విశాఖ తీరంలోని బౌద్ధ క్షేత్రాలకు వెళ్లొద్దాం, పదండి

సండే స్పెషల్: బౌద్ధారామాలకు ఆలవాలం విశాఖ. వేల ఏళ్ల క్రితమే ఇక్కడ కొండలపై నిర్మాణాలు వెలిశాయి. ఈ కట్టడాలను పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

By :  Admin
Update: 2024-09-15 02:30 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

విశాఖ ప్రశాంతతను చూసి ఈ తరం వారే కాదు. అలనాటి బౌద్ధ మత గురువులు కూడా ఎంతగానో మురిసిపోయారు. ఈ ప్రాంత సహజ సౌందర్యం, ప్రకృతి రమణీయత, ఒకపక్క నురగలు కక్కుతూ ఉరకలెత్తే సముద్రం, మరోపక్క పచ్చని పర్వత శ్రేణులతో వారు మంత్రముగ్ధులయ్యారు. అందుకే వేల సంవత్సరాల క్రితమే విశాఖ తీరప్రాంతానికి చేరువలో ఉన్న కొండలపైన, విశాఖకు సమీపంలో ఉన్న మరికొన్ని సుందర ప్రదేశాలను తమకు అనువైనవిగా ఎంచుకున్నారు. అప్పట్లోనే బౌద్ధయుగ ఆనవాళ్లును, ప్రార్థనా స్థలాలను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు రెండు వేల సంవత్సరాలకు ముందు నుంచే విశాఖపట్నం .. బౌద్ధ మత సూక్ష్మ ప్రభావాన్ని కలిగి ఉంది. అంతేకాదు.. ప్రపంచ బౌద్ధ ప్రదేశాలలో ఓ ప్రత్యేక స్థానాన్ని పొందింది. విశాఖపట్నం అనే పేరు కూడా బౌద్ధ మతంతో ముడిపడి ఉందని చెబుతారు. క్రీస్తు పూర్వం 5 నుంచి 6వ శతాబ్దంలో నివసించిన బౌద్ధ యువరాణి విశాఖ పేరు మీదుగా ఈ పట్టణానికి పేరు వచ్చిందని బౌద్ధ గాథల్లో ప్రస్తావించినట్టు నమ్ముతారు. మరొక సిద్ధాంతం ప్రకారం బౌద్ధ సన్యాసి వైశాఖి నుంచి ఈ పేరు వచ్చిందని అంటారు. చైనా యాత్రికుడు హుయెన్ త్సాంగ్ తన యాత్రా గ్రంథంలోనూ విశాఖ రాజ్యం పేరును ప్రస్తావించాడు.




 


క్రీ.శ 639 - 40 కాలంలో ఆయన ఆంధ్ర దేశాన్ని సందర్శించాడు. ఆ రాజ్యంలో హీనయాన బౌద్ధం ప్రబలంగా ఉందని కూడా రాశాడు. విశాఖపట్నం పరిసరాల్లో తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ, బొజ్జన్నకొండ, శాలిహుండం వంటివి బౌద్ధ మత ప్రాభవాన్ని నేటి తరానికి చాటి చెబుతున్నాయి. ఇక్కడ కనుగొన్న బౌద్ధ ప్రదేశాల్లో బౌద్ధ మతంలోని హీనయాన, మహాయాన, విజరయాన అనే మూడు దశల అవశేషాలున్నాయి. వీటిలో ఎక్కువ భాగం హీనయాన దశకు చెందిన వే. ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా స్థూపం, అతి చిన్న స్థూపాల నిలయం కూడా ఇక్కడే ఉన్నాయంటే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ను రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన బౌద్ధ కేంద్రాల్లో ఒకటిగానూ గుర్తించింది. వాటిని పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయడం ప్రారంభించింది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన శిల్పాలు, గొప్ప వారసత్వ విలువను కలిగిన ఇతర వస్తువులు ఈ బౌద్ధ ప్రదేశాల్లో చూడొచ్చు. పర్యాటకుల స్వర్గధామంలా భాసిల్లుతున్న విశాఖపట్నం, పరిసరాల్లో ఉన్న బౌద్ధ మత అవశేషాలు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. విశాఖపట్నం నగరం నుంచి ఆయా ప్రదేశాలకు వెళ్లడానికి రోడ్డు మార్గాలున్నాయి. వాహన సదుపాయాలూ ఉన్నాయి. ఈ పురాతన, అరుదైన, విశిష్టతల బౌద్ధయుగ ఆనవాళ్లును సందర్శించాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే...




 


బొజ్జన్నకొండ: ఇది విశాఖకు 41 కి.మీల దూరంలో అనకాపల్లికి సమీపంలోని శంకరం వద్ద శారదా నది ఒడ్డున ఉంది. బొజ్జన్నకొండ, లింగాలకొండ అనే రెండు చిన్న రాతి కొండలపై రెండు బౌద్ధ ప్రదేశాలున్నాయి. ఇక్కడున్న బౌద్ధ అవశేషాలు.. రాతి స్థూపాలు, విహారాలు, బుద్ధ చిత్రాలు, మఠం 3వ శతాబ్దం నాటివిగా గుర్తించారు. 7వ శతాబ్దానికి చెందిన ముద్రలు, లిఖించిన పలకలు కుండలు, రాగి నాణాలు, ఇంకా పలు పురాతన వస్తువులు తవ్వకాల్లో లభ్యమయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా స్థూపం 64 అడుగులు, 50 అంగుళాల అతి చిన్న స్థూపం ఇక్కడున్నాయి. బౌద్ధ మత మూడు దశలు హీనయాన, మహాయాన, వజ్రయానాలను ఈ బొజ్జన్నకొండ చూపుతుంది. ఆయా యానాల రాతి, ఇటుక కట్టడాలు అద్భుతంగా ఉంటాయి. సముద్ర గుప్తుని కాలం నాటి బంగారు నాణాలు, చాళుక్యుల రాగి నాణాలు ఇక్కడ లభించాయి. లింగాల కొండలో మత్స్య ఆకృతిలో నిర్మాణం ప్రపంచంలో మరెక్కడా లేదు. పావురాల కొండః ఈ పావురాల కొండ విశాఖ నుంచి 24 కి.మీల దూరంలో భీమిలి బీచ్ సమీపంలో ఉంది. ఇది 12 ఎకరాల్లో విస్తరించింది. సముద్రమట్టానికి 168 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండ పైనుంచి సముద్రం ఎంతో సుందరంగా, గంభీరంగా అగుపిస్తుంది. ఈ కొండపై 2వ వ శతాబ్దం నాటి రాతి తొట్టెలు, ఘటాలు, వరండాలు, వృత్తాకార చైత్య గృహాలు, వ్రత స్థూపాలు, మందిరాలు వంటివి ఉన్నాయి. ఈ కొండకు సరిహద్దుగా కొండల గొలుసు ఉంది. అర్థ చంద్రాకారపు లోయతో వంపు తిరిగి అందంగా కనిపిస్తుంది.




 


బావికొండ: ఆసియాలోనే అత్యంత పురాతన, బౌద్ధుల పవిత్ర కేంద్రాల్లో ఒకటిగా ఈ బావికొండను పరిగణిస్తారు. స్థూపాలుగా చెక్కబడిన కొండల శ్రేణితో ఈ ప్రదేశం ఇండోనేషియాలోని బోరోబుదూర్ను పోలి ఉంటుంది. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో బావికొండపై బౌద్ధ మతానికి సంబంధించిన కట్టడాలు చేపట్టారు. బౌద్ధ మత స్థాపనలో తాగడానికి వర్షపు నీటిని సేకరించడానికి బావులను ఏర్పాటు చేయడంతో దీనికి బావికొండగా పేరొచ్చింది. ఈ కొండపై ఐదు వెండి, బంగారు పేటికలను కనుగొన్నారు. వీటిలో ఒక పేటికలో బుద్ధుని అవశేషాలున్నాయి. వృత్తాకార చైత్య గృహాలు, స్థూపాలు, సభా మందిరం, వేదికలు వంటివి ఉన్నాయి. 2వ శతాబ్దం నాటి రోమన్ నాణాలు, శాతవాహన నాణాలు, కుండలు, బుద్ధుని పాదాలు, ఛత్ర ముక్కలు, కుండలపై చెక్కిన భ్రామీ అక్షరాలు ఇక్కడ కనుగొన్నారు.

