లడ్డు కల్తీ :సనాతన ధర్మంపై దాడే.. వైసీపీపై నిప్పులు చెరిగిన పవన్

తిరుమల లడ్డు విషయంలో తప్పులు జరుగుతున్నాయని చెప్పినా పట్టించుకోలేదు. ఆనాటి టీటీడీ బోర్డు దీనికి బాధ్యత వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

Update: 2024-10-03 15:19 GMT

సనాతన ధర్మంపై దాడి జరుగుతుంటే చూస్తూ కూర్చోను. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ చేయడం వల్ల అపవిత్రమైంది. దీనికి ఆనాటి టీటీడీ బోర్డు చైర్మన్లు, సభ్యులే కారణం. అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఆరోపణలను పునురుద్ఘాటించారు. దీనికి వైసీపీ నైతిక బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇందులో మాజీ సీఎం వైఎస్. జగన్ ప్రమేయంతో తప్పుజరిగిందని నేనెక్కడా చెప్పలేదు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాల తడుముకున్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ నియమించిన బోర్డు నిర్వాకం వల్లే ఇదంతా జరిగిందని పవన్ కళ్యాణ్ ఎత్తి చూపించారు.


తిరుపతిలో గురువారం రాత్రి ఎస్వీ యూనివర్సిటీ సమీపంలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద జరిగిన సభలో వారాహి డిక్లరేషన్ - 2024ను వెల్లడించారు. డిప్యూటీ సీఎం గానూ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడికి రాలేదు. సగటు హిందువుగా సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా భారతీయుడుగా మీ ముందుకు వచ్చాను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు .ఎన్నికల సమయంలో నేను తిరుపతికి వచ్చినప్పుడు తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో అపచారం జరుగుతోందని హెచ్చరించాను. అప్పటి వైసీపీ పాలకులు, బోర్డు అధ్యక్షుడు, సభ్యలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు తాము శుద్ధ పప్పులమని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ నిప్పులు జరిగారు.

ఎదురుదాడి ఏంటి జగన్
ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ అంశంపై చెప్పారు. దానిపై మాట్లాడాం. మినహా వైయస్ జగన్ కల్తీ చేశాడని ఎక్కడైనా చెప్పామా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్ పాలనలో నియమించిన టీటీడీ బోర్డు అధ్యక్షులు, పాలకమండలి సభ్యుల కాలంలో తప్పు జరిగింది. ఇందులో సందేహం లేదు అని తన ఆరోపణను పునరుద్ఘాటించారు.. గుమ్మడికాయల దొంగ అంటే భుజాల తోడుకున్నట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ ఉలిక్కిపడుతున్నారని ఆయన చురకలంటించారు. టీటీడీ బోర్డు లో తప్పులు జరిగాయి అంటున్నాం. దీనికి విచారణకు సహకరిస్తామని చెప్పకుండా, కూటమిపై ఎదురుదాడికి చేస్తున్నారంటూ ఆయన నిలదీశారు.
ధర్మారెడ్డి ఎక్కడున్నావ్...

వైసీపీ ప్రభుత్వ కాలంలో తిరుమల అదనపు ఈవోగా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డికి చేసిన నిర్వాకాలకు అంతం లేకుండా పోయిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. "కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై వివాదం సాగుతుంటే ఏ కలుగులో దాక్కున్నావు ధర్మారెడ్డి" అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. లడ్డు విషయంలో అసలు కల్తీనే జరగలేదని వైసీపీ మాట్లాడుతోంది ఇలా ప్రజలను తప్పదో పట్టించి మోసగించాలని చూస్తారా? అని పవన్ వారిని సూటిగా నిలదీశారు.. ఈ వ్యవహారానికి ప్రత్యక్ష సాక్షి అయిన టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఎక్కడికి వెళ్లారు? ఇప్పటివరకు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన నిలదీశారు.
సనాతన ధర్మం పాటించావా?
"మీ అబ్బాయి చనిపోతే నేను వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను ఒక మానవత్వం ఉన్న మనిషిని. హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తిని"అని పవన్ కళ్యాణ్ టిటిడి మాజీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
"హిందుత్వంపై గౌరవం, విశ్వాసముంటే రోజుల వ్యవధిలోని ఆలయాల్లో క్రతువులు నిర్వహించడానికి ఎలా రాగలిగావు" అని ఆయన ప్రశ్నించారు. శ్రీవారి ఆలయమే కాదు సాయిబాబా ఆలయాలు ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎక్కడ చూసినా కనిపించవు. ఇది హిందూత్వం, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులు వ్యవహరించే తీరు ఇదేనా అని ధర్మారెడ్డిని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఏ కలుగులో దాక్కుని ఉన్నా సరే బయటికి తీసుకుని వచ్చి తగు రీతిలో బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.
2004లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏడాది తర్వాత ఏవి ధర్మారెడ్డి ప్రత్యేక అధికారిగా తిరుమలలో పనిచేశారు. ఆ సమయంలో కూడా మీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ధర్మారెడ్డి అని గుర్తు చేశారు. వాటన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని హెచ్చరించారు. గత ఐదేళ్లలో ఉన్నాయి కాదు.. పాతికేళ్ల క్రితం జరిగిన వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏవీ ధర్మారెడ్డి చేసిన పనులన్నీ బయటికి తీస్తాం అని పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.
చూస్తూ ఊరుకోను..
తిరుమల శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమ్మతోడు.. తాను ఇలా బయటికి వచ్చి మాట్లాడాల్సిన రోజు వస్తుందని ఊహించలేదని ఆవేదన చెందారు. ధ్యాన నరసింహస్వామి ఆలయం చెంత నాకు అన్నప్రాసన జరిగింది. తిరుపతి బాలాజీ కాలనీలో యోగిని రాజేశ్వరి వద్ద యోగ అభ్యసనం చేశా. అని తన బాల్యాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. చుక్తిగతంగా తనకు అన్యాయం జరిగిందని ఇక్కడికి రాలేదు. ధర్మానికి తీరని అవమానం జరిగింది. అన్ని ధర్మాలను గౌరవించే సనాతన ధర్మంపై దాడులు చేస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చోలేను" అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆ దాడుల నుంచి సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం ఒక్కటై గళం వినిపించాలని పిలుపు ఇవ్వడానికే వచ్చాను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రాణ త్యాగానికి కూడా తాను సిద్ధంగా ఉంటానని వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక సనాతన ధర్మం అన్నారు.
Tags:    

Similar News