విశాఖ సాగరతీరంలో జలకన్యల విన్యాసం!

అలరిస్తున్న ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా అమ్మాయిలు. దేశంలో ఈ తరహా రెండో ప్రదర్శన వైజాగ్ ఎక్స్‌పోలో.;

Update: 2025-01-21 06:34 GMT

జలకన్యల గురించి కథల్లోనే విన్నాం... సినిమాల్లోనే చూశాం. వీరి కథలు విన్నా చదివినా జలకన్యలను చూస్తే ఎంత బాగుంటుందో కదా? అనిపించిన వారికి కొన్ని సినిమాలు ఆ కోరికను తీర్చాయి. కానీ కళ్లెదుటే చూడాలనుకున్న వారికి మాత్రం ఇన్నాళ్లూ ఆ అవకాశం రాలేదు. అలా తపిస్తున్న వారి కోసం విశాఖకు సిసలైన జలకన్యలు వచ్చారు. రోజూ వేలాది మందికి కనువిందు చేస్తున్నారు. ఇంతకీ ఆ జలకన్యల కథాకమామిషూ ఏమిటంటే?

కొన్నేళ్లుగా విశాఖ సాగరతీరంలోని పోలీస్ మెస్ వెనక వైజాగ్ ఎక్స్పో వివిధ రకాల ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఒకడుగు ముందుకేసి జలకన్యలను తీసుకొచ్చింది. వైజాగ్ ఎక్స్పో - 2025 పేరిట జనవరి 18వ తేదీ నుంచి రకరకాల ప్రదర్శనలను అందుబాటులో ఉంచింది. ఇందులో జలకన్యల ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జలకన్యల ప్రదర్శన కోసం ప్రత్యేకంగా రెండు అద్దాల మినరల్ వాటర్ (పది అడుగులకు పైగా) ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఒక్కో ట్యాంకులో 40 వేల లీటర్ల మినరల్ వాటర్ను నింపుతారు. రోజూ ఈ నీటిని మారుస్తారు. ఈ ట్యాంకుల్లో నీరు 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. ఆ నీటిలోకి ఈ జలకన్యను దింపుతారు.

 

ఈ జలకన్యలు వాటర్ ప్రూఫ్ దుస్తులను, రెండు కాళ్లకు దిగువన చేప తోక ఆకారంతో ఉన్న వస్త్రాలను ధరిస్తారు. కళ్లలోకి నీరు చొరబడకుండా గాగుల్స్ అమర్చుకుంటారు. దీంతో వీరు ముఖం మనిషిలా, కాళ్లు చేప తోక రూపంతోనూ ఉంటూ వీరు జలకన్యల్లా కనిపిస్తున్నారు. రెండు కాళ్లను కట్టి పడేసేలా ఉండే చేప తోక వల్ల ఆ నీటిలో ఈదడానికి అనువుగా ఉంటుంది. ముఖానికి ఆక్సిజన్ మాస్కులు వంటివేమీ లేకుండానే నీటిలో అటూ ఇటూ కలియదిరుగుతూ ఈ జలకన్యలు జలకాలాడుతూ ఉంటారు. నీటి అడుగున గరిష్టంగా 2.35 నిమిషాలు మాత్రమే ఉండగలుగుతారు. అందువల్ల వీరు ఆ సమయంలోపు ఒకసారి ఆ నీటి నుంచి బయటకు వచ్చి కాసేపు ఆక్సిజన్ పీల్చుకుని మళ్లీ నీటి అడుక్కి వెళ్లిపోయి ఒంపులు తిరుగుతూ వయ్యారంగా ఈత మొదలు పెడతారు.

అంతేకాదు.. తమను చూడటానికి వచ్చిన వారికి చేతులతో అభివాదాలు చేయడమే కాదు.. వాటర్ నుంచే ఎయిర్ కిస్లు కూడా ఇస్తుంటారు. ఇలా వీరు విన్యాసాలతో పాటు ఎక్స్ట్రా చేష్టలకు ఎక్స్పోకు వచ్చిన సందర్శకులు/వీక్షకులు కేరింతలతో ఫిదా అవుతున్నారు. 'జలకన్యల గురించి ఇన్నాళ్లూ సినిమాల్లోనే చూశాను. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని పొందాం. మా పిల్లలు కూడా చాలా మురిసిపోతున్నారు' అని సంక్రాంతికి విశాఖ వచ్చిన కాకినాడకు చెందిన టి. సుజాత 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో తన ఆనందాన్ని పంచుకున్నారు.

