మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల

అర్హత సాధించని వాళ్లు నిరుత్సాహ పడొద్దని ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.;

Update: 2025-09-15 06:08 GMT

మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను మంత్రి నారా లోకేష్‌ సోమవారం విడుదల చేశారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన విధంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి అయినట్టు అయింది. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్‌ ఈ మెగా డీఎస్సీలో అర్హత సాధించిన ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఒక వాగ్దానం నెరవేరింది.. మెగా డీఎస్సీని పూర్తి చేశామన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైలు మీదే తొలి సంతకం చేశారని, ఆ మేరకు తాము మెగా డీఎస్సీ హామీని అమలు చేశామని పేర్కొన్నారు. 150 రోజుల కంటే ముందుగానే విజయవంతంగా స్కూల్‌ ఎడ్యుకేష్‌ డిపార్ట్‌మెంట్‌ మెగా డీఎస్సీ–2025ని నిర్వహించిందన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారంతా వారి బాధ్యతలను గుర్తించి చిన్నారులకు మంచిగా పాఠాలు బోధించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. దేశంలోనే ఏపీ విద్యా వ్యవస్థను ఒక మోడల్‌ విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నారు. ఎవరైతే ఈ మెగా డీఎస్సీలో అర్హత సాధించలేకపోయారో వారందరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. అదే ధృఢ సంకల్పంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ కొనసాగించి వచ్చే డిఎస్సీలో అర్హత సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Tags:    

Similar News