బడ్జెట్‌ మీద ప్రముఖుల స్పందనలు

శనివారం కేంద్ర ఆర్థిక శామ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి రూపాయి కేటాయింపులు కూడా లేవు.;

By :  Admin
Update: 2025-02-01 12:21 GMT

శనివారం కేంద్ర ఆర్థిక శామ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి రూపాయి కేటాయింపులు కూడా లేవు. సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నట్లు చెప్పగా తక్కిన నాయకులు పెదవి విరిచారు.

ప్రగతిశీల బడ్జెట్‌..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌–2025–26 మీద ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు రూపాయి నిధులు కేటాయించక పోయినా.. ప్రజలకు ఉపయోగకరమైన, ప్రగతిశీల బడ్జెట్‌గా పేర్కొన్నారు. మహిళా సంక్షేమం, పేదలు, యువత, రైతులకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని, ఇలాంటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అనదగ్గ మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పించారని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్‌ భారత్‌ విజన్‌ను ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్‌ ఉందన్నారు. ఈ బడ్జెట్‌ను తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆ మేరకు శనివారం ఓ ట్వీట్‌ చేశారు.
ఏపీని దారుణంగా విస్మరించారు..
బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దారుణమైన రీతిలో విస్మరించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేష్‌ ధ్వజమెత్తారు. ఎన్నికలు ఉన్నాయనే కారణంతో బీహార్‌కు భారీ బోనాంజా ప్రకటించి, ఆంధ్రప్రదేశ్‌ను విస్మరించారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి బీహార్, ఆంధ్రప్రదేశ్‌లు వెన్ను దన్నుగా ఉన్నాయి. కానీ బీహార్‌కు భారీ స్థాయిలో కేటాయింపులు చేసి ఏపీ పట్ల నిర్థాక్షిణ్యంగా వ్యవహరించారని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ నాలుగు రంగాల్లో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని, వాసత్వ వేతనాల స్తంభన, సామూహిక వినియోగంలో సరళత్వం లోపించడం, ప్రైవేటు రంగంలో మందగించిన పెట్టుబడుల రేటు, సంక్లిష్టమైన సమస్యాత్మకమ జీఎస్టీ విధానాల రుగ్మతలన నయం చేసేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఏమాత్రం సరైంది కాదని ధ్వజమెత్తారు. కేవలం ఆదాయపన్ను చెల్లింపుదారులకే ఈ బడ్జెట్‌లో ఊరట లభించిందన్నారు.
ఏపీకి మొండి చేయి..
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండి చేయి చూపారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్ష నేత మిధున్‌రెడ్డి పెదవి విరిచారు. బీహార్‌కు భారీ స్థాయిలో కేటాయింపులు చేసిన కేంద్రం, ఏపీకి నిరాశే మిగిల్చిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు టీడీపీ. జనతాదళ(యునైటెడ్‌) కీలకంగా ఉన్నాయని, ప్రాజెక్టులను రాబట్టుకోవడంలో బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ సక్సెస్‌ కాగా, ఏపీ సీఎం చంద్రబాబు వైఫల్యం చెందారని విమర్శించారు. బీహార్‌కు బొనాంజాను ప్రకటించిన కేంద్రం ఏపీకి గుండుసున్నా పెట్టిందన్నారు. దీనిపైన సీఎం చంద్రబాబు అంతర్మథనం చేసుకోవాలన్నారు. మెడికల్‌ సీట్లు పెంచుతామని కేంద్రం చెబుతోంటే.. ఉన్న సీట్లు కూడా తమకు వద్దని, వాటిని రద్దు చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, అది ఆంధ్రప్రదేశ్‌ దుస్థతి అని అన్నారు.
ఏపీ ప్రస్తావన లేక పోవడం విచారకరం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు పార్లమెంట్లో చేసిన బడ్జెట్‌ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావనే లేకపోవడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. యధాతధంగా ఈ బడ్జెట్‌ లో కూడా ఏపీకి మొండిచేయి దక్కింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి నిధులు, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, కేంద్రీయ విద్యాసంస్థలకు నిధులు వంటి వాటిపై కనీసం నోరు మెదపలేదని విమర్శించారు. బీహార్‌కు మాత్రం మకాస్‌ బోర్డ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇనిస్టిట్యూట్, ఐఐటి పాట్నా, గ్రీన్‌ ఎయిర్‌ పోర్టులు, నీటి రవాణా కోసం మిధిలాంచెల్లో కాలువ నిర్మాణం వంటి పలు వరాలు ప్రకటించారు.
రైతుల పంటలకు సంబంధించి కనీస మద్దతు ధర గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. వ్యవసాయంలో వెనుకబడిన జిల్లాలకు అమలు చేసే ధన, ధాన్య, కృషి యోజన పథకం కేవలం 100 జిల్లాలకే వర్తింప చేస్తూ చేతులు దులుపుకున్నారు. కార్పొరేట్‌ శక్తులకు మేలు చేకూర్చేందుకు కేంద్రం మరింత వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తుందనేది ఈ బడ్జెట్‌ ద్వారా స్పష్టమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు.
విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలుచేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పటం దుర్మార్గం. ఇప్పటికే విద్యుత్‌ సంస్కరణల పేరుతో విద్యుత్‌ ఛార్జీలను రకరకాలుగా పెంచి పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారు. విద్యుత్‌ రంగ బాధ్యతలను రాష్ట్రాల నుండి తప్పించే కుట్రలో భాగమే విద్యుత్‌ సంస్కరణల అమలుగా గోచరిస్తున్నదని మండిపడ్డారు. మొత్తం మీద ఈ బడ్జెట్‌ సామాన్యులకు శాపంగా, బడా పెట్టుబడిదారులకు వరంగా ఉందని రామకృష్ణ అన్నారు.
Tags:    

Similar News