అమరావతి రైతుల ధర్నాను లోకేష్ ఆపాడు: సీపీఐ
తమకు ప్లాట్లు అప్పగించకుండా రెండో దశ భూసేకరణను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ధర్నాకు కూర్చోడానికి సిద్ధమయ్యారు.;
ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి ఉద్యమాన్ని నడిపిన రైతులు ఇవ్వాళ నిన్ను విమర్శించే స్థాయికి వచ్చారు. లోకేష్ ఇన్వాల్వ్ కాకపోతే వాళ్లు ధర్నాకు కూర్చుని ఉండే వాళ్లు. లోకేష్ ఇన్వాల్వ్ అయి వాళ్లను ధర్నాకు పోకుండా చేశాడు. దీనిని బట్టైనా ప్రజల మూడ్ ఏమిటో అర్థం చేసుకోవాలని కోరుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండి పడ్డారు. సీపీఐ రాష్ట్ర సమితీ సమావేశం సందర్బంగా ఆయను కలిసిన మీడియాతో మంగళవారం మధ్యాహ్నం విజయవాడలోని దాసరి భవన్ లో మాట్లాడారు.
అమరావతి రైతులు కోరుకుంటున్నది ఒక్కటే ఇప్పటికే 50 వేల ఎకరాల భూమిని తీసుకున్నారు. ఇప్పటి వరకు రైతులకు ప్లాట్లు అప్పగించ లేదు. ముందు ప్లాట్లు అప్పగించి తర్వాత రెండో దశ భూ సమీకరణకు పోతే మంచిది. 20వేలు తీసుకుంటారా? పది వేలు తీసుకుంటారా? అది మీ ఇష్టం తీసుకున్న భూములను అభివృద్ధి చేయకుండా రెండోదశ భూ సమీకరణ మంచిది కాదని రామకృష్ణ హితవు పలికారు.
బలవంతపు భూ సేకరణ సరైంది కాదు
బలవంతపు భూ సేకరణ సరైంది కాదు. అభివృద్ధి అనేది దశలవారీగా ఉండాలే కాని, నాదగ్గర బట్ట వుంది కదా అని చెప్పి దిగేసుకుని కుట్టించుకుంటామా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఎట్లాంటి వాడంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒకేసారి కోటు కొనుక్కుంటాను అంటాడు. అది కరెక్టు కాదు. ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ బట్టలు కుట్టించాలని మార్కెట్ కు పోయిన నీవు అవన్నీ పట్టించుకోకుండా ఒకే సారి నీకు కోటు కొనుక్కుంటానన్నావు. అందుకే అంటున్నాం, ఫేజ్డ్ మానర్ లో అభివృద్ధి చేయాలి, అలా చేయడం లేదని అక్కడి రైతులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు.
ప్రభుత్వానికి భూ దాహం ఎక్కువైంది..
అవునన్నా... కాదన్నా... ప్రభుత్వానికి కొద్దిగా భూ దాహం ఎక్కువైంది. ఇండోసోల్ కంపెనీకి పచ్చని పల్లెల్లో 8,500 ఎకరాలు ఇస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? నేనడుగుతున్నా చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. ఎవరు అవునన్నా కాదాన్నా ఆయన సీనియర్ పొలిటీషియన్. ఇవ్వాల పచ్చని పంట పొలాలు బలవంతంగా ఇండోసోల్ కు ఇవ్వటానికి భూసేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడున్న ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి బలవంతపు భూ సేకరణ ఎక్కడ చేస్తాన్నా సరే దానిని అనుమతించేది లేదు. ఖచ్చితంగా రైతులకు అండగా నిలబడతాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు నిలదీస్తాం అని రామకృష్ణ చెప్పారు.
21 సార్లు ఢిల్లీలో ఏమి సాధించారో వైట్ పేపర్ ఇవ్వాలి
సూటిగా ముఖ్యమంత్రిని అడుగుతున్నా మీరు 21 సార్లు ఢిల్లీకి పోయారు. కేంద్ర ప్రభుత్వం ఇన్ని సార్లు ఢిల్లీకి వెళితే ఏ విధమైన సాయం చేసిందో స్పష్టమైన నివేదిక ఇవ్వాలి. ఏడాది కాలంలో కేంద్రం రాష్ట్రానికి ఈ సాయం చేసిందని వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అప్పుల విషయంలో రాష్ట్రానికి సాయం చేస్తోంది. ప్రతి మంగళవారం మీరు అప్పులు తెస్తున్నారు. అమరావతి రాజధాని కోసం ఇప్పటి వరకు రూ. 31వేల కోట్లు అప్పులు తెచ్చారు. మరో రూ. 31వేల కోట్లు తేబోతున్నారు. అంటే రూ. 62 వేల కోట్లు అప్పులు చేయబోతున్నారని విమర్శించారు.
పోలవరం ఎత్తు తగ్గించారు, దానిపై మీరు మాట్లాడరు. 54.72 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే తాగు, సాగు నీరు అందుతుంది. 950 మెగా వాట్ల విద్యత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. దానిపై చంద్రబాబు మాట్లాడటం లేదు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ ఇప్పటికీ ఆగిపోలేదు. వేలాది మంది కార్మికులను తొలగిస్తున్నారు. ఎలాగూ మూతపడుతుందని విఆర్ఎస్ తీసుకుని పోతున్నారు.
నరేంద్ర మోదీ చంద్రబాబును పొగుడుతున్నారు. చంద్రబాబు మోదీని పొగుడుతున్నారు. రాష్ట్రానికి ఏమి తెచ్చారో చెప్పమని అడిగితే రాష్ట్ర అభివృద్ది కోసమే పర్యటన చేస్తున్నామంటున్నారు.
అటు ఉత్తరాంధ్ర వారు కానీ, రాయలసీమ వారు కానీ ముక్త కంఠంతో అమరావతి కావాలని కోరుకున్నారు. ఇప్పుడు అభివృద్ధి అంతా ఒకే చోట ఉందని ఆగ్రహిస్తున్నారు.