విశాఖలో పేలిన నాటు తుపాకీ
కాల్పుల ఘటనతో విశాఖ వన్‌టౌన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.;
By : The Federal
Update: 2025-08-18 07:53 GMT
ఆంధ్రప్రదేశ్‌లో నాటు తుపాకీ కాల్పులు ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఇది వరకు తెరమరుగైన నాటు తుపాకీ గత కొద్ది కాలంగా మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం కాకినాడలో ఓ ప్రబుద్ధుడు తనను వివాహేతర సంబంధానికి దూరం పెట్టిందన్న కక్షతో రగిలిపోయి నాటుతుపాకీతో దాడి చేసి తన ప్రియురాలిని, ఆమె ఇద్దరు చిన్నారులను కర్కశంగా పొట్టన పెట్టుకున్నాడు. తాజాగా విశాఖపట్నంలో నాటు తుపాకీ పేలుడు సంఘటన తెరపైకి వచ్చింది. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
విశాఖపట్నం నగరం వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చిలకపేట ప్రధాన గేటు సమీపంలో చేపల రాజేష్ అనే వ్యక్తి పై గుర్తు తెలియని వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో గాయపడిన రాజేష్‌ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరో వైపు పాత కక్షల నేపథ్యంలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు సస్పెన్షన్‌లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఈ కాల్పులకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాల్పులకు పాల్పడిన తర్వాత నిందితుడు అక్కడ నుంచి పరారుకావడంతో అతిడి కోసం గాలింపులు చేపట్టారు.