లులూ మాలూ..ఎన్నెన్నో అనుమానాలు!

గత టీడీపీ హయాంలో ఈ మాల్‌కు వైజాగ్‌లో 13.83 ఎకరాలు కేటాయించింది. వైసీపీ పాలనలో వాటిని రద్దు చేస్తే, కూటమి సర్కారు మళ్లీ అనుమతులిచ్చింది.;

Update: 2025-04-04 06:55 GMT
విశాఖ బీచ్ సమీపంలో లులూ మాల్ కు కేటాయించిన ప్రభుత్వ స్థలం

విశాఖ మహా నగరంలో సెంటు భూమి కూడా ఎంతో విలువైనది. ఈ సిటీలో వాణిజ్య సముదాయమే కాదు.. చిన్నపాటి ఇల్లో లేదా షాపో కట్టుకోవాలంటే గజం స్థలం దొరకడం గగనమవుతోంది. గజం జాగా కోసం రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. అలాంటిది ఎకరం కాదు.. రెండెకరాలు కాదు.. ఏకంగా 13 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఓ ప్రైవేటు సంస్థకు కారు చౌకగా కట్టబెట్టేస్తుండడాన్ని ఏమనుకోవాలి? రూ. వేల కోట్ల విలువైన ఆ సర్కారీ స్థలాన్ని అత్త సొమ్ము అల్లుడు ధారపోసిన చందంగా లులూ సంస్థకు ధారాదత్తం చేసేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పడు విశాఖ వాసులతో పాటు మేధావి వర్గాలను కూడా కలవర పెడుతున్న లులూ మాలుకు భూ కేటాయింపులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి!

Delete Edit

ఏమిటీ లులూ మాల్‌?

