ఎరువులు దారి మళ్లకుండా చూడండి
యూరియా,డిఏపి ఎరువుల నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళనలు చెందొద్దని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.;
యూరియా, డీఏపీ ఎరువులను దారిమళ్ళించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, దీని కోసం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల అవసరాలకు సరిపడా యూరియా, డిఏపి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కావున రైతులెవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వ్యవసాయశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లతో ఎరువుల అంశంపై వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆగష్టు మాసానికి లక్షా 65 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో 2లక్షల 4వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అన్నారు. అదే విధంగా డిఏపి 70 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా, ప్రస్తుతం 88 వేల 248 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, అందువల్ల రైతులు ఎవరూ కూడా ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిఎస్ పేర్కొన్నారు.