ఈ తరం జర్నలిస్టులకు దిక్సూచి ‘మానికొండ’

జర్నలిజంలో ఆయన నీతి, నిబద్ధత ఆదర్శనీయం. ఎంసీ పుస్తక పరిచయ సభలో వక్తలు. రైటర్స్‌ అకాడమీ మానికొండ పేరిట ఏటా అవార్డు;

Update: 2025-05-04 15:29 GMT
పుస్తక పరిచయ సభలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ బాబీవర్థన్‌
ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆంగ్ల జర్నలిజంలో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతినార్జించిన వారిలో మానికొండ చలపతిరావు అగ్రగణ్యులని వక్తలు కొనియాడారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రముఖ ఆంగ్ల పత్రికకు సంపాదకునిగా కొనసాగి నిరాడంబరత, నీతి, నిజాయతీ, నిబద్ధతతో వ్యవహరించారని శ్లాఘించారు. ఈ తరం జర్నలిస్టులకు ఆదర్శ ప్రాయులని కొనియాడారు. రైటర్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో, ఉదయం పత్రిక అధినేత, దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టు ఆకుల అమరయ్య రచించిన ‘భారతీయ జర్నలిజం ధృవతార.. మానికొండ చలపతిరావు’ పుస్తక పరిచయ సభ విశాఖపట్నం పౌర గ్రంధాలయంలో ఆదివారం జరిగింది. ఈ సభలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మానికొండ విశిష్టత, ఔన్నత్యం గురించి వక్తలు మాట్లాడారు. ఎవరేమన్నారంటే..?
మహామహులే ప్రశ్నించలేకపోయారు..
జవహర్‌లాల్‌ నెహ్రూ సారథ్యంలో నడిచే నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంపాదకునిగా ఉన్న మానికొండ చలపతిరావు (ఎంసీ)ను నెహ్రూ వంటి మహానేతలే ప్రశ్నించే సాహసం చేయలేకపోయారని ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్‌ పి బాబీవర్థన్‌ అన్నారు. ఇందుకు మానికొండ నిజాయతీ, నిబద్ధతలే కారణమన్నారు. మానికొండ చలపతిరావు పుస్తక పరిచయ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రనాట పుట్టి ఆంగ్ల జర్నలిజంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అగ్రగణ్యుల్లో మేటి ఎంసీగా కొనియాడారు. వర్కింగ్‌ జర్నలిస్టుల కోసం ఓ యూనియన్‌తో పాటు వేజ్‌బోర్డు ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ‘దాసరి నారాయణరావు కూడా జర్నలిస్టులను స్వేచ్ఛనిచ్చారు. ఉదయం స్థాపనతో ఆయన జర్నలిజంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉదయంలో అక్షరం నిటారుగా నిలబడింది. అక్షరానికి ధైర్యం వచ్చింది. అక్షరానికి ఆర్ద్రత తెలిసి పేదల పక్షాన నిలిచింది. అక్షరానికి అభిషేకం చేసిన వ్యక్తి దాసరి నారాయణరావు. జర్నలిజంలో ఆణిముత్యాలను తయారు చేశారు’ అని వివరించారు.

