాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఆనం రామనారాయణరెడ్డి ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. తన విమర్శల ద్వారా పలు రాజకీయ సందేశాలను పంపే ప్రయత్నం చేశారు.

మంత్రి నారాయణ "అతిపెద్ద విద్యారంగ కార్పోరేట్"గా వ్యవహరించడం ద్వారా, విద్యా వ్యాపారంపై సామాన్య ప్రజలలో ఉన్న అసంతృప్తిని లేవనెత్తారు. పొంగూరు నారాయణ తన విద్యా సంస్థల ద్వారా రాష్ట్రంలో ప్రైవేట్ విద్యావ్యవస్థ ను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఈ విమర్శలు ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ ఆధీనంలోకి తీసుకెళ్లే ప్రమాదాన్ని సూచిస్తాయి. ఈ వ్యాఖ్యలు పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోవచ్చనే ఆందోళనను ప్రతిబింబిస్తాయి.

నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం రాజకీయ ప్రాబల్యం, విఆర్ విద్యా సంస్థల నిర్వహణ ద్వారా మరింత బలపడింది. ఆనం తన కుటుంబం ఈ సంస్థను 65 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు పేర్కొనడం ద్వారా, తన స్థానిక రాజకీయ బలాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో నారాయణ జోక్యం, ఆనం స్థానిక ఆధిపత్యానికి సవాలుగా కనిపిస్తుంది.

పొంగూరు నారాయణ రాష్ట్రంలో విద్యా రంగంలో తన సంస్థల ద్వారా అత్యంత ప్రభావం చూపిస్తున్నారు. విఆర్ హైస్కూలు అభివృద్ధికి సీఎస్ఆర్ నిధుల సేకరణలో ఆయన పాత్ర, విద్యా రంగంలో తన ప్రభావాన్ని మరింత విస్తరించే ప్రయత్నంగా కనిపిస్తుంది. అయితే ఈ చర్య ఆనం వ్యతిరేకతకు దారితీసింది.

నారాయణ స్థాపించిన విద్యా సంస్థలు, రాష్ట్రంలో విద్యా రంగంలో ఒక శక్తిగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో జోక్యం చేసుకోవడం ద్వారా నారాయణ తన రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను సమన్వయం చేసుకుంటున్నాడు.

మునిసిపల్ శాఖ మంత్రిగా నారాయణకు స్థానిక సంస్థలపై గణనీయమైన నియంత్రణ ఉంది. విఆర్ హైస్కూలు పేరు మార్పు, మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో జరిగినట్లు ఆనం ఆరోపణలు సూచిస్తున్నాయి. ఇది నారాయణ స్థానిక రాజకీయ ప్రభావాన్ని మరింత విస్తరింప జేసుకునే ప్రయత్నంగా చెప్పొచ్చు.

విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఈ వివాదంలో కీలక పాత్ర పోషించారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఆనం విమర్శలు లోకేష్ నాయకత్వంపై కూడా ప్రశ్నలు లేవనెత్తాయి.

లోకేష్ సమక్షంలో జరిగిన ఈ వివాదం ఆయన నాయకత్వంలో సమన్వయ లోపాన్ని సూచిస్తుంది. సీనియర్ మంత్రులైన ఆనం, నారాయణ మధ్య విభేదాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం, లోకేష్ రాజకీయ అనుభవ లోపాన్ని తెలియజేస్తుంది.

లోకేష్ విద్యా రంగంలో సంస్కరణలను చేపట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కార్పోరేట్ సంస్థల పాత్రపై ఆనం లేవనెత్తిన ఆందోళనలు, లోకేష్ సంస్కరణల విధానంపై ప్రశ్నలు లేవనెత్తాయి.

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కార్పోరేటీకరణపై ఈ వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీసాయి. ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ సంస్థల ఆధీనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు, ప్రజలలో అసంతృప్తిని కలిగించవచ్చు.

Tags:    

Similar News