లులూ మాల్స్‌కు వివిధ దేశాల్లో పేరుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని అబుదాబి ప్రధాన కేంద్రంగా లులూ సంస్థ ఇతర దేశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మాల్స్‌ నిర్వహిస్తోంది. అలాంటి మాల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోనూ ఏర్పాటు చేయడానికి లులూ యాజమాన్యం ముందుకొచ్చింది. 2018 ఫిబ్రవరిలో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో అప్పటి టీడీపీ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఎంఓయూలో భాగంగా విశాఖ సాగరతీరానికి చేరువలో హార్బర్‌ పార్కు ఎదురుగా ఉన్న 11.23 ఎకరాల ఏపీఐఐసీ స్థలాన్ని, సీఎంఆర్‌ సంస్థకు చెందిన విశ్వప్రియ ఫంక్షన్‌ హాలులోని 2.60 ఎకరాలు వెరసి 13.83 ఎకరాలను కేటాయించింది. నామమాత్రపు లీజుతో పీపీపీ విధానంలో లులూ సంస్థకు విలువైన ప్రభుత్వ స్థలాన్ని కట్టబెట్టడంపై అప్పట్లో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టాయి. అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఒప్పందం జరిగిన మరుసటి ఏడాది టీడీపీ గద్దె దిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటికే ఈ ప్రాజెక్టుపై వచ్చిన విమర్శలు, అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ ప్రభుత్వం 2019 నవంబరులో రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో భాగంగా టీడీపీ హయాంలో జరిగిన ఎంఓయూను రద్దు చేసింది. దీంతో లులూ సంస్థ వెనక్కి పోవలసి వచ్చింది. ఆపై ప్రభుత్వం ఈ స్థలాన్ని వీఎంఆర్డీఏకు అప్పగించింది. అప్పట్లో ఈ భూముల విలువ రూ.1,450 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఆరేళ్ల క్రితం అంతటి ధర ఉంటే ఇప్పుడెంత పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
కూటమి ప్రభుత్వం రాకతో..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చాక లులూ గ్రూపు సీఎండీ యూసఫ్‌ ఆలీలో కొత్త ఆశలు మళ్లీ చిగురించాయి. దీంతో ఆయన గత సెప్టెంబరులో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. వీరిద్దరి కలయికతో విశాఖలో లులూ మాల్‌ మళ్లీ జీవం పోసుకుంటుందని అంతా అనుకున్నారు. అందుకనుగుణంగానే టీడీపీ హయాంలో మాల్‌ కోసం కేటాయించిన స్థలాన్ని తిరిగి తమకు అప్పగిస్తే ఎంఓయూ ప్రకారం మాల్‌ నిర్మాణాన్ని చేపడతామని జనవరిలో సీఎం చంద్రబాబుకు లులూ చైర్మన్‌ యూసఫ్‌ ఆలీ లేఖ రాశారు. ఆయన లేఖ రాసిందే తడవుగా ప్రభుత్వం స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. లులూ మాల్‌కు ఈ భూమిని కేటాయిస్తూ వైసీపీ హయాంలో రద్దు చేసిన 13.43 ఎకరాల భూమిని వీఎంఆర్టీఏ నుంచి ఏపీఐఐసీకీ బదలాయించేలా మార్చి 26న జీవో జారీ చేసింది.
Delete Edit
కారు చౌకగా కట్టబెడతారా?
లులూ మాల్‌కు కేటాయించిన 13.43 ఎకరాల స్థలం విశాఖ నగరంలోనే అత్యంత ఖరీదైనది. మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరం భూమి అక్కడ రూ.100 –150 కోట్ల ధర పలుకుతోందని అంచనా. అంటే కనీసం ఈ భూముల విలువ రూ.1,500 కోట్ల పైమాటే. అంతేకాదు.. లులూ సంస్థ యజమాని.. ఎకరానికి రూ.50 లక్షలు అద్దె చెల్లించేందుకు, పదేళ్లకు ఒకసారి మాత్రమే అద్దె పెంచేందుకు అనుమతించాలని, మూడేళ్ల వరకు గాని, మాల్‌ ప్రారంభించే వరకు తమకు అద్దె మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తమకు కేటాయించిన భూమిని 99 ఏళ్లకు లీజుకివ్వాలని ఆయన అభ్యర్థించారు. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టుకు గరిష్టంగా 33 ఏళ్ల పాటు లీజుకిస్తుంది. కానీ లులూ మాల్‌కు ఈ స్థలాన్ని ఏకంగా మూడు రెట్లు అధికంగా అంటే 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇంకా మరో రూ.170 కోట్ల వరకు స్టాంపు డ్యూటీ, జీఎస్టీ మినహాయింపు వంటి వివిధ రాయితీలు ఇచ్చేందుకు తలూపింది. ఇలా లులూ సంస్థ అడిగిందే తడువుగా అన్నిటీకీ కూటమి సర్కారు సై అనడం ఇప్పడు ప్రతిపక్షాలతో పాటు మేధావి వర్గాల నుంచి అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోట్ల విలువ చేసే భూములను అంత కారు చౌకగా, దాదాపు వందేళ్లకు ఎలా ధారాదత్తం చేస్తారని వీరు నిలదీస్తున్నారు.
బాబుతో సాన్నిహిత్యం ఈనాటిది కాదా?
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సందర్భంలో ఆయనతో తనకు 18 ఏళ్ల సోదర అనుబంధం ఉందని లులూ గ్రూప్‌ చైర్మన్‌ యూసఫ్‌ ఆలీ చెప్పుకున్నారు. అప్పటివరకు యూసఫ్‌ ఆలీతో చంద్రబాబుకు అన్నేళ్ల అనుబంధం ఉందని బాహ్యప్రపంచానికి తెలియదు. యూసఫ్‌ ఆలీ ప్రకటనతో చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలుండడం వల్లే లులూకు కార చౌకగా రూ.వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా దాదాపు నూరేళ్ల లీజు పేరిట ఇచ్చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
లులూ మాల్‌లో ఏముంటాయి?
లులూ మాల్‌కు కేటాయించిన స్థలంలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఈ స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారీ షాపింగ్‌ మాల్, ఎనిమిది స్క్రీన్ల మల్టిప్లెక్స్, ఐదు వేల సిట్టింగ్‌ కెపాసిటీ ఉండే ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వంటివి నిర్మిస్తారు. ఈ మాల్‌ ద్వారా సుమారు 15 వేల మంది ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా.
రూ.2వేల కోట్ల భూమిని 99 ఏళ్లకు లీజుకెలా ఇస్తారు?
విశాఖ నగరం నడిబొడ్డులో బీచ్‌కు ఆనుకుని ఉన్న రూ.2 వేల కోట్ల విలువైన 13 ఎకరాల ప్రభుత్వ భూమిని లులూ సంస్థకు కారు చౌకగా ఎలా కేటాయిస్తారు? ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చే సందర్భంలో పాటించాల్సిన నిబంధనలను పాతరేస్తూ 99 ఏళ్లు లీజుకిస్తారా? అది చాలదన్నట్టు రూ.170 కోట్ల రాయితీలు కూడా ఇస్తారా? ఈ సొమ్ముతో ప్రభుత్వమే నిర్మాణాలు చేపట్టవచ్చు. కానీ ప్రభుత్వ పెద్దలు అలా చేయకుండా లులూ సంస్థ యజమానితో ఉన్న సంబంధాలతో నామమాత్రపు రేట్లకే లీజుకివ్వడం సమంజసం కాదు. ప్రైవేటు వాణిజ్య సముదాయాల కోసం రూ.వేల కోట్ల విలువైన భూములను కేటాయించడం తగదు. ప్రభుత్వ భూమి ద్వారా ఆదాయాన్ని పొందాలనుకుంటే పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టి వివిధ సంస్థలను ఆహ్వానించాలి. లేదంటే లూలూతో లోపాయకారీ ఒప్పందాలు జరిగాయని అనుమానించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఈ అనాలోచిత నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అని మండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. లులూ మాల్‌ పదేళ్లకోసారి 10 శాతం చొప్పున అద్దె పెంపు వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లుతుంది. లులూకు ప్రభుత్వ భూముల కేటాయింపులో తెరవెనక ఏం జరుగుతుందన్న దానిపై అనుమానాలున్నాయి అని మాజీ మంత్రి, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు.
Delete Edit
99 ఏళ్ల లీజు దేశంలో ఎక్కడా లేదు..
ఏ ప్రైవేటు సంస్థకూ 99 ఏళ్ల పాటు భూములు లీజుకివ్వడం దేశంలో ఎక్కడా లేదు. లులూకు విశాఖలో భూ కేటాయింపులను రద్దు చేయాల్సిందే. కూటమి ప్రభుత్వంతో లులూకు లాలూచీ ఏమిటో అర్థం కావడం లేదు. అత్యంత విలువైన ఆ ప్రభుత్వ స్థలంలో సైన్స్‌ పార్కు గాని, సైన్స్‌ మ్యూజియం గాని నిర్మించాలి. లేదంటే ఇస్రోతో కలిసి స్పేస్‌ పార్కుగానైనా అభివృద్ధి చేయాలి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి గంగారావు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో అన్నారు.
Delete Edit

