లడ్డూ వివాదంపై మరో 24 గంటలు ఉత్కంఠ, సుప్రీం కేసు రేపటికి వాయిదా

తిరుపతి లడ్డూ వివాదంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టుకు చేరిన ఈ వివాదంపై తీర్పును రేపటికి వాయిదా వేసింది.

Update: 2024-10-03 10:30 GMT

తిరుపతి లడ్డూ వివాదంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టుకు చేరిన ఈ వివాదంపై తీర్పును రేపటికి వాయిదా వేసింది. తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో గొడ్డుకొవ్వును వైసీపీ హయాంలో వాడారన్న చంద్రబాబు ఆరోపణపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై ప్రాధమిక విచారణ సెప్టెంబర్ 30న జరిగింది. విచారణ తిరిగి అక్టోబర్ 3న జరుగుతుందని, ఆ రోజు తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. అనుకున్న సమయం ప్రకారం ఈవేళ సాయంత్రం 3.30 గంటలకు కేసును జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ తీసుకుంది. లడ్డూ తయారీపై నివేదికను సమర్పించేందుకు సమయం కావాలని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీంతో ధర్మాసనం ఈ కేసు తీర్పును శుక్రవారం అంటే అక్టోబర్ 5వ తేదీ ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి తరఫు న్యాయవాదులు, చంద్రబాబు తరఫు న్యాయవాదులు, టీటీడీ నియమించుకున్న లాయర్లు హాజరయ్యారు. కేసు ప్రారంభంలోనే తుషార్ మెహతా తన అభ్యర్థనను ముందు పెట్టడంతో కేసు విచారణ కేవలం 5 నిమిషాల్లోనే ముగిసింది. రేపటి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
సిట్ విచారణ వాయిదా...
వైఎస్సార్‌సీపీ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొన్న ఒక రోజు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను నిలిపివేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున విచారణ నిలిపివేస్తున్నట్టు తెలిపింది.
సిట్‌ ఏర్పాటుపైనా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గత సోమవారం కొన్ని వాదనలు జరిగాయి. తదుపరి విచారణను అక్టోబర్‌ 3న కొనసాగునుంది. అప్పటి వరకు సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ఏపీ‌ డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు చెప్పారు. అంతకుముందు సిట్ దర్యాప్తు బృందం రెండు రోజుల పాటు టీటీడీలోని వివిధ ప్రాంతాలలో పర్యటించింది. సమాచారాన్ని సేకరించింది. నమూనా సేకరించింది. "సిట్ అధికారులు కొందరి స్టేట్‌మెంట్‌లు నమోదు చేశారు. సుప్రీంకోర్టు లో కేసు ఉండడంతో కొంతకాలం దర్యాప్తు నిలిపివేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి దర్యాప్తు నిలిపివేస్తున్నాం” అని చెప్పారు. ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడడం తగదని కూడా చెప్పారు.
లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారంటూ అవాస్తవమైన వాస్తవాల ఆధారంగా బహిరంగంగా ఆరోపణలు చేసే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచి ఉండాల్సిందని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం.
సుప్రీంకోర్టులో వాదనలు ఇలా...
ల్యాబ్ పరీక్ష నివేదిక "అస్సలు స్పష్టంగా లేదు" అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తిరస్కరించిన నెయ్యిని పరీక్షకు ఎలా పంపుతారని ప్రశ్నించింది. ఈ నివేదిక లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యి కాదని నివేదిక స్పష్టంగా పేర్కొన్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. "మీకు ఖచ్చితంగా తెలియనపుడు ఆ రిపోర్టును తీసుకుని మీడియా ముందుకు ఎలా వెళ్లారని" అని బెంచ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున వాదించిన లాయర్లను ప్రశ్నించింది.
రాష్ట్రం నియమించిన సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలా అనే విషయంలో తమకు సహకరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది.
లడ్డూ వివాదం ఇలా మొదలైంది...
2024 సెప్టెంబర్ 18.
టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో గొడ్డు కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారని చెప్పడంతో వివాదం మొదలైంది.
సెప్టెంబర్ 19- తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గుజరాత్ లోని ఎన్.డీ.డీ.సీ నివేదికను బయటపెట్టారు.
సెప్టెంబర్ 20- తిరుమల తిరుపతి దేవస్థానం ఇవో జే.శ్యామలరావు ప్రెస్ కాన్ఫరెన్స్- కల్తీ నిజమేనని, కొన్ని ట్యాంకర్ల నమూనాలను టెస్టింగ్ కి పంపామని చెప్పడం
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ప్రకటన
టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చంద్రబాబుకు సవాల్, కల్తీ నెయ్యిని నిరూపించాలని పిలుపు
సెప్టెంబర్ 21- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్- చంద్రబాబు ఆరోపణలకు ఖండన, డైవర్షన్ పాలిటిక్స్ అని ఆరోపణ
సెప్టెంబర్ 22- జగన్ తిరుమల వెళితే డిక్లరేషన్ ఇవ్వాలని టీడీపీ, బీజేపీ, విహెచ్పీ శ్రేణుల డిమాండ్
సెప్టెంబర్ 23- సుబ్రమణ్యస్వామి రంగ ప్రవేశం, సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నట్టు ప్రకటన
సెప్టెంబర్ 25- ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు
సెప్టెంబర్ 26- సిట్ కి అధికారుల నియామకం
సెప్టెంబర్ 27- జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్- టీటీడీ ఇవో ప్రకటనకి చంద్రబాబు ప్రకటనకీ సంబంధం లేదని ప్రకటన
సెప్టెంబర్ 28- జగన్ తిరుమల వెళితే డిక్లరేషన్ ఇవ్వాలన్న డిమాండ్ తో టూర్ ను రద్దు చేసుకున్న జగన్
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ
సెప్టెంబర్ 29- తిరుమలలో సిట్ అధికారుల పర్యటన
సెప్టెంబర్ 30- టీటీడీ అధికారులు, ఇతర వర్గాల నుంచి స్టేట్ మెంట్లు స్వీకరించిన సిట్ బృందం
సెప్టెంబర్ 30- సుప్రీంకోర్టులో కేసు విచారణ, చంద్రబాబు ప్రకటనను తప్పుబట్టిన సుప్రీం కోర్టు
అక్టోబర్ -1- నిలిచి పోయిన సిట్ దర్యాప్తు
అక్టోబర్ 3- సుప్రీంకోర్టులో తిరిగి విచారణ, రేపటికి వాయిదా
అక్టోబర్ 4- సుప్రీంకోర్టులో ఉదయం 10.30కి విచారణ మొదలు
Tags:    

Similar News