శాంతిచర్చలు జరపాలని కేంద్రాన్ని కోరిన మవోయిస్టులు

హత్యాకాండలను, నరసంహారాన్ని నిలిపేయాలని మావోయిస్టు కేంద్రకమిటి(Maoist central committee) అధికారప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది;

Update: 2025-04-02 13:05 GMT
Maoists urge peace talks

శాంతిచర్చలు జరపాలని కేంద్రాన్ని మావోయిస్టులు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కగార్ పేరుతో చేస్తున్న హత్యాకాండలను, నరసంహారాన్ని నిలిపేయాలని మావోయిస్టు కేంద్రకమిటి(Maoist central committee) అధికారప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. తాడిత, పీడిత ప్రజలకోసం తాము పోరాటాలు చేస్తుంటే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తమ బలగాలతో మావోయిస్టులపై విరుచుకుపడుతు హత్యలు చేస్తున్నట్లు ఆరోపించారు. అందుకనే ప్రజా ప్రయోజనాలను ఆలోచించి ప్రభుత్వాలతో శాంతిచర్చలు జరపాలని నిర్ణయించినట్లు లేఖలో అభయ్ చెప్పారు. విప్లవోధ్యమ ప్రాంతాల్లో ఆదివాసి యువతీ-యువకులను సాయుధ బలగాల్లో భర్తీ చేసుకుని వారిచేతనే ఆదివాసీలను హత్యలు చేయిస్తున్నట్లు మండిపడ్డారు.

శాంతిచర్చలకోసం(Peace talks) సానుకూల వాతావరణాన్ని ఏర్పాటుచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదిస్తున్నట్లు అభయ్ చెప్పారు. కగార్(Operation Kagar) పేరుతో ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో సాయుధబలగాలతో ప్రభుత్వాలు మారణహోమాన్ని జరిపిస్తున్నట్లుగా అభయ్ మండిపడ్డారు. శాంతిచర్చలు జరిపేందుకు తమకు కొన్ని షరతులున్నాయని వాటికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అంగీకరిస్తే తాము వెంటనే కాల్పుల విరమణ ప్రకటిస్తామని కూడా అభయ్ చెప్పారు. తాముచేస్తున్న ప్రతిపాదనల ఆధారంగా శాంతిచర్చల కోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని శాంతిచర్చల కమిటీలు, దేశంలోని ప్రజాపక్ష మేథావులకు, రచయితలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టులకు, హక్కుల సంఘాలు, ఆదివాసీ, దళి సంఘాలు, విద్యార్ధిసంఘలకు అభయ్ విజ్ఞప్తిచేశారు.

శాంతిచర్చలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అంగీకరించేలా దేశంలోని అన్నీ నగరాలు, పట్టణాల్లో పెద్దఎత్తున ప్రచారం చేయాలని అందరినీ అభయ్ కోరారు. మావోయిస్టులను చుట్టి చంపేస్తున్నట్లు, నిరాయుధులను, గాయపడిన వారిని కూడా బలగాలు అమానవీయంగా చంపేస్తున్నట్లు అధికారప్రతినిధి ఆందోళన వ్యక్తంచేశారు. మహిళా కామ్రేడ్స్ పై సామూహిక హత్యాచారాలు జరుగుతున్నట్లు ఆరోపించారు. మావోయిస్టులపై కమాండో బలగాల ముసుగులో కేంద్రప్రభుత్వం సైన్యాన్ని మోహరించటాన్ని అధికారప్రతినిధి తప్పుపట్టారు. కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించకుండానే సైన్యాన్ని ఒక ప్రాంతంలో ఉపయోగించుకోవటం రాజ్యాంగ మౌలిక భావనలకు వ్యతిరేకమన్నారు. ఇలాంటి అనేక ఉదాహరణలను చెప్పిన అభయ్ గతంలో ఛత్తీస్ గడ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ ప్రతిపాదించిన శాంతిచర్చలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తమ షరతులకు ప్రభుత్వాలు అంగీకరించాలని అభయ్ కోరారు.

Tags:    

Similar News