అమరావతి భూముల్లో ఎవరు గెలిచారు? ఎవరు నష్టపోయారు?

రాజధాని కోసం మరొక దఫా భూసేకరణ;

Update: 2025-09-03 04:26 GMT
అమరావతి నమూనా

అమరావతిలో భూ సమీకరణను వ్యతిరేకించిన రైతులు విజయం సాధించారా? అవుననే సమాధానం వస్తుంది. ముఖ్యంగా "మొండి పట్టుదల"తో సమీకరణను వ్యతిరేకించి, చివరికి ప్రభుత్వాన్ని సేకరణ దిశగా అడుగులు వేసేలా చేశారు. ఇది పెద్ద చర్చకు దారి తీసింది.

సమీకరణలో చేరిన 28,000 మంది రైతులు పది సంవత్సరాలుగా వేచి ఉన్నారు. వారికి వాగ్దానం చేసిన ప్లాట్లు, రాయితీలు ఆలస్యమయ్యాయి. ఇందుకు రాజకీయ మార్పులు, కోర్టు కేసులు కారణంగా ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు భూ సమీకరణను వ్యతిరేక రైతులు తక్షణ నగదు పరిహారం పొందుతారు. ఇది మార్కెట్ విలువకు ఎక్కువ (4 రెట్లు). సమీకరణ రైతులకు అన్యాయమా? వారు "దీర్ఘకాలిక ప్రయోజనాలు" అని విశ్వసించి భూములు ఇచ్చారు. కానీ అభివృద్ధి ఆలస్యమైంది.

రాజకీయ కోణం

అమరావతి ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ ఆధిపత్యంలో ఉంది. వైఎస్ఆర్‌సీపీ పాలనలో స్తంభించింది. ఇప్పుడు కూటమి అధికారం చేపట్టిన తరువాత తిరిగి వేగం పుంజుకుంది. కానీ ఈ మార్పు ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిని తెచ్చిపెట్టే అంశం. సమీకరణను పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తుంది. వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు సమీకరణను ప్రశంసించాయి. కానీ ఆచరణలో బలవంతంగా తీసుకున్నారని కొంతమంది రైతుల ఆరోపణలు చేశారు.

ఖరీదైన పరిహారం

భూ సేకరణకు మారడం ప్రభుత్వ ఖర్చును పెంచుతుంది. 2013 చట్టం కింద పరిహారం ఖరీదైనది. ఇది అభివృద్ధి బడ్జెట్‌ను ప్రభావితం చేస్తుందా అనేది చర్చ? పూలింగ్ ను వ్యతిరేక రైతులు చాలామంది చిన్న రైతులు (మార్జినల్ ఫార్మర్స్). వారికి నగదు తక్షణం అవసరం. కానీ సమీకరణ రైతులకు ఇప్పుడు ప్లాట్ల విలువ పెరిగినా (2025లో మార్కెట్ బూమ్) ఆలస్యం వల్ల నష్టపోయారు.

భవిష్యత్ పాఠాలు

ఈ పరిణామం భూ సమస్యల్లో రైతుల సమ్మతి, రాజకీయ స్థిరత్వం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. సమీకరణ వంటి వినూత్న పథకాలు మంచివైనప్పటికీ అమలు లోపాలు, కోర్టు జోక్యాల వల్ల వైఫల్యాలు వస్తాయి. ప్రభుత్వం ప్రస్తుతం సమీకరణను ప్రోత్సహిస్తూనే ఉంది. కానీ సేకరణకు మారడం ఒక రాజీ.

మొత్తంగా ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన రైతులు "నెగ్గారు" అని చెప్పవచ్చు. వారి పట్టుదల ఫలించింది. కానీ ఇది అమరావతి ప్రాజెక్టు మొత్తానికి ఒక హెచ్చరిక. రైతుల ప్రయోజనాలను సమతుల్యం చేయకపోతే, అభివృద్ధి ఆలస్యమవుతుంది. ప్రభుత్వం ఇప్పుడు 1,800 ఎకరాల సేకరణను వేగంగా పూర్తి చేసి, మిగిలిన 10,000 ఎకరాలపై దృష్టి పెట్టాలి. లేకపోతే అమరావతి ఒక స్వప్నంగానే మిగిలిపోయే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

భూ సేకరణ ముఖ్యమైన మలుపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి భూ సమస్యలు ఒక ముఖ్యమైన అంశంగా ఉన్నాయి. 2014-15లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి 'భూ సమీకరణ' (Land Pooling Scheme - LPS) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒక వినూత్నమైన విధానం. రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా, అభివృద్ధి చెందిన నగరంలో ప్లాట్లు, వార్షిక రాయితీలు, పెన్షన్లు వంటి ప్రయోజనాలు పొందవచ్చు. ఇది 2013 భూ సేకరణ చట్టం కింద నగదు పరిహారం కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. మొదటి దశలో దాదాపు 33,000 ఎకరాలు సమీకరించారు. 28,000 మంది రైతులు ఇందులో భాగస్వాములు. కానీ పది సంవత్సరాల తర్వాత, ప్రభుత్వం భూ సమీకరణను పక్కన పెట్టి, భూ సేకరణకు మారడం ఒక ముఖ్యమైన మలుపు.

ఎందుకు ఈ మార్పు?

సెప్టెంబర్ 2, 2025న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 52వ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మునిసిపల్ శాఖ మంత్రి పి నారాయణ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం అమరావతిలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. కొన్ని చిన్న చిన్న భూ భాగాలు (1 నుంచి 5 ఎకరాల వరకు) సమీకరణలోకి రాలేదు. ఈ విధంగా ప్రస్తుతానికి 1,800 ఎకరాలు ఉన్నాయి. ఈ భూమిని సేకరణ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పూలింగ్ ను వ్యతిరేకించే రైతుల డిమాండ్

మొదటి నుంచి కొంతమంది రైతులు భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు. వారు 2013 చట్టం కింద నగదు పరిహారం (మార్కెట్ విలువకు 4 రెట్లు, ఇతర ప్రయోజనాలు) కోరుతున్నారు. సమీకరణలో చేరితే రావాల్సిన ప్లాట్లు, రాయితీలు కోల్పోవడం ఇష్టం లేదని వారు చెబుతున్నారు. ఈ రైతులు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. విచారణలు జరుగుతున్నాయి.

ప్రభుత్వ ఒత్తిడి

పది సంవత్సరాలుగా ఈ సమస్యలు సాగుతున్నాయి. 2019-2024 మధ్య వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి అభివృద్ధిని స్తంభింపజేసింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, వేగవంతమైన అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. మంత్రి నారాయణ మాటల్లో, "సమీకరణలో చేరితే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎక్కువ, కానీ ఇప్పుడు సేకరణ ద్వారా ముందుకు సాగాలి."

భూ సేకరణ కోరింది చిన్న రైతులు

2024 నవంబర్ నాటికి ప్రభుత్వం 34,000 ఎకరాలు 28,000 మంది రైతుల నుంచి సమీకరించింది. దాదాపు 3,500 ఎకరాల భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరించారు. ఈ భూములు చిన్న చిన్న భాగాలుగా (సగటున 2-3 ఎకరాలు) ఉండటంతో, ఇందులో 1,800 వరకు రైతులు ఉన్నారు. ఎంత మంది రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చేందుకు వ్యతిరేకించారనే సమాచారం సీఆర్డీఏ వెల్లడించడం లేదు. ప్రస్తుతం 1,800 ఎకరాల సేకరణలో "చిన్న రైతులు" (small group) ఉన్నారని మంత్రి నారాయణ చెప్పారు. ఈ రైతులు మొదటి నుంచి 2013 చట్టం కింద పరిహారం కోరుతూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. విచారణలు కొనసాగుతున్నాయి.

కోర్టు క్లియరెన్స్ తీసుకోవాలి

అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. ప్రస్తుతం 1,800 ఎకరాలకు సంబంధించి రాజ్యాంగ ప్రకారం మాకు రావాల్సిన పరిహారం చెల్లించి మా భూములు ప్రభుత్వం తీసుకోవచ్చు. ల్యాండ్ పూలింగ్ వద్దనుకునే రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు క్లియరెన్స్ తీసుకుని మా భూములు తీసుకోవచ్చని ప్రముఖ న్యాయవాది మల్లెల శేషగిరిరావు తెలిపారు. 227 మందికి చెందిన 1,800 ఎకరాల భూములు ఉన్నాయని, తమకు పరిహారం చెల్లించి తమ భూములు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నా వారు ముందుకు రాలేదన్నారు.

సేకరణలో తీసుకుంటే మంచిదే...

‘భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన వారికి నేటికీ వారికి ఇవ్వాల్సిన ప్లాట్లు కేటాయించలేదు. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన వారికి ఇప్పుడు సేకరణ ద్వారా తీసుకుంటామంటున్నారు’. దీని కారణంగా రైతుల మధ్య స్పర్థలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మా భూములు సేకరణలో తీసుకుని మాకు పరిహారం ఇస్తే మంచిదేనని ఉండవల్లికి చెందిన రైతు నాయకుడు కె జగదీశ్వరెడ్డి చెప్పారు. భూ సేకరణను ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని గతంలో అమరావతిలో పర్యటించిన మేధా పాట్కర్ కూడా ప్రశ్నించిందని ఆయన గుర్తు చేశారు.

Tags:    

Similar News