                                                పుస్తక రచయిత ఆకుల అమరయ్య

 నేటి కార్పొరేట్‌ జర్నలిజాన్ని ఎంసీ ఆనాడే ఊహించారుః అమరయ్య

నేటి కార్పొరేట్‌ జర్నలిజాన్ని మానికొండ చలపతిరావు ఆనాడే ఊహించారని, ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టారని పుస్తక రచయిత ఆకుల అమరయ్య అన్నారు. ‘ఎంసీ కార్పొరేట్‌ సంస్థలకు మీడియాను అప్పజెప్పవద్దన్నారు. నాడు కమర్షియల్‌ జర్నలిజం లేదు. ఈ రోజు అదే బలీయంగా ఉంది. ఉత్తరాంధ్రలోని అంబకండి మానికొండ స్వస్థలం. ఆ ఊర్లో ఎక్కడా ఆయన ఆనవాళ్లు లేవు. పుస్తక రచన కోసం ఆయన గురించి ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందా? అని శోధించినా అంతగా ఫలితం లేదు. మానికొండ గురించి రాయాలంటే చాలా ధైర్యం ఉండాలి. తన జీవితానికి సంబంధించి ఏ ఒక్కటీ ఆయన మిగల్చలేదు. తన పుట్టిన రోజు సర్టిఫికెట్లను సైతం ఆయన చించేశారు. అవివాహితునిగా ఉంటూ జీవితాన్ని త్యాగం చేశారు. ఈశ్వర్‌దత్‌ ఎంసీ విద్వత్తును చూసి అలహాబాద్‌లో ద వీక్‌ అనే పత్రికను పెట్టించారు. ఆరోజుల్లో 32 ఏళ్ల వయసుకి ఈ ప్రపంచంలో సాహిత్యాన్ని చదివిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మానికొండ, రెండో వ్యక్తి బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ కావడం విశేషం. అలాంటి మహనీయుడు ఉత్తరాంధ్ర వాసి కావడం గర్వకారణం. 33 ఏళ్లపాటు నేషనల్‌ హెరాల్డ్‌కు సంపాదకునిగా వ్యవహరించారు. ఎంసీ రిటైర్‌ అయ్యాక ఇందిరాగాంధీ సన్మాన సభ పెడితే వెనక ఓ మూలన కూర్చుంటే ఆచార్య ఎన్జీరంగా పిలిస్తే నేను దానికి తగిన వాడిని కాదన్నారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ అవార్డును తిరస్కరించిన అరుదైన జర్నలిస్టు. నాకొద్దు.. ఈ పద్మ అవార్డుల కోసం ఐఏఎస్‌ల చుట్టూ తిరుగుతున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు.. వారికివ్వండి అని చెప్పారు. యాజమాన్యంతో ఎప్పడూ రాజీపడకుండా ఏ క్షణాన్నైనా రాజీనామా చేయడానికి సిద్ధం ఉంటూ నిత్యం రాజీనామా లేఖను తన జేబులో పెట్టుకుని తిరిగేవారు. జర్నలిస్టుల బతకు కోసం పోరాటం చేశారు. సంఘటితం చేశారు. ఈ తరం జర్నలిస్టులకు ఆ మహానీయుని గురించి ఎంతమందికి తెలుసు? జర్నలిజంలో విలువలు తరిగిపోతున్న తరుణంలో ఎంసీ గురించి నేటి జర్నలిస్టులకు తెలిసేలా పుస్తకం తీసుకురావాలన్న సంకల్పంతో మిరియాల వెంకట్రావు ఫౌండేషన్‌ ప్రతినిధి కఠారి అప్పారావు సూచనతో ఎంసీపై పుస్తకం రాయాల్సి వచ్చింది’ అని అమరయ్య వివరించారు. ఎంసీ సేవల గుర్తింపు కోసం ఆయన పేరిట అవార్డు ఇవ్వాలని, విశాఖలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

                                                    లీడర్‌ పత్రిక సంపాదకుడు వీవీ రమణమూర్తి

ఏటా ఎంసీ అవార్డు వీవీ రమణమూర్తి..
రైటర్స్‌ అకాడమీ చైర్మన్, లీడర్‌ పత్రిక సంపాదకుడు వీవీ రమణమూర్తి మాట్లాడుతూ మానికొండ భారతీయ జర్నలిజం ధృవతార అని కొనియాడారు. ‘సమాజం బాగు కోసం నిస్వార్థంతో పనిచేశారు. సామాన్యుడిలా టీ తాగడానికి టీస్టాల్‌కొచ్చి తాగుతూ చనిపోయారు. గుర్తు తెలియని వ్యక్తిగా ఆయన శవాన్ని శవాగారంలో ఉంచారు. మానికొండ ఆచూకీపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆరా తీయడంతో ఆయన శవాన్ని గుర్తించారు. పత్రికా స్వేచ్ఛ కోరుకున్న వారిలో మానికొండ, దాసరి నారాయణరావులది ప్రత్యేక స్థానం అన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ దిగ్గజ సంపాదకుడు మానికొండ చలపతిరావు పేరిట ఏటా అవార్డును ప్రదానం చేస్తామని రమణమూర్తి ప్రకటించారు. ఎంసీ విగ్రహాన్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి జీవీఎంసీతో చర్చిస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో దాసరి నారాయణరావు పేరిట ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డును కూడా ప్రదానం చేస్తామని తెలిపారు.

