విజయవాడకు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
విజయవాడ రూరల్ పరిధిలోని ఎనికేపాడు గోదాంలో మంటలు చెలరేగాయి, రూ.5 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల నిల్వ గోదాంలో మంటలు చెలరేగడంతో విలవైన సామానులు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ మంటల పొగ చుట్టూ పక్కల ప్రాంతాలు కమ్ముతున్నాయి. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిగా చేరుకుని మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎనికేపాడులోని ఈ గోదాంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులు పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం ఏర్పడినట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో గోదాం పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే నిర్వాహకులు అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారు.