ఆంధ్ర రాజకీయాల్లో లోకేష్‌ వెర్షన్‌–2 ప్రారంభం

అవమానించారు..ఓర్చుకున్నాడు. కేసులతో భయబ్రాంతులు సృష్టించారు..ధైర్యంతోఎదుర్కొన్నాడు. గెలవలేడని సవాళ్లు చేశారు..తానే కాదు పార్టీని గెలిపించి చూపించాడు.ఇక ఏపీలో లోకేష్‌ వెర్షన్‌–2 మొదలైంది.

Update: 2024-06-28 14:28 GMT

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తెచ్చిన కీలక నేతల్లో నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ తర్వాత నారా లోకేష్‌ ఒకరు. 2019లో అధికారం కోల్పోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుతో సహా కీలక నేతలందరూ జైలు పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఓ పక్క పార్టీని కాపాడుకోవడం, నేతలు, కార్యకర్తలకు భరోసా కల్పించడం, పార్టీని ముందుకు నడిపించే బాధ్యత పూర్తి స్థాయిలో నారా లోకేష్‌పై పడింది. అప్పటికే టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్‌ వ్యవహరిస్తున్నారు. అయినా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, లోకేష్‌ తండ్రి చంద్రబాబే అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నారు. పరిస్థితులన్నీ తారుమారు కావడంతో పార్టీని, నేతలు, కార్యకర్తలను ముందుకు నడిపించే బాధ్యత లోకేష్‌ తన భజస్కందాలపై వేసుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావడం, అనంతరం జనసేనతో కలిసి ముందుకెళ్లడం, ఎన్నికల సమయంలో బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడటం, ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం జరిగిపోయాయి. ఈ జర్నీలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తర్వాత రియల్‌ లీడర్‌గా ఎదిగారని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

డీబీటీని తెరపైకి తెచ్చింది లోకేషే
చంద్రబాబు నాయుడు కుమారుడే అయినప్పటికీ లోకేష్‌ ఎన్నడూ రాజకీయాలవైపు తలెత్తి చూడలేదు. పార్టీలో కానీ చంద్రబాబు సీఎంగా ఉన్న సయంలో ఆయన ప్రభుత్వంలో కానీ ఎప్పుడు లోకేష్‌ జోక్యం చేసుకోవడం కానీ, వేలు పెట్టడం కానీ చేయలేదు. రాష్ట్ర విభజన జరిగి, 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనలు కూడా చేయలేదు. అప్పటి వరకు హెరిటేజ్‌ బాధ్యతలు చూసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే 2009 ఎన్నికల సమయంలో ఆయన రూపొందించిన డైరెక్ట్‌ బెనిఫియరీ ట్రాన్స్‌ఫర్‌(డీబీటీ) కాన్సెప్ట్‌ను టీడీపీ అందించారు.
పార్టీ జనరల్‌ సెక్రెటరీగా ఎంట్రీ
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు మరో మారు ముఖ్యమంత్రి కావడంతో లోకేష్‌ రాజకీయాల్లోకి రావాలని సుముఖత చూపించారు. ఆ మేరకు తన తల్లి నారా భువనేశ్వరి కూడా లోకేష్‌ను ప్రోత్సహించారని, రాజకీయ వారసుడిగా లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకోవాలని చంద్రబాబుతో కూడా చర్చించారని అప్పట్లో ఆ పార్టీ శ్రేణుల్లో వినిపించింది. నేరుగా ప్రభుత్వంలోకి కాకుండా తొలుత పార్టీలోకి తీసుకొని, తర్వాత ప్రభుత్వంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారనే టాక్‌ అప్పట్లో వినిపించింది. అలా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన లోకేష్‌కు తొలుత టీడీపీ జరనల్‌ సెక్రెటరీగా పార్టీ బాధ్యతలు అప్పగించారు. లోకేష్‌ ఎంట్రీని కొంత మంది స్వాగతించినా, మరి కొంత మంది సీనియర్‌ నేతలు వ్యతిరేకించారనే టాక్‌ కూడా అప్పట్లో వచ్చింది. పార్టీలో సభ్యత్వ నమోదు, ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా కార్యకర్తల వెల్ఫేర్, ఆర్థిక స్థోమత లేని వారికి, మరణించిన పార్టీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం చేయడం, వారి పిల్లలకు చదువుకునేందుకు సహాయ పడటం వంటి కార్యక్రమాలతో కేడర్‌కు చేరువయ్యారు.
పని తీరుతో ప్రతిపక్షాలకు జవాబు
తర్వాత 2017లో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అదే ఏడాది లోకేష్‌ను చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖలతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖలు లోకేష్‌కు అప్పగించారు. ఈ సమయంలో లోకేష్‌ను ప్రతి పక్షాల నుంచి అనేక అవమానలు ఎదుర్కొన్నారు. తెలంగాణలో నాటి ముఖ్యమంత్రి కుమారుడైన కేటీఆర్‌తోను, ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పోల్చుతూ విమర్శలు చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ లెగసీని కేటీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ లెగస్సీని జగన్‌ ముందుకు తీసుకెళ్తున్నారని, కేటీఆర్‌కు, జగన్‌కు ఉన్నట్లు లోకేష్‌కు లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌ లేవని, భాష సరిగా రాదని, తెలుగులో మాట్లాడలేడని, డైనమిక్‌ పర్సనాలిటీ లేదని, మాట్లాడటం రాదని, పప్పు అని అనేక రకాలుగా కామెంట్లు చేస్తూ అవమానించారు. మీమ్స్‌ చేయడం, చివరకు బాడీ షేమింగ్‌ కామెంట్లు కూడా చేశారు. అయినా వీటిని లెక్క చేయకుండా విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా మలిచేందుకు కృషి చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25వేల కిలోమీటర్ల మేర సిమింట్‌ రోడ్లు నిర్మించి తన పనితనానితో ప్రతిపక్షాలకు ధీటుగా జవాబు చెప్పారు. అంతేకాకుండా సిఎఫ్‌ఎంఎస్‌ రూపకల్పనలోను, ఆర్‌టీజీఎస్‌ను అందుబాటులోకి తేవడంలోను కృషి చేశారు. టెక్నాలజీ రాష్ట్ర పరిపాలనలో భాగస్వామ్యం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం అందించే అబ్దుల్‌ కలామ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. మంత్రిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.
మంగళగిరి ప్రజల మనసులను గెలిచిన లోకేష్‌
2019లో ఒకప్పుడు కమ్యునిస్టులు, కాంగ్రెస్‌కు, తర్వాత వైఎస్‌ఆర్‌సీపీకి అడ్డాగా మారి, తెలుగుదేశం పార్టీని అంతగా ఆదరించని మంగళగిరి నుంచి పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కూడా ఓటమి పాలైంది. కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఇక అధికా పక్షం నుంచి టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ వేదిక గానే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తనతో పాటు తండ్రి చంద్రబాబును, తల్లి భువనేశ్వరిని అవమానకరంగా మాట్లాడి గేలి చేశారు. అయినా వాటికి కుంగి పోకుండా మంగళగిరిలో పాగా వేయడానికి ప్రయత్నాలు మొలు పెట్టారు. తన మిత్ర బృందంతో కలిసి పార్టీ తరపున ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, పోటీ పరీక్షలకు శిక్షణ, వృద్దులకు ఆర్థిక సహాయం, అత్యవసర ఆరోగ్య సేవలు, వధూవరులకు పెళ్లి కానుకలు, అన్నా క్యాంటీన్‌ల ద్వారా మంచి భోజన అందించడం వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు చేరవయ్యారు. ఇలా మంగళగిరి నియోజక వర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు లోకేష్‌ దగ్గరయ్యారు. దీంతో 2024 ఎన్నికల్లో లోకేష్‌ను ఓడించేందుకు జగన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని తిప్పి కొడుతూ 90వేల పైచిలుకు ఓట్ల మెజారీటీతో భారీ విజయాన్ని నమోదు చేశారు.
యువగళంతో పార్టీలో జోష్‌.. ప్రతిపక్షాలకు దడ
అధికార పక్షం దెబ్బకు కకావికలమవుతున్న టీడీపీ కేడర్‌ను బతికించుకోవడం కోసం యువగళం పేరుతో పాదయాత్రను 27 జనవరి 2023న చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు 4వేల కిలోమీటర్‌ల మేర పాదయాత్ర చేపట్టి అటు టీడీపీ నేతల్లోను, ఇటు కార్యకర్తల్లో జోష్‌ నింపడంతో పాటుగా ప్రతిపక్షాల్లో గుబులు పుట్టించారు. ఈ యాత్ర మధ్యలో ఉండగా తండ్రి చంద్రబాబును అరెస్టు చేశారు. 9సెప్టెంబరు 2023న నంద్యాలలో అరెస్టు చేశారు. ఇక అక్కడ నుంచి లోకేష్‌కు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. చంద్రాబాబును కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసులు ద్వారా అడ్డుకున్నారు. టీడీపీ చిందరవందర అవుతుందని భావించారు. అయినా వాటికి బెదరకుండా తన తండ్రి చంద్రబాబును విడుదల చేయించుకోవడం కోసం ఢిల్లీ ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించడం, సంప్రదింపులు చేయడం, చివరకు చంద్రబాబును బయటకు తీసుకొని రావడంలో విజయవం సాధించారు లోకేష్‌. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. ఈ లోగా ఎన్నికలు సమీపించడంతో తిరిగి యువగళం ప్రారంభించారు. తన భాషకు పదును పెట్టారు. ఎలాంటి బెరుకు, భయం లేకుండా తన ఉపన్యాసాల ద్వారా అందరిని ఆకట్టుకున్నారు. మంగళగిరిలో తాను గెలవడంతో పాటు రాష్ట్రంలో తన పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృష్టి చేశారు. ఇలా ప్రారంభంలో కొంత కాలం పాటు చంద్రబాబు చాటున నాయకుడిగా చెలామణి అయిన నారా లోకేష్‌ గత ఐదేళ్లల్లో జరిగిన అనేక సంఘటనలు లోకేష్‌ను రియల్‌ లీడర్‌గా ఎదిగేందుకు దోహదం చేశాయని ఆ పార్టీ శ్రేణుల చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News