లులూకు భూకేటాయింపులు చట్ట విరుద్ధం..

విశాఖపట్నం బీచ్‌ రోడ్‌లోని హార్బర్‌ పార్క్‌ భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం లులూ గ్రూప్‌నకు తిరిగి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధం. సీఆర్‌జెడ్‌ నోటిఫికేషన్, సుప్రీంకోర్టు తీర్పు, ఏపీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. ఈ భూమి సీఆర్‌జెడ్‌ నిషేధిత ప్రాంతంలోకి వస్తుంది, భీమిలి తీర ప్రాంతంలో సీఆర్‌జెడ్‌ పరిధిలో ఓ రాజకీయ నేత చేపట్టిన కట్టడాలను, పునాదులను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. సీఆర్‌జెడ్‌ ఉల్లంఘనలకు సహకరించిన అధికారుల తీరును తప్పుబట్టింది. గత ప్రభుత్వం సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండలో పర్యాటకశాఖ సముదాయాన్ని కూల్చి కొత్త భవనాల నిర్మాణంపైనా మందలించింది. కేరళలోని మరడు పంచాయతీలో సీఆర్‌జెడ్‌ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన నాలగు భారీ బహుళ అంతస్తులను కూల్చివేతకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అందువల్ల లులూ మాల్‌ విషయంలో సంబంధిత అధికారులెవ్వరూ సీఆర్‌జెడ్‌ నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడవద్దని కోరుతున్నాను. ఇలాంటి బహిరంగ స్థలాలను ప్రైవేట్‌ సంస్థలకు మేలు చేసేందుకు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాలిచీ అని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, భారత ప్రభుత్వ ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ'ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌' ప్రతినిధితో చెప్పారు.

Tags:    

Similar News