పురాతన వస్తువులతో మైదానం మధ్యలో ఉన్న బౌద్ధ ప్రదేశం తప్పక చూడాల్సిందే. విశాఖకు 16 కి.మీల దూరంలో ఈ బావికొండ ఉంది. తొట్లకొండః విశాఖకు 15 కి.మీల దూరంలో భీమిలికి వెళ్లే దారిలో ఉన్న ఈ తొట్లకొండను నేవీ ఏరియల్ సర్వేలో వెలుగులోకి వచ్చింది. రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రధాన స్థూపం తక్షశిల ప్రభావాన్ని చూపుతోంది. 2వ శతాబ్దం నాటి ద్రోణ అనే బ్రాహ్మీ లేబుల్ శాసనాలున్నాయి. ఇక్కడ తవ్వకాల్లో విదేశీ వాణిజ్యాన్ని సూచించే శాతవాహన సీసం, రోమన్ వెండి నాణాలు లభ్యమయ్యాయి. టెర్రాకోట ఇటుకలు, రాతి తొట్టి, దీప స్తంభం, ముచ్చులింగ నాగ, నలగిరి దమన శిల్పం, బుద్ధ పాదాలు, సభా మందిరం వగైరాలున్నాయి. ఇక్కడి ఆశ్రమంలో వందమందికి పైగా బౌద్ధ సన్యాసులుండే వారని చెబుతారు.


 



శాలిహుండం: శాలిహుండం విశాఖపట్నానికి 137 కిలోమీటర్ల దూరంలోని శ్రీకాకుళం జిల్లా గార గ్రామానికి చేరువలో ఉంది. ఇక్కడ 2 నుంచి 12వ శతాబ్దాల మధ్య కాలం నాటి బౌద్ధ స్మారక స్థూపాలను 1919లో కనుగొన్నారు. వంశధార నది ఒడ్డున కొండపై జరిపిన తవ్వకాల్లో మహా స్థూపాలు, వ్రత స్థూపాలు, చైత్యాలు, వేదికలు, విహారాలు, మండపాలు బయటపడ్డాయి. ఇవి వజ్రయాన, మహాయాన, థెరవాడ దశలకు చెందినవిగా గుర్తించారు. పర్యాటకులను శాలిగుండం విశేషంగా ఆకర్షిస్తోంది.

బౌద్ధయుగ ఆనవాళ్లుకు ఇలా వెళ్లొచ్చు..

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని బౌద్ధయుగ ఆనవాళ్లతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం వెళ్లడానికి వివిధ మార్గాలున్నాయి. విశాఖ నుంచి బావికొండ, తొట్లకొండ, పావురాలకొండ, బొజ్జన్నకొండలకు వెళ్లడానికి ఆటోలు, కార్లు, వ్యాన్లు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. పర్యాటక శాఖ వైజాగ్ సిటీ టూర్ ప్యాకేజీలో తొట్లకొండను చేర్చింది. ఈ ప్యాకేజీలో తొట్లకొండతో పాటు సింహాచలం, రుషికొండ బీచ్, కైలాసగిరి, విశాఖ మ్యూజియం, సబ్మెరైన్ మ్యూజియం, టీయూ 142 ఎయిర్ క్రాఫ్ మ్యూజియం, రుషికొండలోని శ్రీవేంకటేశ్వర దేవాలయాలను చూపిస్తారు. నాన్ ఏసీ బస్సులో టిక్కెట్టు పెద్దలకు రూ.760, పిల్లలకు రూ.610, ఏసీ బస్సులో అయితే పెద్దలకు రూ.910, ప్లిలకు రూ.730 చొప్పున చెల్లించాలి. ఇక మిగిలిన ప్రాంతాలకు ఇతర వాహనాల్లో వెళ్లవచ్చు. వీటన్నిటినీ ఒక్కరోజులోనే చూసి వచ్చేయొచ్చు.

Tags:    

Similar News