మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్‌లోని పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.;
వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి సగటున 1.5 నుంచి 5.8 కిమీ ఎత్తులో ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ అధికారులు పేర్కొన్నారు.
అల్పపీడనం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దీని వల్ల బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. దీంతో పాటుగా చెట్లకింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్‌ల వద్ద ఉండరాదని హెచ్చరించారు.