లిక్కర్ స్కామ్‌లో ఐఎఎస్ ధనుంజయ్, ఓఎస్డీ కృష్ణమోహన్ అరెస్ట్‌

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.;

Update: 2025-05-16 14:45 GMT
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్‌లో తాజాగా ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు అధికారింగా ప్రకటించారు. వరుసగా మూడు రోజుల పాటు వీరిని సిట్ అధికారులు విచారించి... అనంతరం అరెస్ట్ చేశారు. మరోవైపు మందస్తు బెయిల్ కోసం వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో.. వీరిని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో అధికారులు 3 రోజులుగా విచారించారు. వైకాపా హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో.. నాటి సీఎంవో కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్‌ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఏ 33 నిందితుడుగా ఉన్న గోవిందప్ప మంగళవారం అరెస్ట్ అయ్యారు.
అంతకు ముందు ఏం జరిగిందంటే...
ఏపీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీఎంవో మాజీ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ నిరాకరించింది. ఈ ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని పేర్కొంది. వీరికి గతంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ నిరాకరించింది. ఈ తీర్పును ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై జస్టిస్‌ పార్థీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ముందస్తు బెయిల్‌ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. రెగ్యులర్‌ బెయిల్‌కు అప్లై చేస్తే నిబంధనలు, మెరిట్స్‌ ప్రకారం హైకోర్టు, ట్రయల్‌ కోర్టులు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
మద్యం కుంభకోణంలో కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్‌ పూర్తి కాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీ కీలక నిందితులుగా ఉన్నారు. వీరు ముగ్గురూ మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు. ‘మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పలతో పాటు ధనుంజయరెడ్డి పాత్ర ఉంది. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనేదానిపై ఈ ముగ్గురూ తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యేవారు’ అని సిట్‌ ఇప్పటికే తేల్చింది.
Tags:    

Similar News