 

ఎక్కడ నుంచి వచ్చారు ఈ జలకన్యలు?

ఎక్స్పో నిర్వాహకులు నలుగురు జలకన్యలను అస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి తీసుకొచ్చారు. వీరిలో ఫిలిప్పీన్స్కు చెందిన అజిల్ అజియా (28), రూత్ (33) ఇద్దరు ప్రస్తుతం జలకన్యల ప్రదర్శనలిస్తున్నారు. నేడో రేపో మిగతా ఇద్దరు ఆస్ట్రేలియన్ జలకన్యలు కూడా జాయిన్ కానున్నారు. అస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో యువతులకు ఈ తరహా శిక్షణ ఇస్తుంటారు. దీనికి ఆ ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఒక కోర్సును కూడా అందుబాటులోకి తెచ్చారు. ఆ కోర్సు పూర్తి చేసిన వారు, శిక్షణలో తర్పీదు పొందాక దేశ విదేశాల్లో జలకన్యలుగా ప్రదర్శనలిస్తుంటారు. వీరి వృత్తి కష్టతరం కావడంతో వారికిచ్చే రెమ్యూనరేషన్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది.

విశాఖ వచ్చిన ఈ జలకన్యలు ఒక్కొక్కరికి నెలకు మూడు వేల డాలర్లు (సుమారు రూ.2.50 లక్షల) చొప్పున చెల్లించే ఒప్పందంపై తీసుకొచ్చారు. ‘ఫిలిప్పీన్స్లో రెండేళ్ల పాటు ఇందులో ప్రత్యేక శిక్షణ పొందాను. మేం ఎంచుకున్న జలకన్యల ప్రదర్శన చాలా కష్టంతో కూడుకున్నది. మా ప్రదర్శనలకు చిన్నారులను ఎంతగానో అలరిస్తుండడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది' అని అజిల్ అజియా 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు. 'నీటి అడుగున ఆక్సిజన్ లేకుండా ప్రదర్శనలిస్తూ ఎక్కువ సేపు గడపడమంటే మాటలు కాదు. నేర్చుకున్న వృత్తి జనానికి ఆనందాన్ని కలిగించడంతో పాటు మాకు ఆదాయ వనరు కావడం సంతృప్తినిస్తోంది' అని రూత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

దేశంలో రెండో జలకన్యల ప్రదర్శన..

విశాఖలో ఏర్పాటు చేసిన జలకన్యల ఎగ్జిబిషన్ రెండోది.. విశాఖలో మొట్టమొదటిది. తొలి ఎగ్జిబిషన్ గత సమ్మర్లో హైదరాబాద్లో జరిగింది. విశాఖలో ఈ ఎగ్జిబిషన్ను 90 రోజుల పాటు కొనసాగిస్తాం. ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ జలకన్యల ప్రదర్శన ఉంటుంది. ఈ జలకన్యలను ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియాల నుంచి తీసుకొచ్చాం. వారి వెంట ఒక ఫిజిషియన్ కూడా ఉంటారు. వీరికి ప్రత్యేక వసతితో పాటు ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నాం. జలకన్యల ఎగ్జిబిషన్కు అనూహ్య స్పందన లభిస్తోంది' అని వైజాగ్ ఎక్స్పో 2025 నిర్వాహకుడు మంగలపూడి రాజరెడ్డి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. అరుదైన జలకన్యలను చూడాలనుకునే వారు విశాఖ ఆర్కే బీచ్ లోని పోలీస్ మెస్ వెనక ఉన్న గ్రౌండ్కు వెళ్లొచ్చు. టిక్కెట్టు ధర రూ.150గా నిర్ణయించారు. ఈ టిక్కెట్టుతో ఎక్స్పోలోకి అనుమతించి జలకన్యల ప్రదర్శనతో పాటు కాశ్మీరీ మంచు అందాల ప్రత్యేక సెట్టింగ్ను సందర్శించవచ్చు. 

Tags:    

Similar News