                                            టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా లీగల్‌ ఎడిటర్‌  సాగర్‌కుమార్‌

 ఎంసీ .. రాజ్యాంగ అమలు తీరును సమీక్షించారు..

ప్రజలు ప్రతిఘటించే తీరు, ధర్మాగ్రహ తిరుగుబాటు కూడా వ్యవస్థీకృతంగానే ఉండాలని నిరూపించిన వ్యక్తి మానికొండ చలపతిరావు అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా లీగల్‌ ఎడిటర్‌ సాగర్‌కుమార్‌ ముత్తా అన్నారు. ‘రాజ్యాంగం ఎలా అమలవుతుందో 30 ఏళ్లపాటు సమీక్షించారు. దాని అమలు తీరుతెతన్నులపై చాలా విమర్శనాత్మకంగా నేషనల్‌ హెరాల్డ్‌లో రాశారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు. ఉత్తరాంధ్ర నుంచి జర్నలిస్టుగా అంతటి విశిష్ట వ్యక్తిగా మానికొండ ఎదగడం ఈ ప్రాంతానికే కాదు.. తెలుగు రాష్ట్రాలకూ గర్వకారణం. ప్రజలు నిధులు సమీకరించుకుని పత్రికలను, మీడియాను పెట్టి నడపాలని ఎంసీ ఆకాంక్షించారు. దాసరి నారాయణరావు తన సినిమాల ద్వారా మానసిక విప్లవాలను తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు.

                                        మిరియాల వెంకట్రావు ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కటారి అప్పారావు

 కటారి అప్పారావు..

మిరియాల వెంకట్రావు ఫౌండేషన్‌ తరఫున వందమంది ప్రముఖల పుస్తకాలు ముద్రించాలనుకున్నామని ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కటారి అప్పారావు అన్నారు. వీటిలో తెలుగు జాతి గర్వించదగ్గ సంపాదకుడు మానికొండ చలపతిరావు గురించి ఆకుల అమరయ్యతో రాయించి ముద్రించామన్నారు. మానికొండపై పుస్తకం ముద్రించాక తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల నుంచి తమ జిల్లాల్లో సమీక్ష సమావేశాలు పెట్టాలని కోరారని తెలిపారు. దాసరి నారాయణరావు గొప్ప దర్శకుడే కాదు.. సామాజిక శాస్త్రవేత్త కూడా అన్నారు. విశాఖలో కొంతమంది రూపాయికే ఎకరం భూమిని కేటాయించడాన్ని, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడంపై ప్రజలు ఉద్యమించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్సీఎల్‌పీ మాజీ పీడీ పిల్లల రామకృష్ణారావు మానికొండ చలపతిరావు గురించి ఈ ప్రాంతంలో ఎవరికీ తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. కుటుంబీకుల గురించి ఆరా తీస్తే తెలియదన్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ ఇస్తే.. తనను బంగారు సంకెళ్తో బంధిస్తారా? అంటూ తిరస్కరించిన నిరాడంబరుడు. అక్షరాన్ని మలినం చేయని గొప్ప వ్యక్తి. నెహ్రూపై విమర్శనాత్మక కథనాలు రాసినా ఏనాడూ ఎంసీని సంజాయిషీ అడగలేదంటే ఆయన వ్యక్తిత్వం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కార్యక్రమానికి మేడా మస్తాన్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.
Tags:    

Similar News