ఆంధ్రాకి కూడా భారీ వర్షాల వార్నింగ్! విజయవాడకి ప్రత్యేక హెచ్చరిక
ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరద నీరు;
పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. బుధవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది వాయువ్య దిశగా కదులుతోంది. వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. అంతేకాకుండా రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా ఈ అల్పపీడనం కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధవారం, గురువారం కోస్తాంధ్రలో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. బుధవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గంటకు 40 –50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
విజయవాడ కి హెచ్చరిక
* ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరద నీరు వస్తున్నందున జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు.
* ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశా తో మాట్లాడిన ఎంపీ కేశినేని శివనాథ్
* వరదనీరు 3 లక్షల నుంచి క్రమంగా 5 లక్షల వరకు పోటేత్తే అవకాశం
*కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలను, లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకి తరలించి తాగునీరు, ఆహారం, మందులు వంటి తగిన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు
*జిల్లాలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అలెర్ట్ గా వుండి అవసరమైన సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని ఆదేశాలు
*వాగులు పొంగే ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు పెట్టాలని సూచన